Tirupati Stampede : తొక్కిసలాట ఘటన... ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు, పలువురు బదిలీ - సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు
Tirupati Stampede Updates: తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. స్వయంగా తిరుపతి వెళ్లి ఘటనాస్థలిని పరిశీలించిన చంద్రబాబు… బాధితులతో మాట్లాడారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి.. డీఎస్పీ రమణ కుమార్,గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. గురువారం తిరుపతికి చేరుకునన చంద్రబాబు.. తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. రుయా, స్విమ్స్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడారు. ఆ తర్వాత టీటీడీ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
టీటీడీ అధికారులతో సమావేశం తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. టీటీడీపై జరిగిన సమీక్షలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నామన్నారు. తాను చెప్పిన వాటిని టీటీడీ బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారని వెల్లడించారు.
ఈ ఘటనలో కొంతమంది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని చంద్రబాబు చెప్పారు. డీఎస్పీ రమణకుమార్ బాధ్యత లేకుండా పనిచేశారని స్పష్టం చేశారు. డీఎస్పీ రమణకుమార్, గోశాల డైరెక్టర్ హరినాథరెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఎస్పీ సుబ్బారాయుడు, జేఈవో గౌతమిని బదిలీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. తొక్కిసలాట ఘటనపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.