Achyutapuram Sez Blast : అచ్యుతాపురం సెజ్‌లో పేలిన రియాక్టర్ - ఇద్దరు మృతి
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఓ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా…18 మంది గాయపడ్డారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని చర్యలు చేపట్టింది.
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా కెమికల్ ఫ్యాక్టరీలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. రియాక్టర్ పేలిన ఘటనలో ఘటనలో ఇద్దరు మృతి చెందగా…18 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం అనకాపల్లిలోని పలు ఆస్పత్రులకు తరలించారు.
భోజన సమయంలో ఈ ప్రమాదం జరగడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. మరోవైపు వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుంది. పరిశ్రమలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు చర్యలు చేపట్టింది. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై హోంమంత్రి అనిత జిల్లా కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు.
మధ్యాహ్నం భోజన సమయంలో ప్రమాదం జరగడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు చుట్టపక్కన ఉన్న గ్రామాల్లో దట్టమైన పొగ అలుముకుంది. ఈ ప్రమాదంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదంపై అనకాపల్లి జిల్లా కలెక్టర్,ఎస్పీ ఆరా తీశారు.
ప్రమాదం జరిగిన కంపెనీ… దాదాపు 1000 మంది వరకు ఉద్యోగులను కలిగి ఉంది. SEZలో ఉన్న అతిపెద్ద ఫార్మా కంపెనీలలో ఒకటిగా ఉంది. అచ్యుతాపురం సెజ్ లో జూలై 17న కూడా రియాక్టర్ పేలిన ఘటన వెలుగు చూసింది. వసంత కెమికల్స్‌లో జరిగిన పేలుడులో ఒడిశాకు చెందిన 44 ఏళ్ల వలస కార్మికుడు మరణించాడు.
వైఎస్ జగన్ దిగ్భ్రాంతి:
అచ్యుతాపురం సెజ్ లో రియాక్టర్ పేలుడు ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మంచి వైద్య సదుపాయాలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.