Tirumala Stampede Live Updates: తిరుపతి మృతులకు రూ. 25 లక్షల పరిహారం, కాంట్రాక్ట్ ఉద్యోగం - సీఎం చంద్రబాబు ప్రకటన-ttds negligence led to a serious accident failure in arrangements tirumala stampede live updates 9 january ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala Stampede Live Updates: తిరుపతి మృతులకు రూ. 25 లక్షల పరిహారం, కాంట్రాక్ట్ ఉద్యోగం - సీఎం చంద్రబాబు ప్రకటన

బాధితులకు సీఎం చంద్రబాబు పరామర్శ

Tirumala Stampede Live Updates: తిరుపతి మృతులకు రూ. 25 లక్షల పరిహారం, కాంట్రాక్ట్ ఉద్యోగం - సీఎం చంద్రబాబు ప్రకటన

04:34 PM ISTJan 09, 2025 08:33 PM Bolleddu Sarath Chandra
  • Share on Facebook

  • Tirumala Stampede Live Updates: తిరుపతిలో ఘోర ప్రమాదం జరిగింది. వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు.ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రూ.25లక్షల పరిహారాన్ని మంత్రులు ప్రకటించారు.

Thu, 09 Jan 202503:03 PM IST

వైఎస్ జగన్ కామెంట్స్

తిరుపతిలో జరిగిన ఘటన రాష్ట్ర చరిత్రలోనే ఎప్పడూ జరగలేదని వైఎస్ జగన్ అన్నారు. ఈ ఘటన వెనుక ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వస్తున్నాయని చెప్పారు. బాధితులను పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. లక్షలాది మంది వస్తారని తెలిసినా భద్రత కల్పించలేదని విమర్శించారు.

Thu, 09 Jan 202501:59 PM IST

బాధితులకు జగన్ పరామర్శ

తిరుపతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు. వారితో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు.

Thu, 09 Jan 202504:34 PM IST

తప్పు జరిగింది - పవన్

“శ్యామలరావు, వెంకయ్య చౌదరి విఫలమయ్యారు.. మీరు చేసిన తప్పులకు ప్రభుత్వం నిందలు మోస్తోంది.. పోలీసులు క్రౌడ్‌ మేనేజింగ్‌ చేయడంలో విఫలమవుతున్నారు. తప్పు జరిగింది, పూర్తి బాధ్యత తీసుకుంటున్నాం.. తొక్కిసలాట జరిగినప్పుడు హెల్ప్ చేసిన పోలీసులు ఉన్నారు.. అలాగే చోద్యం చూసిన పోలీసులు ఉన్నారు.. పోలీసుల్లో కొందరు కావాలనే వ్యవహరించినట్టు బాధితులు చెప్పారు.. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరగాలి” అని డిప్యూటీ సీఎం పవన్ కామెంట్స్ చేశారు.

Thu, 09 Jan 202501:12 PM IST

డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు

తిరుపతి తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ క్షమాపణలు చెప్పారు. తప్పు జరిగింది.. క్షమించండి అని వ్యాఖ్యానించారు. ఈ ఘటనలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని అన్నారు.

Thu, 09 Jan 202504:34 PM IST

సస్పెన్షన్ వేటు

తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. స్వయంగా తిరుపతి వెళ్లి ఘటనాస్థలిని పరిశీలించిన చంద్రబాబు… బాధితులతో మాట్లాడారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి.. డీఎస్పీ రమణ కుమార్,గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

Thu, 09 Jan 202512:42 PM IST

కాంట్రాక్టు ఉద్యోగం ఇప్పిస్తాం - సీఎం చంద్రబాబు

తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, కాంట్రాక్టు ఉద్యోగం ఇప్పిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. టీటీడీపై జరిగిన సమీక్షలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నామన్నారు. అసమర్ధత, అనాలోచిత నిర్ణయాల వల్ల పవిత్రతకు భంగం కలగకూడదన్నారు. రాజకీయాలకు అతీతంగా.. శ్రీవారికి సేవ చేస్తున్నాం అనే భావన ఉండాలని వ్యాఖ్యానించారు.

Thu, 09 Jan 202511:44 AM IST

బాధితులతో మాట్లాడిన సీఎం

తిరుపతిలో నిన్నటి తొక్కిసలాట ఘటనలో గాయపడిన వారిని చంద్రబాబు పరామర్శించారు. స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భక్తులను పరామర్శించి.. వారితో మాట్లాడారు. గంటన్నర పైగా ఆసుపత్రిలో ఉండి ప్రతి బాధితుడి తో మాట్లాడారు.

Thu, 09 Jan 202510:49 AM IST

ఘటనాస్థలికి డిప్యూటీ సీఎం పవన్

పద్మావతి పార్క్ తొక్కిసలాట ఘటనా స్థలానికి డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చేరుకున్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లు, తొక్కిసలాటకు గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Thu, 09 Jan 202509:59 AM IST

తిరుపతికి వైఎస్ జగన్

కాసేపట్లో వైసీపీ అధినేత జగన్ తిరుపతికి చేరుకుంటారు. తొక్కిసలాట బాధితులను రుయా ఆస్పత్రిలో పరామర్శిస్తారు.

Thu, 09 Jan 202508:55 AM IST

సీఎం చంద్రబాబు సీరియస్

కలెక్టర్, టీటీడీ అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. సరిగ్గా ఏర్పాట్లు ఎందుకు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Thu, 09 Jan 202508:38 AM IST

రెండు కేసులు నమోదు

తిరుపతి తొక్కిసలాట ఘటనపై రెండు కేసులు నమోదయ్యాయి. బైరాగిపెట్టెడ పద్మావతి పార్క్‌లో తొక్కిసలాట ఘటనపై ఈస్ట్‌ పీఎస్‌లో నారాయణపురం ఎంఆర్‌వో ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా విష్ణు నివాసంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై బాలయ్యపల్లె ఎంఆర్‌వో ఫిర్యాదు ఇచ్చారు.

Thu, 09 Jan 202508:37 AM IST

ప్రభుత్వం చేసిన హత్యలు - ఆర్కే రోజా

తొక్కిసలాటకు కారణమైన బాధ్యులపై క్రిమినల్ కేసులుపెట్టి లోపలేయాలని మాజీ మంత్రి ఆర్కే రోజా డిమాండ్ చేశారు. సనాతన ధర్మాన్ని రక్షిస్తానన్న పవన్ కల్యాణ్ ఎక్కడ? అని ప్రశ్నించారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి వల్ల గోదావరి పుష్కరాల్లో 29 మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. ఘటనకు నిర్లక్ష్యం కారణం కాదన్న ఆమె… ప్రభుత్వం చేసిన హత్యలు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వైఫల్యం, అసమర్దత వల్లే ఇంతమంది చనిపోయారన్నారు.

Thu, 09 Jan 202508:36 AM IST

భక్తుల ప్రాణాలకు విలువ లేదా? బీవీ రాఘవులు

తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఓ డీఎస్పీని బలి చేస్తున్నారని సీపీఎం ముఖ్య నేత బీవీ రాఘవులు అన్నారు. “బకరాను వదిలిపెద్ద పులులను పట్టుకోండి.. ఈ ఘటనపై విచారణ కమిటీని వేయాలి.. ప్రధాని మోడీ విశాఖకు వస్తే పోలీసులంతా అక్కడే మోహరించారు.. 10 లక్షల మంది భక్తుల ప్రాణాలకు విలువ లేదా?.. సీఎం చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా సమాధానం చెప్పాలి” అని డిమాండ్ చేశారు.

Thu, 09 Jan 202508:34 AM IST

ఎంతో విషాదకరం - రాహుల్ గాంధీ

తిరుపతి ఘటనపై రాహుల్ గాంధీ స్పందించారు. “తిరుపతిలో జరిగిన దురదృష్టకర తొక్కిసలాట ఎంతో విషాదకరం. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు అందుబాటులో ఉండి అన్ని విధాలా సహాయం అందించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను” అని ప్రకటన చేశారు.

