Konaseema Crime : కోన‌సీమ జిల్లాలో దారుణం.. రెండు ప్రాంతాల్లో ఇద్ద‌రు విద్యార్థినుల‌పై అత్యాచారం-two female students raped in two areas of konaseema district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Konaseema Crime : కోన‌సీమ జిల్లాలో దారుణం.. రెండు ప్రాంతాల్లో ఇద్ద‌రు విద్యార్థినుల‌పై అత్యాచారం

Konaseema Crime : కోన‌సీమ జిల్లాలో దారుణం.. రెండు ప్రాంతాల్లో ఇద్ద‌రు విద్యార్థినుల‌పై అత్యాచారం

HT Telugu Desk HT Telugu
Published Feb 18, 2025 11:29 AM IST

Konaseema Crime : కోన‌సీమ జిల్లాలో దారుణం జరిగింది. రెండు ప్రాంతాల్లో ఇద్ద‌రు విద్యార్థినుల‌పై అత్యాచారం జ‌రిగింది. 8వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న బాలిక‌కు మాయ మాటలు చెప్పి ఓ వ్య‌క్తి అఘాయిత్యానికి పాల్ప‌డ్డాడు. మ‌రో ప్రాంతంలో ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతున్న బాలిక‌పై ఆటో డ్రైవ‌ర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు.

విద్యార్థినులపై అత్యాచారం
విద్యార్థినులపై అత్యాచారం

కోనసీమ జిల్లాలోని ముమ్మిడివ‌రం, మండ‌పేట‌లో ఇద్దరు విద్యార్థినులపై అత్యాచారం జరిగింది. పోలీసుల తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. కోన‌సీమ జిల్లా ముమ్మిడివ‌రం మండ‌లంలోని ఒక గ్రామానికి చెందిన వివాహితుడు ప‌ర‌మ‌ట దుర్గా ప్ర‌సాద్ (బులి చంటి) (35).. సోమ‌వారం స్కూల్‌కు వెళ్తున్న ఎనిమిదో త‌ర‌గ‌తి బాలికకు మాయ మాట‌లు చెప్పి కిడ్నాప్ చేశాడు. బాలిక‌ను అమ‌లాపురం ఎర్ర‌వంతెన స‌మీపంలో ఒక నివాసానికి తీసుకెళ్లి.. అక్క‌డ ఆమెపై బ‌లవంతంగా అత్యాచారానికి ఒడిగ‌ట్టాడు.

పోలీసులకు ఫిర్యాదు..

బాలిక వ‌ద్ద‌ని ప్ర‌తిఘ‌టించిన‌ప్ప‌టికీ.. దాడి చేసి అఘాయిత్యానికి పాల్ప‌డ్డాడు. బాలిక క‌న‌పించ‌టం లేద‌ని వెతుకుతున్న ఆమె త‌ల్లిదండ్రుల‌కు.. కిడ్నాప్ అయింద‌నే విష‌యం తెలిసింది. వెంట‌నే ముమ్మిడివ‌రం పోలీసులను ఆశ్ర‌యించారు. త‌మ కుమార్తె ఉద‌యం స్కూల్‌కి వెళ్లేందుకు ఇంటి నుంచి బ‌య‌లు దేరింద‌ని.. కానీ ఆమె స్కూల్‌కు చేరుకునేలోపే ఒక వ్య‌క్తి ఆమెను కిడ్నాప్ చేశాడ‌ని పోలీసుల‌కు బాలిక త‌ల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

బాలికకు 20 రూపాయలు ఇచ్చి..

పోలీసులు కిడ్నాప్ కేసు న‌మోదు చేసి.. బాలిక‌, అలాగే కిడ్నాప్ చేసిన వ్య‌క్తి ఆచూకీ కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ముమ్మిడివ‌రం సీఐ ఎం.మోహ‌న్‌కుమార్‌, ఎస్ఐ డి.జ్వాలా సాగ‌ర్ ఆధ్వ‌ర్యంలోని బృందాలు గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టాయి. అయితే.. పోలీసులు కేసు న‌మోదు చేసి, త‌న కోసం గాలిస్తుర‌న్న విష‌యం తెలుసుకున్న దుర్గా ప్ర‌సాద్.. ఆ బాలిక‌కు రూ.20 ఇచ్చి అమలాపురం ఎర్ర‌వంతెన వ‌ద్ద గ్రామానికి వెళ్లే బ‌స్సు ఎక్కించాడు. నిందితుడు అక్కడ నుంచి ప‌రార‌య్యాడు. పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు న‌మోదు చేసి.. గాలింపు చ‌ర్య‌లు చేపట్టారు.

మండ‌పేట‌లో..

మండ‌పేట‌లో ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థినిపై ఆటో డ్రైవ‌ర్ అత్యాచారానికి ఒడిగ‌ట్టాడు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్రకారం.. మండ‌పేట ప‌ట్ట‌ణంలోని గొల్ల‌పుంత‌లో ఆటో డ్రైవ‌ర్ క్రాంతికుమార్ (25) ఉంటున్నాడు. ఆయ‌న‌కు భార్య‌, కుమారుడు ఉన్నారు. క్రాంతికుమార్‌కు మండ‌పేట‌లోనే ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతున్న బాలికతో గ‌త కొన్ని రోజుల కిందట ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ప్రేమిస్తున్నాన‌ని, పెళ్లి చేసుకుంటాన‌ని బాలికను న‌మ్మించాడు. బాలిక‌పై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు.

మోసపోయానని గ్రహించి..

అత‌నికి భార్య‌, కుమారుడు ఉన్న విష‌యం తెలుసుకున్న బాలిక.. తాను మోసపోయాన‌ని గ్రహించింది. జ‌రిగిన విష‌యాన్ని త‌ల్లిదండ్రుల‌కు వివరించింది. సోమ‌వారం బాలిక త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడు క్రాంతి కుమార్‌పై పోలీసులు పోక్సో కేసు న‌మోదు చేశారు. దీనిపై సీఐ సురేష్ స్పందిస్తూ.. కేసు న‌మోదు చేశామ‌ని, ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని వివరించారు.

(రిపోర్టింగ్- జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner