Tirupati : చెవిరెడ్డిపై పోక్సో కేసులో మరో ట్విస్ట్‌.. ఇరకాటంలో పోలీసులు!-twist in pocso case against former mla chevireddy bhaskar reddy ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirupati : చెవిరెడ్డిపై పోక్సో కేసులో మరో ట్విస్ట్‌.. ఇరకాటంలో పోలీసులు!

Tirupati : చెవిరెడ్డిపై పోక్సో కేసులో మరో ట్విస్ట్‌.. ఇరకాటంలో పోలీసులు!

Basani Shiva Kumar HT Telugu
Dec 01, 2024 12:32 PM IST

Tirupati : వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పోక్సో కేసులో మరో ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. బాలిక తండ్రి రమణ తాజాగా మీడియాతో మాట్లాడారు. పోలీసులే తనతో సంతకం చేయించుకున్నారని స్పష్టం చేశారు. దీంతో పోలీసులు ఇరకాటంలో పడ్డారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (@ChevireddyYSRCP)

చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పోక్సో కేసులో మరో ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. బాలికపై అత్యాచారం అంటూ అసత్య ప్రచారం చేశారని.. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. మాజీమంత్రి నారాయణస్వామి, భూమన కరుణాకర్‌రెడ్డి సమక్షంలో తాజాగా బాలిక తల్లిదండ్రుల మీడియా సమావేశం నిర్వహించారు.

yearly horoscope entry point

'నేను ఎవరిపైనా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. మా కుటుంబాన్ని పరామర్శించిన చెవిరెడ్డిపై.. నేనెందుకు కేసు పెడతాను. అసత్య ప్రచారం జరుగుతుందంటూ..పోలీసులే సంతకం పెట్టించుకున్నారు' అని బాలిక తండ్రి రమణ స్పష్టం చేశారు.

అసలు ఏం జరిగింది..

తిరుపతి జిల్లా యర్రావారిపాలెం మండలానికి చెందిన బాలిక (14)పై అత్యాచారం జరిగిందని.. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యాఖ్యానించారని, సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేశారన్న ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది. వాస్తవాలు నిర్ధారించుకోకుండా అసత్య ప్రచారం చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక తండ్రి ఫిర్యాదు ఆధారంగా పోక్సో కేసు పెట్టామని పోలీసులు స్పష్టం చేశారు.

యర్రావారాపాలెం మండలానికి చెందిన బాలిక.. పాఠశాల నుంచి ఇంటికి వస్తుండగా.. ముసుగు వేసుకున్న దుండగులు తనపై దాడిచేసి మత్తు మందు తాగించారని తల్లిదండ్రులను నమ్మించింది. ఈ ఘటన గురించి పూర్తిగా తెలుసుకోకుండా, వాస్తవాలు నిర్ధారించుకోకుండానే బాలిక చదివే పాఠశాలకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి.. ఆమెపై అత్యాచారం జరిగిందని, ఆమెకు అండగా ఉంటామని వ్యాఖ్యానించినట్లు పోలీసులు గుర్తించారు.

బాలికకు వైద్యపరీక్షలు చేసి అత్యాచారం జరగలేదని పోలీసులు ప్రకటించారు. అయినా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసినట్లు తేల్చారు. ఈ కేసులో బాధితురాలు బాలిక కావడం, ఆమెతోపాటు కుటుంబసభ్యుల గుర్తింపు ప్రచారం చేయడం పోక్సో చట్టం ప్రకారం ఉల్లంఘన అవుతుందని పోలీసులు స్పష్టం చేశారు.

అసత్య ప్రచారం చేసి తమను మనోవేదనకు గురి చేశారంటూ బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భాస్కర్ రెడ్డిపై పోక్సో కేసు పెట్టామని పోలీసులు చెప్పారు. బాధితురాలి తండ్రి నుంచి పోలీసులు 164 కింద స్టేట్‌మెంట్‌ తీసుకుంటున్నారు. చెవిరెడ్డితో పాటు మరికొందరిపైనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో.. బాలిక తండ్రి రమణ ట్విస్ట్ ఇచ్చారు. పోలీసులే తనతో సంతకం పెట్టించుకున్నారని చెప్పారు.

Whats_app_banner