Thu, 09 Jan 202507:06 AM IST

మృతుల కుటుంబాలకు నష్టపరిహారం రూ.25 లక్షలు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

వైకుంఠ ఏకాదశి దర్శనం టోకన్ ఇచ్చే కేంద్రం వద్ద బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన మృతుల కుటుంబాలను పరామర్శించడానికి వారికి భరోసా కల్పించేందుకు గౌ. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రుల బృందం రావడం జరిగిందని, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని రాష్ట్ర మంత్రులు ప్రకటించారు.

గురువారం ఉదయం రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్య ప్రసాద్, రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని జాయింట్ కలెక్టర్ తో కలసి రుయా ఆసుపత్రి మార్చురి నందు ఉన్న మృతులను పరిశీలించి వారి కుటుంబాలను ఓదార్చివివరాలు తెలుసుకున్నారు.

అనంతరం మీడియా తో మంత్రులు మాట్లాడుతూ ఏకాదశి దర్శనం టోకన్ ఇచ్చు ప్రదేశం వద్ద తొక్కిసలాటలో మృతిచెందిన మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్లు పొందే ప్రతి చోట సి సి కెమెరా లు ఉన్నాయని వాటిని పరిశీలించిఈ సంఘటనపై పూర్తి విచారణ చేసిన తర్వాత సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

మృతిచెందిన వారి కుటుంబానికి రూ.25 లక్షలు అందజేయడం జరుగుతుందన్నారు.తిరుపతి లో జరిగిన సంఘటన తెలిసినన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులను తిరుపతి కి పంపడం జరిగిందని తెలిపారు. ఈ సంఘటన జరగడం దురదృష్టకరమని, ఇకపై ఇలాంటి సంఘటన జరగకుండా తగిన చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. మృతి చెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, మృతులు తమిళనాడు, ఆంధ్ర రాష్ట్రాలకు చెందిన వారని, వారి మృతదేహాలను ప్రత్యేక వాహనం ద్వారా ఒక అధికారిని పంపించి వారి స్వగ్రామాలకు చేర్చడం జరుగుతుందన్నారు.

Thu, 09 Jan 202506:53 AM IST

తిరుపతి తొక్కిసలాట ఘటనపై కేసులు నమోదు

తిరుపతి తొక్కిసలాట ఘటనలపై రెండు పోలీస్ కేసులు నమోదయ్యాయి. బాలయ్యపల్లె ఎమ్మార్వో, నారాయణవనం ఎమ్మార్వోల ఫిర్యాదుతో వేర్వేరుగా కేసులు నమోదు చేశారు.

Thu, 09 Jan 202506:52 AM IST

తిరుపతి బయలుదేరిన సీఎం చంద్రబాబు

తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలతో పాటు, క్షతగాత్రుల్ని పరామర్శించేందుకు సీఎం చంద్రబాబు బయల్దేరి వెళ్లారు. ఉండవల్లి నుంచి తిరుపతికి బయల్దేరారు.

Thu, 09 Jan 202506:44 AM IST

కుట్ర కోణంపై దర్యాప్తు

తిరుపతి దుర్ఘటనలో కుట్ర కోణంపై దర్యాప్తు చేస్తున్నట్టు హోంమంత్రి అనిత ప్రకటించారు.

Thu, 09 Jan 202506:20 AM IST

తిరుమల మృతులకు రూ.25లక్షల పరిహారం

తిరుపతి రుయా ఆస్పత్రిలో మృతుల కుటుంబీకులు, బాధితులను మంత్రులు పరామర్శించారు. బాధితులను పరామర్శించిన మంత్రులు అనిత, ఆనం, అనగాని... తొక్కిసలాట జరిగిన ఘటనను మంత్రులకు కలెక్టర్‌, ఎస్పీ వివరించారు. బాధిత కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్‌ గ్రేషియా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

Thu, 09 Jan 202506:16 AM IST

తిరుపతికి వైసీపీ అధ్యక్షుడు జగన్

తిరుపతి తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ పరామర్శించనున్నారు.

