AP Bird Flu Death : పల్నాడు జిల్లాలో విషాదం.. బర్డ్‌ఫ్లూతో రెండేళ్ల చిన్నారి మృతి.. ఈ జాగ్రత్తలు తీసుకోండి-two year old child dies of bird flu in palnadu district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Bird Flu Death : పల్నాడు జిల్లాలో విషాదం.. బర్డ్‌ఫ్లూతో రెండేళ్ల చిన్నారి మృతి.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

AP Bird Flu Death : పల్నాడు జిల్లాలో విషాదం.. బర్డ్‌ఫ్లూతో రెండేళ్ల చిన్నారి మృతి.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

AP Bird Flu Death : పల్నాడు జిల్లాలో తీవ్ర విషాదం జరిగింది. బర్డ్‌ఫ్లూతో రెండేళ్ల చిన్నారి మృతిచెందింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. మృతిచెందిన చిన్నారి ఇంటి పరిసరాల్లో ఆరోగ్యశాఖ సర్వే నిర్వహించింది. జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

బర్డ్‌ఫ్లూతో రెండేళ్ల చిన్నారి మృతి (unsplash)

పల్నాడు జిల్లా నరసరావుపేటలో బర్డ్‌ఫ్లూతో రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి బర్డ్‌ఫ్లూతో మృతిచెందినట్టు ఐసీఎంఆర్ నిర్ధారించింది. పచ్చి కోడిమాంసం తినడంతో పాటు.. ఇమ్యూనిటీ తక్కువగా ఉండడమే కారణమని నిర్ధారించింది.

చికిత్స పొందుతూ..

మార్చి 4న మంగళగిరి చిన్నారి ఎయిమ్స్‌లో చేరింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మార్చి16న మృతిచెందింది. చిన్నారి మరణంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. మృతిచెందిన చిన్నారి ఇంటి సమీపంలో ఆరోగ్యశాఖ సర్వే నిర్వహించింది. అనుమానిత లక్షణాలున్న వారెవరూ లేరని అధికారులు నిర్ధారణకు వచ్చారు. పల్నాడు జిల్లాలో బర్డ్‌ఫ్లూ వ్యాప్తి లేదని అధికారులు స్పష్టం చేశారు.

బర్డ్ ఫ్లూ ప్రమాదకరం..

బర్డ్‌ఫ్లూ అనేది ప్రధానంగా పక్షులలో కనిపించే ఒక ప్రమాదకరమైన వైరస్. అయినప్పటికీ చాలా అరుదైన సందర్భాల్లో ఇది మనుషులకు కూడా సోకే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. బర్డ్‌ఫ్లూ వైరస్‌తో చనిపోయిన లేదా సోకిన పక్షులను తాకడం, సోకిన పక్షుల విసర్జన, లాలాజలం లేదా ఇతర శరీర ద్రవాలతో ప్రత్యక్ష సంబంధం ఉన్నవారికి బర్డ్ ఫ్లూ వస్తుందని వైద్యులు చెబుతున్నారు.

లక్షణాలు ఏంటి..

బర్డ్ ఫ్లూ సోకిన పక్షుల వ్యర్థాలతో కలుషితమైన ఉపరితలాలు లేదా వస్తువులను తాకడం, పౌల్ట్రీ ఫారాలు, కోళ్ల మార్కెట్‌లు వంటి ప్రదేశాలలో వైరస్‌కు గురికావడం, కొన్ని సందర్భాల్లో సోకిన పక్షుల నుండి గాలి ద్వారా కూడా వైరస్ వ్యాపించే అవకాశం ఉంది. బర్డ్‌ఫ్లూ మనుషులకు సోకినప్పుడు, సాధారణ ఫ్లూ లక్షణాలను పోలి ఉండే లక్షణాలు కనిపిస్తాయి. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, కండరాల నొప్పి, తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కళ్లకి ఇన్ఫెక్షన్, వికారం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

జాగ్రత్తలు పాటించాలి..

బర్డ్‌ఫ్లూ సోకిన వ్యక్తులు వెంటనే వైద్యులను సంప్రదించి, సరైన చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. బర్డ్‌ఫ్లూ వ్యాప్తిని నివారించడానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలి. చనిపోయిన లేదా అనారోగ్యంతో ఉన్న పక్షులకు దూరంగా ఉండాలి. పక్షులను తాకిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. కోడి మాంసం, గుడ్లను బాగా ఉడికించి తినాలి. పౌల్ట్రీ ఫామ్‌లు, కోళ్ల మార్కెట్‌లలో ఉండే వ్యక్తులు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలి. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే వృద్ధులు, పిల్లలు బర్డ్‌ఫ్లూ ప్రభావిత ప్రాంతాలకు దూరంగా ఉండాలి.

సంబంధిత కథనం