Parvathipuram Manyam: భాష అర్థం కాలేదో ఏమో.. వద్దన్నా వెళ్లారు.. వాగులో కొట్టుకుపోయారు
Parvathipuram Manyam: పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదం జరిగింది. హర్యానాకి చెందిన ఇద్దరు టీచర్లు కొండవాగులో గల్లంతయ్యారు. ఈ ఇద్దరిలో ఒకరు మృతిచెందగా.. మరొకరు గల్లంతయ్యారు. ఆచూకీ కోసం పోలీసులు, స్థానికులు గాలిస్తున్నారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో విషాద ఘటన జరిగింది. కొండవాగులో ఇద్దరు ఉపాధ్యాయులు కొట్టుకుపోయారు. వారిద్దరూ హర్యానాకు చెందినవారు. ఇందులో ఒకరు మృతి చెందగా.. మరొకరి ఆచూకీ తెలియలేదు. కొండవాగు పొంగి ప్రవహిస్తోందని.. ఇటువైపు రావద్దని స్థానికులు చెబుతున్నా.. తెలుగు అర్థం కాకపోవడంతో ఆ ఉపాధ్యాయులు ముందుకు వెళ్లారు. దీంతో కొండవాగు నీటి ప్రవాహం పెరిగి ఉధృతంగా ప్రవహించడంతో.. వారు వాగులో కొట్టుకుపోయారు.
పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలోని కొటికిపెంటలో ఏకలవ్య మోడల్ హైస్కూల్ ఏర్పాటు చేశారు. అక్కడ వసతి సరిపోక సరాయివలస గ్రామంలోని ఆశ్రమ పాఠశాలలో తరగతులు నిర్వహిస్తున్నారు. అందులో హర్యానా రాష్ట్రానికి చెందిన ఆర్తి (23) సోషల్ (జాగ్రఫీ) ఉపాధ్యాయురాలిగా, మహేష్ వార్డెన్‌గా నెలన్నర కిందటే చేరారు. వీరిద్దరూ గురివినాయుడు పేటలో ఉంటూ పాఠశాలకు వెళ్లి వస్తుంటారు. రోజూ మాదిరిగానే శుక్రవారం కూడా విధులు ముగించుకొని ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తుండగా.. మార్గమధ్యలోని రాయిమాను వట్టిగెడ్డ వాగు పొంగి ప్రవహిస్తుండటంతో.. నీరు కావేజ్ పైకి చేరింది.
వీరి రాకను గమనించిన స్థానికులు వెనక్కి వెళ్లిపోవాలని అరిచారు. అయితే.. భాష అర్థం కాక ముందుకు రావడంతో వారిద్దరూ కొట్టుకుపోయారు. కొంత సేపటికి ఆర్తి మృతదేహం లభ్యమైంది. మహేష్ ఓ చెట్టుకొమ్మను పట్టుకొని, ఒడ్డుకు చేరే ప్రయత్నం చేయగా, కొమ్మ విరిగిపోవడంతో మళ్లీ నీటిలోనే పడి గల్లంతు అయ్యారు. మహేష్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం తెలుసుకున్న గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్, పోలీసు అధికారులను ఆదేశించారు.
గ్రామస్థుల సహకారంతో అధికారులు వాగు పొడువునా కిలో మీటరు మేర గాలింపు చర్యలు చేపట్టి ఆర్తి మృతదేహాన్ని బయటకు తీశారు. ఇసుకలో కూరుకుపోయిన ద్విచక్రవాహనాన్ని గుర్తించి బయటకు తీశారు. అప్పటికే చీకటి పడటంతో మహేష్ ఏమయ్యారో తెలియకుండా పోయింది. పోలీస్, రెవెన్యూ అధికారులు అప్రమత్తమై ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నారు. కాజ్‌వే శిథిలమైందని.. బాగు చేయాలని గత ఐదేళ్లుగా అధికారులు, ప్రజా ప్రతినిధులను ఎన్నిసార్లు వేడుకున్నా పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
( రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు )