Kanakadurga Temple : దళారులతో దోస్తీ.. వీఐపీ దర్శనాల దందా.. ఇద్దరు ఉద్యోగులు సస్పెండ్!
Kanakadurga Temple : అమ్మవారి దర్శనం పేరుతో దళారులు దందా నడిపించారు. ఈ దందాలో ఆలయ ఉద్యోగులు భాగం అయ్యారు. ఈ వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఉన్నతాధికారులు స్పందించారు. ఇద్దరు ఆలయ ఉద్యోగులను సస్పెండ్ చేశారు. ఈ ఇష్యూ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇంద్రకీలాద్రిపై వీఐపీ దర్శనాల దందా కేసు మరో మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో ఇద్దరు ఆలయ ఉద్యోగులను అధికారులు సస్పెండ్ చేశారు. ఇప్పటి వరకు ఆరుగురిపై వేటు పడింది. మరింత మందిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఓ దళారి ఫోన్ నుంచి భారీ ఎత్తున నగదు బదిలీ అయినట్లు అధికారులు గుర్తించారు. ఆలయ సిబ్బంది ప్రమేయంతోనే ఈ దందా జరిగినట్లు నిర్థారణకు వచ్చారు. దీనిపై ఇంకా విచారణ కొనసాగుతోంది.
దందా జరిగింది ఇలా..
ఇటీవల అమ్మవారి ఆలయ ఉద్యోగులపై ఆరోపణలు వచ్చాయి. వీఐపీ దర్శనం చేయిస్తామని కొందరు ప్రైవేట్ వ్యక్తులు భక్తుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. వీరికి ఆలయ ఉద్యోగులు, సిబ్బంది సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేట్ వ్యక్తుల వద్ద వాటాలు తీసుకొని.. వారికి సహకరిస్తున్నారని తెలుస్తోంది. రద్దీ వేళల్లోనూ అరగంటలో దర్శనం చేయిస్తున్నారు. దీంతో సామాన్య భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఆదాయానికి గండి..
తాజాగా ఏఈవో తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. హారతుల దర్శనాల్లోనూ ఇదేతీరు ఉందని గుర్తించారు. టికెట్ కొనుగోలుదారుల కంటే.. ఇలా ప్రైవేట్ వ్యక్తుల ద్వారా వచ్చిన వారే ఎక్కువగా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏళ్ల తరబడి సాగుతున్న ఈ దందా కారణంగా ఆలయ ఆదాయానికి గండి పడిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు.
ప్రొటోకాల్ విధుల్లో ఉన్నవారే..
ముఖ్యంగా ప్రొటోకాల్ విధుల్లో ఉన్న ఉద్యోగులు.. దళారులతో దోస్తీ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. అయితే.. ఓ దళారి ఫోన్ నుంచి కొందరు ఉద్యోగులకు భారీగా డబ్బులు ట్రాన్స్‌ఫర్ అయ్యాయని తెలుస్తోంది. అధికారుల విచారణతో.. ఆ ఉద్యోగులకు భయం పట్టుకుంది. అమాయక భక్తులను నమ్మించి, వీఐపీ దర్శనాలు చేయించారు. ప్రొటోకాల్ దర్శనాల సమయంలో.. వందల మందిని లోపలికి పంపారు. పంచహారతి సమయంలోనూ ఇలానే జరిగిందని అధికారులు గుర్తించారు.