Tuni High Tension : తునిలో తీవ్ర ఉద్రిక్తత, వీధుల్లో వైసీపీ కౌన్సిలర్లు పరుగులు-వైఎస్ ఛైర్మన్ ఎన్నిక మళ్లీ వాయిదా
Tuni High Tension : కాకినాడ జిల్లా తునిలో ఉద్రిక్తత నెలకొంది. తుని మున్సిపల్ వైఎస్ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో మున్సిపల్ ఆఫీసుకు వచ్చిన వైసీపీ కౌన్సిలర్లను టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో వారంతా తిరిగి మున్సిపల్ ఛైర్ పర్సన్ ఇంటికి వెళ్లిపోయారు. కోరం లేకపోవడంతో మరోసారి ఎన్నిక వాయిదా పడింది.

Tuni High Tension : కాకినాడ జిల్లా తుని మున్సిపల్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న వైసీపీ కౌన్సిలర్లను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో వారంతా తిరిగి మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇంటికి వెళ్లారు. సోమవారం వైస్ ఛైర్మన్ ఎన్నిక నిర్వహించాలని భావించినా కోరం లేకపోవడంతో ఎన్నిక వాయిదా పడింది. ఇప్పటికే పలుమార్లు ఎన్నిక వాయిదా పడింది. నేడు మరోసారి ఎన్నిక కోసం ఏర్పాట్లు చేయగా...ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ కౌన్సిలర్లు వీధుల్లో పరుగులు పెడుతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.
తునిలో ఉద్రిక్తత
టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో మున్సిపల్ ఆఫీసు వద్ద భారీగా పోలీసులను మోహరించారు. వైసీపీ కౌన్సిలర్లను మాజీ మంత్రి దాడిశెట్టి రాజా కిడ్నాప్ చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీ కౌన్సిలర్లలో ఎక్కువ మంది కూటమికే మద్దతు ఇస్తున్నారని, అందుకే వారి బలవంతంగా కిడ్నాప్ చేశారని ఆరోపిస్తున్నారు. కౌన్సిలర్లకు స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం లేకుండా చేస్తున్నారన్నారు.
వైసీపీ నేత దాడిశెట్టి రాజా "చలో తుని" పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. చలో తునికి అనుమతి లేదని హెచ్చరించారు. తుని మున్సిపాలిటీ పరిధిలో బీఎన్ఎస్ చట్టం సెక్షన్ 163 (2) అమల్లో ఉందని చెప్పారు. సభలు, సమావేశాలు, ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడటంపై పోలీసులు నిషేధం విధించారు. ఈ నేపథ్యంలో తన అనుచరులతో తుని బయలుదేరిన వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి, మాజీ ఎంపీ వంగా గీతను పోలీసులు అడ్డుకున్నారు. వారిని వెనక్కి పంపారు. మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు తునిలో ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.
వైఎస్ ఛైర్మన్ ఎన్నికల మరోసారి వాయిదా
తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. కోరం లేకపోవడంతో నాలుగోసారి ఎన్నికను రద్దు చేస్తున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. మళ్లీ ఎన్నిక ఎప్పుడు నిర్వహిస్తామనేది త్వరలో ప్రకటిస్తామన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు తాజా పరిస్థితిని వివరించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. వైస్ ఛైర్మన్ ఎన్నికకు టీడీపీ కౌన్సిలర్లు హాజరవుతుండగా, వైసీపీ కౌన్సిలర్లను రహస్య ప్రదేశాల్లో ఉంచుతున్నారని ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆదేశాలతో 17 మంది వైసీపీ కౌన్సిలర్లను నిర్బంధించి, ఎన్నికకు రాకుండా చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తుంది.
అయితే ఓటమి భయంతో టీడీపీ నేతలు వైసీపీ కౌన్సిలర్లను ఓటింగ్ లో పాల్గొనకుండా అడ్డుకుంటున్నారని వైసీపీ ఆరోపిస్తుంది. మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన వైసీపీ కౌన్సిలర్ల అడ్డుకుంటున్నారని పేర్కొంది. మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నికకు కనీసం 15 మంది కౌన్సిలర్లు ఓటింగ్ లో పాల్గొనాలి. ఇవాళ కూడా 10 మంది కౌన్సిలర్లు మాత్రమే రావడంతో ఎన్నికను మరోసారి రద్దు చేస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రకటించారు.
టీడీపీలో చేరేందుకు…
ఇవాళ ఉదయం 10 మంది టీడీపీ కౌన్సిలర్లు వైఎస్ ఛైర్మన్ ఎన్నిక సమావేశానికి హాజరయ్యారు. అయితే వైసీపీ కౌన్సిలర్లు సభకు హాజరుకాలేదు. వైసీపీ కౌన్సిలర్లను సమావేశానికి రాకుండా నిర్బంధించారని, టీడీపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కౌన్సిలర్లు ఉన్న ప్రదేశానికి వెళ్లేందుకు టీడీపీ శ్రేణులు యత్నించాయి. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. టీడీపీ శ్రేణులు వెళితే ఘర్షణ జరిగే అవకాశం ఉందని పోలీసులు వారిని అడ్డుకున్నారు. వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, అందుకే ఓటమి భయంతో వారిని దాచేస్తున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.
సంబంధిత కథనం