Thu, 09 Jan 202506:16 AM IST

బాధితుల్ని పరామర్శిస్తున్న మంత్రులు

తిరుపతి ఘటనలో చనిపోయిన మృతుల కుటుంబాలను రుయా మార్చురీ వద్ద మంత్రుల బృందం రెవెన్యూ శాఖ మంత్రి , జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, హోం మినిస్టర్ అనిత, దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరామర్శించారు. దుర్ఘటనకు సంబంధించి మృతుల బంధువుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రులతో పాటు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, ఎస్పి సుబ్బరాయుడు, టీటీడీ జేఈవో శ్రీమతి గౌతమి,ఆర్డిఓ రామ్మోహన్ తదితరులు కూడా ఉన్నారు.

Thu, 09 Jan 202505:35 AM IST

మూడ్రోజుల సర్వ దర్శనం టోకెన్ల జారీ పూర్తి

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ పూర్తైంది. కోటా పూర్తవడంతో కౌంటర్లు మూసివేశారు. 3 రోజులకు లక్షా 20 వేల టోకెన్లను టీటీడీ జారీ చేసింది. రోజుకు 40 వేల చొప్పున టోకెన్లు జారీ చేసింది. 13వ తేదీ నుంచి తిరిగి టోకెన్లు జారీచేయనున్నారు.

Thu, 09 Jan 202505:33 AM IST

మృతులకు కోటిపరిహారం చెల్లించాలి, జేఈవోను సస్పెండ్ చేయాలి.

తిరుపతి ఎస్పీ , టీటీడీ జేఈఓ వెంకన్న చౌదరిలని సస్పెండ్ చేయాలని టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన డిమాండ్ చేశారు. చంద్రబాబుకు గుడి కట్టుకుని ఆయనకు సేవ చేసుకోవాలని వెంకటేశ్వరుడి ఆలయంలో భక్తుల మనోభావాలను పరిరక్షించడానికి ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన వారు చంద్రబాబు సేవలో తరిస్తున్నారని భూమన ఆరోపించారు.

లా అండ్ ఆర్డర్‌ అదుపు చేయాల్సిన పోలీసులు, తమ బాధ్యతల్ని విస్మరించడం వల్ల భక్తులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు.

సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తానని తిరుపతిలో వీరతాడు వేసుకుని తిరిగిన పవనాననంద స్వామి, సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత మీపై ఉందని, సనాతన ధర్మాన్ని మీ ఆలోచన రీతిలో తునాతునకలు చేస్తారో చెప్పాలన్నారు.

గేమ్‌ ఛేంజర్ ఈవెంట‌్‌లో ఇద్దరు చనిపోతే, వైసీపీ మీద ఆరోపణలు చేశారని, ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు. సనాతన ధర్మం పేరుతో మాయమాటలు చెబుతారు, ఆచరణలో అమలు చేయరని విమర్శించారు. చంద్రబాబు దేవుడితో పెట్టుకున్నారని, రాజకీయ వనరుగా, పావుగా వాడుకుని జగన్‌ మీద అభాండాలు వేసి, తిరుమల అపవిత్రం అయ్యిందని రాజకీయం చేశారని, తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందనే దుర్మార్గపు ప్రచారాలకు దేవుడే కన్నెర్ర చేశాడని మండిపడ్డారు.

తిరుమల ఆలయ పవిత్రత తాము కాపాడినంతగా ఇంకెవరు కాపాడలేదన్నారు. దమ్ముంటే తమతో చర్చకు సిద్దపడాలన్నారు.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు చేసిన ఆరోపణల గురించి బహిరంగ చర్చకు తాము సిద్ధమని, చంద్రబాబు మాయ మాటలు తగ్గించి వెంకటేశ్వర స్వామిని రాజకీయాలకు వాడుకోకుండా సరైన చర్యలు చేయాలన్నారు. ఈవోను బదిలీ చేయాలి, ఇతర అధికారుల్ని సస్పెండ్ చేయాలని మృతుల కుటుంబాలకు కోటి రుపాయల పరిహారం అందించాలని గాయపడిన వారికి రూ.20లక్షల పరిహారం చెల్లించాలని భూమన డిమాండ్ చేశారు. పరామర్శలతో కాలం గడిపేయడం సరికాదని తిరుపతిలో జరిగినవి ప్రభుత్వ హత్యలని ఆరోపించారు.

Thu, 09 Jan 202503:39 AM IST

తిరుపతిలో కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు

తిరుపతిలో గాయపడిన క్షతగాత్రుల వివరాల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ నెంబర్: 08772236007 లో వివరాలను అందించే ఏర్పాటు చేశారు.

Thu, 09 Jan 202503:37 AM IST

41మందికి గాయాలు, ఇద్దరికి పరిస్థితి ఆందోళనకరం…

తిరుపతి తొక్కిసలాటలో 41మంది గాయపడ్డారని, వారిని స్విమ్స్‌, రుయా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్టు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. గాయపడిన వారిలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయని, క్షతగాత్రుల్లో అత్యధికుల్ని సాయంత్రంలోగా డిశ్చార్జి చేయనున్నట్టు చెప్పారు. గాయపడిన వారిలో ఇద్దరు ముగ్గురికి మాత్రమే చికిత్స కొనసాగించాల్సిన స్థితిలో ఉన్నారన్నారు. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారు తప్ప మిగిలిన వారికి ప్రాణాపాయం లేదని రుయా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ తెలిపారు. ఇప్పటి వరకు 20మందిని డిశ్చార్జి చేసినట్టు తెలిపారు.

Thu, 09 Jan 202502:44 AM IST

మంత్రి అచ్చెన్నాయుడు సంతాపం…

వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ సందర్భంగా తిరుపతిలో జరిగిన దుర్గటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. దైవ దర్శనం కోసం వెళ్లిన శ్రీవారి భక్తులు మృతి తీవ్ర మనోవేదనకు గురిచేసిందని, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. -

Thu, 09 Jan 202502:43 AM IST

తొక్కిసలాటపై సీఎంకు చేరిన నివేదిక

తిరుపతి తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రికి చంద్రబాబుకు జిల్లా ఎస్పీ నివేదిక అందించారు. ఘటనా స్థలంలో ఉన్న డిఎస్పీ వైఫల్యం వల్లే ప్రమాదం జరిగినట్టు నివేదికలో పేర్కొన్న ఎస్పీ, ఘటన జరిగిన తర్వాత 20నిమిషాల పాటు అంబులెన్స్‌ డ్రైవర్లు అందుబాటులో లేకపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగినట్టు నివేదికలో పేర్కొన్నారు.

Thu, 09 Jan 202502:39 AM IST

తిరుపతి చేరుకున్న ఆరోగ్య మంత్రి

తిరుప‌తిలో జరిగిన తొక్కిసలాటలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడంతో వైద్య‌, ఆరోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌ హుటాహుటిన తిరుపతి చేరుకున్నారు. తిరుప‌తిలోని రుయా, స్విమ్స్ ఆసుప‌త్రుల్లో బాధితుల‌ను ప‌రామ‌ర్శించ‌నున్నారు. గాయ‌ప‌డిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాల‌ని ఇప్ప‌టికే జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ వెంక‌టేశ్వ‌ర్ ను మంత్రి ఆదేశించారు. వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం టోకెన్ల జ‌రిగిన తోపులాట‌లో ఆరుగురు మృతి చెందడం ప‌ట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Thu, 09 Jan 202502:28 AM IST

