Reddys Lab Molecule: రెడ్డీస్‌ ల్యాబ్‌లో కోట్ల ఖరీదు చేసే టైప్‌2 డయాబెటిస్‌ మాలిక్యూల్ చోరీ.. పోలీసులకు ఫిర్యాదు-type 2 diabetes molecule worth crores stolen from reddys lab ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Reddys Lab Molecule: రెడ్డీస్‌ ల్యాబ్‌లో కోట్ల ఖరీదు చేసే టైప్‌2 డయాబెటిస్‌ మాలిక్యూల్ చోరీ.. పోలీసులకు ఫిర్యాదు

Reddys Lab Molecule: రెడ్డీస్‌ ల్యాబ్‌లో కోట్ల ఖరీదు చేసే టైప్‌2 డయాబెటిస్‌ మాలిక్యూల్ చోరీ.. పోలీసులకు ఫిర్యాదు

Sarath Chandra.B HT Telugu

Reddys Lab Molecule: ప్రముఖ ఔషధ తయారీ సంస్థ రెడ్డీస్‌ ల్యాబరేటరీలో కోట్ల రుపాయలు ఖర్చుతో ఆవిష్కరించిన ఔషధ రసాయినిక మూలకం చోరీకి గురి కావడం కలకలం రేపింది. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పరిశోధన కేంద్రంలో భద్ర పరిచిన మాలిక్యూల్ చోరీ అయినట్టు పోలీసులు కేసు నమెదు చేశారు.

శ్రీకాకుళం రెడ్డీస్ ల్యాబ్ పరిశోధన కేంద్రంలో భారీ చోరీ

Reddys Lab Molecule: శ్రీకాకుళం జిల్లా రెడ్డీస్ ల్యాబ్‌ పరిశోధనా కేంద్రంలో టైప్ 2 డయాబెటీస్‌ ఔషధ మూలకం చోరీకి గురైంది. కోట్లరుపాయల ఖర్చుతో ఆవిష్కరించిన కెమికల్ మాలిక్యూల్‌ను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్టు కేసు నమోదు చేశారు. టైప్ 2 మధు మేహ నియంత్రణ కోసం కొత్త రకం ఔషధాన్ని రెడ్డీస్ ల్యాబ్స్‌ పరిశోధనా విభాగం ఆవిష్కరించింది. దాని మూలకాన్ని ల్యాబ్‌లో భద్రపరచగా అది మాయమైంది.

మధుమేహం నియంత్రణ పరిశోధనల్ని మలుపు తిప్పే ఆవిష్కరణ చోరీకి గురి కావడం కలకలం రేపుతోంది.ఏపీకి చెందిన దిగ్గజ ఔషధ తయారీ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ ఆధ్వర్యంలో టైప్ 2 డయాబెటిస్‌పై చేసిన పరిశోధనలు ఫలించి కొత్త రకం ఔషధాన్ని రూపొందించారు. ఈ ఔషధ తయారీకి సంబంధించిన కొత్త కెమికల్ మాలిక్యూల్ ను ఆవిష్కరించారు.

మధుమేహ చికిత్సల కోసం ఆవిష్కరించిన మూలకాన్ని పౌడర్ రూపంలో ఉన్న రసాయినిక మిశ్రమాన్ని రెడ్డీస్ లేబోరేటరీ పారిశ్రామికంగా అభివృద్ధి చేసి టాబ్లెట్స్‌, ఇంజక్షన్ల రూపంలో మార్కెట్‌లోకి తీసుకురావాలని భావిస్తోంది. ఈ రసాయిన మిశ్రమాన్ని శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరంలోని రెడ్డీస్ ల్యాబ్‌లో భద్రపరిచారు.

రూ.కోట్ల రుపాయల పరిశోధనల ఫలితమైన రసాయినిక మిశ్రమం ఫ్యాక్టరీ ప్రాంగణం నుంచి గల్లంతైంది. ఈ వ్యవహారంపై రెడ్డీస్ ల్యాబ్స్‌ ప్రతినిధులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

దేశీయంగా ఔషధాల తయారీ…

మధుమేహం వ్యాధి నియంత్రణకు వినియోగించే పలు క రకాల మందులు పాశ్యాత్య దేశాల్లో అందుబాటులో ఉన్నాయి. సెమాగ్లుటైడ్ వంటి ఇంజక్షన్లు అయా దేశాల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ తరహా మందుల్ని భారతదేశంలో కొత్త ఔషధాల రూపంలో అందుబాటులోకి తేవాలని ఫార్మా కంపెనీలు పరిశోధనలు చేస్తున్నాయి.

ఈ క్రమంలో డాక్టర్ రెడ్డీస్ పరిశోధనా విభాగం అభివృద్ధి చేసిన మాలిక్యూల్ చోరీకి గురి కావడం ఔషధ తయారీ సంస్థల మధ్య పోటీతో జరిగినట్టు భావిస్తున్నారు. కొత్త మిశ్రమాన్ని పౌడర్ రూపంలో అభివృద్ధి చేశారు. టైప్ 2 మధుమేహాన్ని సమర్ధ వంతంగా నియంత్రించ గలిగేలా ఈ ఫార్మా ఇన్లైడెంట్(ఏపీఐ)ని వృద్ధి చేశారు.

ఇంటి దొంగల పనేనా…

450 గ్రాముల ఔషధ మిశ్రమాన్ని వేర్వేరు ప్యాకెట్లలో భద్రపరిచారు. ఫిబ్రవరి 17న వీటిని స్టోర్ చేయగా మార్చి 3న చోరీ జరిగినట్టు గుర్తించారు. ఘటనపై డాక్టర్ రెడ్డీస్ పరిశోధనా కేంద్రం సైట్ హెడ్ గణేశ్ శంకరన్ డ్రగ్ అథారిటీస్ కు, శ్రీకాకుళం జిల్లా పోలీసులకు పిర్యాదు చేశారు.

నిఘా ఎక్కువగా ఉన్న కంపెనీలో రూ.కోట్ల విలువ చేసే ఔషధ మిశ్రమం చోరీకి గురి కావడం చర్చనీయాంశంగా మారింది. దీని వెనుక ప్రత్యర్థి కంపెనీలతో పాటు విద్రోహ చర్య ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇంటి దొంగలపై కూడా సందేహాలు ఉన్నాయి. ఈ ఘటనపై డాక్టర్ రెడ్డీస్ యాజమాన్యం సంబంధిత విభాగంలో పనిచేస్తున్న సిబ్బందిపై వేటు వేసినట్టు సమాచారం.

జిల్లా ఎస్పీకి సమాచారం అందడంతో ఆయన విచారణ చేపట్టారు. పరిశోధనలకు సంబంధించిన అంశం కావడంతో డ్రగ్ అథారిటీ సైతం దర్యాప్తు చేస్తోంది. కేసు దర్యాప్తు చేస్తున్నామని జేఆర్ పురం పోలీసులు తెలిపారు.

వ్యాపారంపై ప్రభావం చూపదన్న రెడ్డీస్ ల్యాబ్…

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంలోని రెడ్డీస్‌ ల్యాబ్‌ తయారీ కేంద్రం నుండి క్రియాశీల ఔషధ పదార్ధం (API) కనిపించడం  లేదని  సంస్థ ప్రతినిధులు హిందుస్తాన్‌ టైమ్స్‌కు ధృవీకరించారు. దీనిపై  పోలీసులకు ఫిర్యాదు చేశామని,  ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని,   ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుగుతోందని వివరించారు. శ్రీకాకుళంలో జరిగిన ఘటన తమ వ్యాపార కార్యకలాపాలపై  ఎటువంటి ప్రభావం చూపదని ప్రకటించారు. 

Sarath Chandra.B

TwittereMail
శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం