BJP Minister Chouhan: ఏపీని ఆదుకుంటామని హామీ ఇచ్చిన కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌ సింగ్ చౌహాన్-union agriculture minister shivraj singh chouhan conducts aerial survey of flood hit areas in ap ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Bjp Minister Chouhan: ఏపీని ఆదుకుంటామని హామీ ఇచ్చిన కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌ సింగ్ చౌహాన్

BJP Minister Chouhan: ఏపీని ఆదుకుంటామని హామీ ఇచ్చిన కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌ సింగ్ చౌహాన్

Bolleddu Sarath Chandra HT Telugu
Sep 06, 2024 11:38 AM IST

BJP Minister Chouhan: రాష్ట్రానికి పూర్తి మ‌ద్ద‌తు, స‌హాయ‌స‌హ‌కారాలు అందిస్తామని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌ సింగ్ చౌహాన్‌ ప్రకటించారు. బుడ‌మేరు స‌మీపంలో నిర్వ‌హించిన అక్ర‌మ త‌వ్వ‌కాలు కూడా విప‌త్తు‌కు ఒక కార‌ణమని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు
కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు

BJP Minister Chouhan: బుడమేరు ముంపుతో తీవ్రంగా నష్టపోయిన విజయవాడ నగరాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని కేంద్ర మంత్రి శివరాజ్‌ సింగ్ చౌహాన్ ప్రకటించారు. విజ‌య‌వాడ న‌గ‌రంలో ఎవ‌రూ ఊహించ‌ని విధంగా కురిసిన 400 మిమీ వ‌ర్ష‌పాతంతో కూడిన వ‌ల్ల వ‌ర‌ద విప్త‌తు సంభ‌వించింద‌ని.. బుడ‌మేరుకు ప‌డిన గండ్లువ‌ల్ల విజ‌య‌వాడ‌కు ఇలాంటి క్లిష్ట‌మైన వ‌ర‌ద ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.

విప‌త్క‌ర ప‌రిస్థితుల‌ను ఎదుర్కొనేందుకు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు క‌లెక్ట‌ర్ కార్యాల‌యాన్ని క్యాంపు కార్యాల‌యంగా మార్చుకొని అధికార బృందానికి నేతృత్వం వ‌హిస్తూ 24 గంట‌లూ శ్ర‌మించి స‌హాయ కార్య‌క్ర‌మాల‌ను ముందుండి న‌డిపినందుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

ఇలాంటి సంక్లిష్ట‌మైన వ‌ర‌ద ప‌రిస్థితుల్లో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో ప‌నిచేయ‌డం.. దానికి ముఖ్య‌మంత్రి నాయ‌క‌త్వం వ‌హించ‌డం గొప్ప విష‌య‌మ‌ని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ఎదుర్కొంటున్న సంక‌ట ప‌రిస్థితిని కేంద్ర ప్ర‌భుత్వం గుర్తించింద‌ని.. ఈ రాష్ట్రానికి పూర్తి మ‌ద్ద‌తును, స‌హాయ‌స‌హ‌కారాల‌ను కేంద్రం అందిస్తుంద‌ని అన్నారు. ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థ‌న మేర‌కు వారు కోరిన విధంగా ఎన్‌డీఆర్ఎఫ్ బృందాల‌ను, వైమానిక హెలికాప్ట‌ర్ల‌ను ప్ర‌ధాన‌మంత్రి వెంట‌నే పంపించారని, రాష్ట్ర ప్ర‌భుత్వ, కేంద్ర ప్ర‌భుత్వ విప‌త్తు స్పంద‌న బ‌ల‌గాలు క‌లిసిక‌ట్టుగా ప‌నిచేసి వ‌ర‌ద‌ బారిన‌ ప‌డిన ప్ర‌జ‌ల‌ను ర‌క్షించ‌డం, వారికి దైనందిక అవ‌స‌రాల‌ను తీర్చ‌డంలో కృషి చేశాయ‌ని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్ర‌భుత్వం స‌రైన రీతిలో స్పందించిన కార‌ణంగానే మ‌ర‌ణాలు ఇంత త‌క్కువగా సంభ‌వించాయ‌ని.. లేకుంటే పరిస్థితి వేరుగా ఉండేద‌ని మంత్రి తెలిపారు. వ‌ర‌ద నీటిలో అధికారులు, అన‌ధికారులు, ఎన్నికైన ప్ర‌జాప్ర‌తినిధులు క‌ల‌సి ప‌నిచేయ‌డం ప్ర‌జ‌ల సంక్షేమానికి నిల‌బ‌డ‌టం హ‌ర్ష‌ణీయ‌మ‌న్నారు.