ప్రాణాలు తీసిన పద్మావతి పార్కు

బుధవారం ఉదయం 5 గంటల నుంచి బైరాగి పట్టెడలోని పద్మావతి పార్కులో వేలాది మంది వైకుంఠ దర్శనం టోకెన్ల కోసం వేచి ఉండగా రాత్రి 8.30కు పార్క్‌ గేట్లు తెరవడంతో దుర్ఘటన చోటు చేసుకుంది. గురువారం ఉదయం 5గంటలకు టోకెన్ల జారీ ప్రారంభం కావాల్సి ఉండగా 24 గంటల ముందే వేల సంఖ్యలో జనం అక్కడకు చేరుకున్నారు.

Thu, 09 Jan 202501:44 AM IST

పార్కు గేట్లు తెరవడమే ప్రాణాలు తీసింది…

తిరుపతిలో తొక్కిసలాట జరిగిన బైరాగిపట్టెడలో పార్కులో బుధవారం ఉదయం నుంచి వేలాది మందిని స్థానిక పార్కులోకి పంపారు. బుధవారం ఉదయం నుంచి అందులో వేల మంది వేచి ఉండగా రాత్రి 8.30కు ఓ మహిళకు అస్వస్థతకు గురైంది. ఆమెను బయటకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తుండగా టోకెన్లు జారీ చేస్తున్నారని భావించి అంతా ఒకే సారి బయటకు వచ్చే ప్రయత్నం చేయడంతో తొక్కిసలాట జరిగింది.

Thu, 09 Jan 202501:33 AM IST

వైకుంఠ దర్శనానికి వచ్చి వైకుంఠం వెళ్లిపోయారు..

వైకుంఠ దర్శనానికి వచ్చి వైకుంఠం వెళ్లిపోయారు..

తొలిసారి వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. విశాఖపట్నం తాటిచెట్ల పాలెంకు చెందిన లావణ్య స్వాతి, కంచరపాలెంకు చెందిన శాంతి, మద్దెలపాలెంకు చెందిన రజనిలు మృతి చెందారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన వారంతా బుధవారం ఉదయం నుంచి టోకెన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం గేట్లను తెరిచిన సమయంలో తొక్కిసలాట జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మృతి చెందిన మహిళలకు చిన్న పిల్లలు ఉన్నారని, వారికి ఏమని చెప్పాలని బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. రుయా మార్చురీ వద్ద బంధువుల రోదనలతో హృదయవిదారంగా ఉంది.

Thu, 09 Jan 202501:23 AM IST

విశాఖ మహిళల మృతి

తిరుపతిలో జరిగిన వైకుంఠ ఏకాదశి తొక్కిసలాటలో విశాఖపట్నంకు చెందిన ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు మృతి చెందారు. కుటుంబ సభ్యులతో కలిసి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం వచ్చిన వారిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

Thu, 09 Jan 202512:59 AM IST

చిత్తశుద్ధిలేని వ్యక్తులకు పగ్గాలు ఇచ్చారు

ప్రభుత్వ వైఫల్యమే తొక్కిసలాటకు దారితీసింది టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి ఆరోపించారు. టీటీడీని రాజకీయ కేంద్రంగా మార్చారని ఆరోపించారు. భక్తుల ప్రయోజనాలను గాలికి వదిలేశారని, అధికారంలోకి వచ్చింది మొదలు శ్రీవారి ఆలయ పవిత్రతను దెబ్బతీశారని ఆరోపించారు.ప్రతిపక్షంపై దుష్ప్రచారానికి తిరుమలను, టీటీడీని వాడుకున్నారని, గడచిన ఐదేళ్లలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదన్నారు. శ్రీవేంకటేశ్వర స్వామి భక్తులు తొక్కసలాటకు గురికావడం, అందులో మరణించడం సాధారణమైన విషయం కాదన్నారు.

