RTGS Vs GSWS: ముఖ్యమంత్రుల్నే ఏమార్చిన రెండు వ్యవస్థలు, పార్టీల గెలుపొటముల్ని ప్రభావితం చేయడంలోను కీలక పాత్ర
RTGS Vs GSWS: రియల్ టైమ్ గవర్నెన్స్- గ్రామ, వార్డు సచివాలయాలు... ఏపీలో గత పదేళ్లలో పుట్టుకొచ్చిన రెండు కొత్త పాలనా వ్యవస్థలు... ముఖ్యమంత్రులు అత్యధికంగా ఆధార పడిన ఈ వ్యవస్థలు వాటి రూపకర్తలకు ఏ మేరకు మేలు చేశాయన్నది ఇప్పటికీ అంతు చిక్కని వ్యవహారమే.
RTGS Vs GSWS: చంద్రబాబు అధికారంలో ఉంటే రియల్ టైమ్ గవర్నెన్స్, జగన్ అధికారంలో ఉన్నపుడు గ్రామ, వార్డు సచివాలయాలు... పాలనా సంస్కరణల్లో భాగంగా గత పదేళ్లలో పుట్టుకొచ్చిన కొత్త వ్యవస్థలు ప్రజలకు ఏ మేరకు ఉపయోగపడ్డాయో కాని అధికారంలో ఉన్న వారిని ఏమార్చడంలో మాత్రం తమ వంతు పాత్ర పోషించాయి. ఓ విధంగా ప్రభుత్వాలపై ప్రజల్లో వ్యతిరేకత రావడానికి పరోక్షంగా కారణం అయ్యాయి.

రియల్ టైమ్ గవర్నెన్స్…
ప్రభుత్వ పాలనలో పారదర్శకత,వేగవంతమైన సమాచార బట్వాడా, ప్రజా సమస్యల పరిష్కారం, పాలనా పరమైన సమస్యల్ని పరిష్కరించడంలో భాగంగా 2016-17 మధ్యలో ఆర్టీజీఎస్ అవతరించింది. టెక్నాలజీని వినియోగించడంలో ముందుండే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారిత పౌర సేవల్ని అందించడం కోసం దీనిని నెలకొల్పారు.
తొలుత కృష్ణా పుష్కరాల సమయంలో సమీకృత సేవల కోసం ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ సేవల్ని వాడుకున్నారు. ఆ తర్వాత క్రమంగా అది ఆర్టీజీఎస్‌గా అవతరించింది. రాష్ట్ర విభజన తర్వాత చంద్రనబాబు ఆలోచనలకు అనుగుణంగా ఏర్పాటైన సాంకేతిక వ్యవస్థల్లో రియల్ టైమ్ గవర్నెన్స్ ఒకటి.
ప్రభుత్వ శాఖలు అన్నింటిని ఒకే తాటిపైకి తీసుకొచ్చి ఏక కాలంలో ఏ శాఖలో ఏ అంశాన్నైనా పరిశీలించేలా ఏపీ సచివాలయంలో ఆర్టీజీఎస్ వ్యవస్థను తీర్చిదిద్దారు.ఒక్క మాటలో చెప్పాలంటే విశాఖ సముద్ర తీర ప్రాంతంలో సముద్ర కెరటాలు, అటుపోట్లను కూడా వెలగపూడిలో కూర్చుని పర్యవేక్షించే అవకాశం ఆర్టీజీఎస్‌లో ఉండేది. తీర ప్రాంతాల్లో అలల తీవ్రత అధికంగా ఉన్న సమయంలో సందర్శకులు ప్రమాదానికి గురైతే ఆర్జీజీఎస్ కెమెరాల్లో పరిశీలించి విశాఖ పోలీసుల్ని అప్రమత్తం చేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. 2017లో ఆర్టీజీఎస్ ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి సమావేశాలు నిర్వహించడానికి మొగ్గు చూపేవారు.
నాణానికి మరో వైపు...