వ‌ర‌ద ప్రాంతాల్లో ప‌ర్య‌టించి అయిదు రోజులుగా వ‌ర‌ద నీటిలో ఉన్న బాధితుల‌ను ప‌రామ‌ర్శించి, ప్ర‌భుత్వం అందించిన సేవ‌ల‌ను అడిగి తెలుసుకున్నాన‌ని.. అంద‌రూ వారికి కావాల్సిన నిత్యావ‌స‌రాలైన ఆహారం, పాలు, నీరు స‌కాలంలో ప్ర‌భుత్వం అందించింద‌ని తెలిపార‌ని వివ‌రించారు. దేశంలోనే మొట్ట‌మొద‌టిసారిగా సాంకేతిక‌త‌ను వినియోగించి.. వ‌ర‌ద స‌హాయ‌క చ‌ర్య‌ల్లో భాగంగా డ్రోన్ల స‌హాయంతో ఆహార ప్యాకెట్లు, మంచినీటి బాటిళ్లను బాధితుల‌కు చేర‌వేయ‌డం మంచి ఆలోచ‌న అని మంత్రి కొనియాడారు.

కేంద్ర పంట‌ల బీమా ప‌థ‌కం ద్వారా రైతుల‌కు పూర్తి ల‌బ్ది:

కేవ‌లం వ‌ర‌ద స‌హాయక కార్య‌క్ర‌మాలే కాకుండా వ‌ర‌ద నీరు త‌గ్గాక పారిశుద్ధ్య కార్య‌క్ర‌మాల‌తో పాటు ఫైర్ ఇంజిన్ల ద్వారా ఇళ్ల‌ను, రోడ్ల‌ను శుభ్ర‌ప‌ర‌చ‌డం.. అంటువ్యాధులు ప్ర‌బ‌ల‌కుండా యుద్ధ‌ప్రాతిప‌దిక‌న పారిశుద్ధ్య కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డం.. వీట‌న్నింటినీ స్వ‌యంగా ముఖ్య‌మంత్రి ప‌ర్య‌వేక్షించ‌డం హ‌ర్ష‌నీయ‌మ‌ని మంత్రి అన్నారు.

బుడ‌మేరుకు పడిన గండ్ల‌ను పూడ్చ‌డానికి కేంద్ర ర‌క్ష‌ణ బ‌ల‌గాల స‌హాయం అవ‌స‌ర‌మ‌ని ముఖ్య‌మంత్రి కోరార‌ని.. ఆ గండ్ల‌ను పూడ్చి వ‌ర‌ద‌ను ఆపాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. అందుకే వారు కోరిన విధంగా త్వ‌ర‌లోనే బ‌లగాల‌ను పంపిస్తామ‌ని హామీ ఇచ్చారు. ఈ విప‌త్తును భ‌విష్య‌త్తులో రాకుండా ఎదుర్కొనేందుకు కొన్ని స్వ‌ల్ప‌కాలిక‌, మ‌రికొన్ని దీర్ఘ‌కాలిక ప్ర‌ణాళిక‌ల ద్వారా చ‌ర్య‌లు చేప‌ట్టాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని అన్నారు.

70 సంవ‌త్స‌రాల డేటా ప్ర‌కాశం బ్యారేజ్‌కు 11.90 ల‌క్ష‌ల క్యూసెక్కుల ప్ర‌వాహాన్ని త‌ట్టుకునే సామ‌ర్థ్యం ఉంద‌ని.. అయితే ఒకేసారి వ‌ర‌ద ముంపును త‌ట్టుకొనే సామ‌ర్థ్యాన్ని పెంచే విష‌య‌మై ప్ర‌ణాళిక‌ను రూపొందించాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని ముఖ్య‌మంత్రి కోరిన విధంగా ఈ విష‌యాన్ని అంచ‌నా వేసేందుకు కేంద్ర‌బృందాన్ని కేంద్ర హోంమంత్రివ‌ర్యులు అమిత్‌షా పంప‌డం జ‌రిగింద‌ని.. దీనిపై త‌గు నిర్ణ‌యం తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌ని చవాన్‌ వెల్ల‌డించారు.

అక్రమ తవ్వకాలు కూడా కారణం…

గత ప్ర‌భుత్వం బుడ‌మేరు స‌మీపంలో నిర్వ‌హించిన అక్ర‌మ త‌వ్వ‌కాలు కూడా వ‌ర‌ద విప‌త్తున‌కు ఒక కార‌ణ‌మ‌ని చవాన్ అన్నారు. వరదలతో 1.80 ల‌క్ష‌ల హెక్టార్ల‌లో రెండు ల‌క్ష‌ల మంది రైతుల‌కు వ్య‌వ‌సాయ, ఉద్యానవ‌న పంట‌ల న‌ష్టం వాటిల్లింద‌ని తెలిపారు.

న‌ష్టాన్ని అంచ‌నా వేసేందుకు ఎన్‌డీఆర్ఎఫ్‌, వ్య‌వ‌సాయ, ప్ర‌ణాళిక‌ బృందాలు ఇప్ప‌టికే త‌మ ప‌ని ప్రారంభించార‌ని.. గ‌త ప్ర‌భుత్వం పంట‌ల బీమా ప్రీమియం క‌ట్టని కార‌ణంగా రైతుల‌కు న‌ష్టం వాటిల్లింద‌ని.. ప్ర‌స్తుత ఎన్‌డీఏ ప్ర‌భుత్వం ఆ త‌ప్పిదం చేయ‌ద‌ని.. కేంద్ర పంట‌ల బీమా ప‌థ‌కం ద్వారా వ‌చ్చే ల‌బ్ధిని రైతుల‌కు పూర్తిగా ద‌క్కుతుంద‌ని అన్నారు.

విప‌త్క‌ర స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిల‌బ‌డ‌ట‌మే ఎన్‌డీఏ ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని గౌర‌వ ప్ర‌ధాన‌మంత్రి మోదీ రాష్ట్ర ప్ర‌భుత్వానికి కావాల్సిన అన్ని ర‌కాల స‌హాయ‌స‌హ‌కారాల‌ను అందిస్తుంద‌ని.. ఇప్ప‌టికే రాష్ట్రానికి విచ్చేసిన కేంద్ర బృందాలు త‌మ అంచ‌నాల‌ను కేంద్రానికి స‌మ‌ర్పిస్తాయ‌ని తెలిపారు.

కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు స‌మైఖ్యంగా సంక‌ట ప‌రిస్థితుల నుంచి ప్ర‌జ‌ల‌ను గ‌ట్టెక్కించే ప్ర‌య‌త్నం చేస్తూ దీర్ఘ‌కాలిక ప్రణాళిక ద్వారా ఇలాంటి స‌మ‌స్య‌లు ఉత్ప‌న్నం కాకుండా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని శివ‌రాజ్‌సింగ్ చౌహాన్ చెప్పారు.

వ‌ర‌ద న‌ష్టంపై ఫొటో ఎగ్జిబిష‌న్‌:

అంతకు ముందు వరద నష్టంపై విజయవాడ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. ముఖ్య‌మంత్రి చంద్రబాబుతో కలిసి తిలకించారు. కృష్ణా నది, బుడమేరు వరద ముంపునకు గురైన ప్రాంతాలు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్‌, పోలీసు తదితర విభాగాల ద్వారా రెస్క్యూ, సహాయ పునరావాస చర్యలు, ఆహారం, తాగునీరు, ఇతర సహాయ చర్యలను, జరిగిన పంట, ఆస్తి, పశు నష్టం వివరాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, సమాచార శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా కేంద్రమంత్రికి వివరించారు.