Thu, 09 Jan 202512:42 AM IST

తిరుపతి చేరుకున్న మంత్రులు

సీఎం ఆదేశాలతో ముగ్గురు మంత్రులు తిరుపతి చేరుకున్నారు. హోం, దేవాదాయ, రెవెన్యూ మంత్రులు తిరుపతి చేరుకున్నారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని ప్రభుత్వం ప్రకటించింది. తిరుపతి తోపులాట ఘటన తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Thu, 09 Jan 202512:40 AM IST

ఏర్పాట్లలో నిర్లక్ష్యం…

వైకుంఠ ద్వార దర్శనాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. ఏటా వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం కోసం లక్షలాదిగా భక్తులు తరలి వస్తారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఏర్పాట్లు చేయడంలో టీటీడీ నిర్లక్ష్యం ప్రదర్శించిందనే విమర్శలు ఉన్నాయి.

Thu, 09 Jan 202512:37 AM IST

వైకుంఠ ఏకాదశి దర్శనం కోసమే..

తిరుమలలో శుక్రవారం నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 10వ తేదీన వైకుంఠ ఏకాదశి కావడంతో తొలి రోజే వేంకటేశ్వరుడిని దర్శనం చేసుకోడానికి పెద్ద సంఖ్యలో భక్తులు రెండు రోజుల ముందే తిరుమలకు తరలి వచ్చారు.

Thu, 09 Jan 202512:37 AM IST

94 కేంద్రాల్లో టోకెన్ల జారీ

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో 94 కేంద్రాల్లో సర్వదర్శనం టోకెన్ల జారీ కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. రామానాయుడు స్కూల్ వద్ద టోకెన్ల కోసం వేచి ఉన్న వారిలో ఒకరు అస్వస్థతతకు గురి కావడంతో గేట్లు తెరిచినట్టు పోలీసులు చెబుతున్నారు. దీంతో ఒక్కసారిగా జనం స్కూల్లోకి వచ్చేందుకు ప్రయత్నించారు.

Thu, 09 Jan 202512:34 AM IST

భైరాగిపట్టాడ రామానాయుడు స్కూల్లో…

బైరాగిపట్టెడ రామానాయుడు స్కూల్‌ వద్ద ఉన్న కేంద్రంలో బుధవారం రాత్రి జరిగిన తోపులాటలో నలుగురు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు. స్విమ్స్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరో ఇద్దరు భక్తులు మృతి చెందారు. మొత్తంగా తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందారు. అదే విధంగా సత్యనారాయణపురంలోని టోకెన్ల జారీ కేంద్రం వద్ద సైతం తోపులాట చోటు చేసుకుంది. మొత్తంగా అస్వస్థతకు గురై రుయా ఆస్పత్రిలో 20 మంది, స్విమ్స్‌లో 9 మంది చేరారు.

Thu, 09 Jan 202512:34 AM IST

తిరుపతిలో ఘోర ప్రమాదం

తిరుపతి వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీలో తొక్కిసలాట జరగడంతో - ఆరుగురు మృతి చెందారు. తిరుపతిలో వైకుంఠద్వార సర్వదర్శన టోకెన్ల జారీలో అపశ్రుతి చోటు చేసుకుంది. టోకెన్ల జారీ కేంద్రాల వద్ద తోపులాట జరిగింది. తిరుపతిలోని మూడు ప్రాంతాల్లో భక్తుల మధ్య తోపులాట చోటు చేసుకోగా, శ్రీనివాసం వద్ద తమిళనాడు సేలంకు చెందిన భక్తురాలు మృతి చెందారు.

Thu, 09 Jan 202512:32 AM IST

ఆరుగురు భక్తల మృతి

తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో నర్సీపట్నంకు చెందిన బుద్దేటి నాయుడు బాబు, విశాఖపట్నానికి చెందిన రజిని, లావణ్య, శాంతి, కర్ణాటకలోని బళ్లారికి చెందిన శాంతి మృతి చెందారు, అంతకు ముందు తమిళనాడులోని సేలంకు చెందిన మల్లిక మృతి చెందారు.