ఆర్టీజీఎస్ సానుకూలతల మాటెలా ఉన్నా దీనికి మరో కోణం కూడా ఉంది. చంద్రబాబుకు టెక్నాలజీ వినియోగంపై ఉన్న మక్కువను ఆధారం చేసుకుని 2014-19 మధ్య ప్రభుత్వాన్ని కొందరు తప్పుదోవ పట్టించారనే విమర్శలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, పౌర సేవలపై ప్రజల నుంచి నిరంతర ఫీడ్ బ్యాక్ తీసుకోవడాన్ని పాలనలో భాగం చేశారు. ఈ క్రమంలో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడంలో రికార్డు స్థాయిలో సానుకూల ప్రజాభిప్రాయలు వచ్చినట్టు నివేదికలు అందేవి.
2014-19 మధ్య జరిగిన తంతు ఇటీవల విజయవాడ నగరాన్ని బుడమేరు వరదల ముంచెత్తినపుడు కూడా కొనసాగింది. 100శాతం సానుకూల ఫలితాలు, ఫిర్యాదులు పరిష్కారం కాకపోయినా పరిష్కరించినట్టు నివేదికలు ఇవ్వడం ద్వారా ప్రభుత్వాన్ని ఏమర్చారనే ఆరోపణలు ఉన్నాయి.
ఆర్టీజీఎస్ ఏర్పాటైన తొలినాళ్లలో తుఫానులు, ప్రకృతి విపత్తులు, నష్ట పరిహారం, పంటల నష్టం, రైతు సాయం వంటి ఏ విషయంలోనైనా 80శాతం అనుకూల ఫలితాలు వచ్చేవి. వాటిని ముఖ్యమంత్రి చంద్రబాబు పరిగణలోకి తీసుకునే వారు.క్షేత్ర స్థాయి పరిస్థితులకు సీఎం ప్రకటనలకు పొంతన ఉండేది కాదు. అంతా ఫీల్ గుడ్, పాలన భేష్ అన్నట్టు సాగేది. క్షేత్ర స్థాయిలో పరిస్థితులకు ఆర్టీజీఎస్ సేకరించే ప్రజాభిప్రాయాలకు ఏమాత్రం పొంతన ఉండేది కాదు.2019లో ఓటమి పాలయ్యేవరకు చంద్రబాబు ఈ పొరపాటు ఎక్కడ జరుగుతుందనేది కూడా గుర్తించలేకపోయారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్ల పాటు ఆర్టీజీఎస్ ఏమి చేసిందో ఎవరికి తెలీదు. దాని పేరిట ఉద్యోగాలు, జీతాల చెల్లింపు మాత్రం ఆగలేదు.
జగన్ సచివాలయాలది అదే తీరు...
2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ అధ్యక్షుడు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. 1.30లక్షల శాశ్వత ఉద్యోగులు, రెండున్నర లక్షల మంది వాలంటీర్లతో సంక్షేమ పథకాలను ఇంటింటికి అందించడానికి నాలుగు లక్షల మందితో ఓ కొత్త వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రతి యాభై ఇళ్లకు ఓ వాలంటీర్‌ను నియమించి పాలనలో భాగం చేశారు.
అర్హత ఉన్న ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామంటూ 90శాతం ప్రజానీకానికి ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలు అమలు చేశారు. గ్రామ, వార్డు సచివాలయాలతో ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పౌరసేవలు అందుతాయని ప్రకటించినా గ్రామ వార్డు సచివాలయాలు కేవలం పథకాల పంపిణీకి పరిమితం అయ్యాయి. ప్రతి నెల షెడ్యూల్ ప్రకారం అందించే నగదు బదిలీ పథకాలను లబ్దిదారులకు అందించడం, లబ్దిదారుల ఎంపికలకు సచివాలయాలు పరిమితం అయ్యాయి.
రెవిన్యూ, మునిసిపల్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ఎలక్ట్రిసిటీ, ట్రాన్స్‌పోర్ట్ వంటి ఏ పౌర సేవను సచివాలయాలు నేరుగా అందించే పరిస్థితి ఉండేది కాదు. అయా ప్రభుత్వ శాఖలు అందించే సేవల్ని పొందడానికి సచివాలయాల్లో దరఖాస్తు చేసుకున్నా, తిరిగి అయా కార్యాలయాలకు వెళ్లక తప్పేది కాదు.
ఇక 2019లో సచివాలయాలను ఏర్పాటు చేసిన తర్వాత 2020 కోవిడ్ వరకు పథకాల అమలులో సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల పెత్తనమే నడిచేది. ప్రభుత్వ పథకాల అమలులో తమ ప్రమేయం లేదని ప్రజా ప్రతినిధులు గగ్గోలు పెట్టడంతో సచివాలయాల వారీగా సిబ్బందిని, వాలంటీర్లను ప్రజా ప్రతినిధులకు అప్పగించారు. దీంతో పౌర సేవలు కాస్త రాజకీయ జోక్యం మొదలైంది. ప్రధానంగా పట్టణాల్లో వైసీపీ ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో ప్రజా ప్రతినిధులు వ్యతిరేకత మూగట్టుకోడానికి సచివాలయాలు తమ వంతు పాత్ర పోషించాయి.
పథకాలకు లబ్దిదారుల ఎంపిక నుంచి ప్రభుత్వ అనుమతుల వరకు ప్రజలపై వేధింపులు పెరగడానికి దోహదపడ్డాయి. పట్టణ ప్రాంతాల్లో కార్పొరేటర్లు, ఎమ్మెల్యేల చెప్పు చేతల్లో సచివాలయ సిబ్బంది పనిచేయడంతో గ్రామ, వార్డు సచివాలయాలపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడింది. గ్రామ, వార్డు సచివాలయాలతో పాలనా వ్యవస్థలో ఎలాంటి గుణాత్మక మార్పు రాలేదని జాతీయ స్థాయిలో ఐఏఎస్ అధికారుల్లో విస్తృత చర్చ జరిగింది. పబ్లిక్ పాలసీ పాఠశాలల్లో ఏపీ మోడల్ వ్యవస్థల వైఫల్యంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు తర్వాత వాటితో ప్రజలకు సమర్థవంతంగా పౌర సేవలు అందించే విషయంలో దాని రూపకర్తలు సఫలం కాలేకపోయారు. చివరకు ప్రతిపక్షాలు దానిపై రాజకీయ ముద్ర వేసినా దానిని తొలగించుకోవడంలో వైసీపీ విఫలం అయ్యింది. సచివాలయాలపై క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ కొరవడటం, వ్యవస్థలో భాగంగా కాకుండా ప్రభుత్వ శాఖల్లో అదనపు వ్యవస్థగా అది మిగిలిపోయింది.
ఇప్పుడు మళ్లీ ఆర్టీజీఎస్ వంతు...
ఏపీలో ఆర్నెల్ల క్రితం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మళ్లీ చంద్రబాబు మనసు ఆర్టీజీఎస్ పైకి మళ్లింది. గతంలో ఆర్టీజీఎస్ సర్వేలు, నివేదికలు టీడీపీ ప్రభుత్వాన్ని నిలువునా ముంచిన సంగతి చంద్రబాబు పూర్తిగా మర్చిపోయారు. గత ఏడాది విజయవాడ నగరంలో బుడమేరు వరద ముంపు విషయంలో బాధతులకు పరిహారం విషయంలో కూడా ఆర్టీజీఎస్, పబ్లిక్ గ్రీవెన్స్ వ్యవస్థలు మునుపటి మాదిరే పనిచేశాయి. వేల మందికి పరిహారం చెల్లించకపోయినా అందరికి ఇచ్చేసినట్టు నివేదికలు ఇచ్చి చేతులు దులుపుకుంది.
ఓ వైపు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ, మరోవైపు టెక్నాలజీ ఆధారిత పౌరసేవలు వాట్సాప్ గవర్నెన్స్ వంటివి ఆర్టీజీఎస్ సారథ్యంలో సాగుతున్నాయి. ఈ రెండు సమాంతర వ్యవస్థలతో ప్రజలకు ఏ మేరకు మేలు జరుగుతుందనే దానిపై మాత్రం కసరత్తు జరగడం లేదు. టెక్నాలజీతో ప్రజలకు చేరువ అయ్యేందుకు పబ్లిక్ గ్రీవెన్స్ పోర్టల్ కూడా ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తోంది. అందులో కంప్లైంట్ నమోదు చేస్తే పరిష్కారం కాకున్నా పరిష్కరించినట్టు స్టేటస్ చూపించడం మరో ఎత్తు. ముఖ్యమంత్రుల మనసెరిగి ప్రవర్తించే అధికారులు అయా వ్యవస్థలతో అద్భుతాలు జరిగిపోతున్నట్టు నమ్మించడంతోనే అసలు ఉంది.
సంబంధిత కథనం