Tirumala : శ్రీవారి భక్తులకు కీలక అప్డేట్ - ఇకపై ఏరోజుకారోజు SSD టోకెన్లు, రేపట్నుంచే ప్రారంభం
శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్ ఇచ్చింది. జనవరి 23వ తేదీ నుంచి తిరుపతిలో ఏ రోజుకారోజు ఎస్ ఎస్ డి టోకెన్లు అందిస్తామని ప్రకటించింది. ఈ మేరకు టికెట్ కౌంటర్ల వివరాలను పేర్కొంది.
తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక అప్డేట్ ఇచ్చింది. గతంలో మాదిరిగానే జనవరి 23వ తేదీ నుంచి ఏ రోజుకా రోజు ఎస్ఎస్ డీ టోకెన్లను అందించనుంది. ఈ మేరకు టీటీడీ ప్రకటన విడుదల చేసింది.

ఈ ఎస్ఎస్ డీ టోకెన్లను అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ వద్దనున్న విష్ణు నివాసం వద్ద పొందవచ్చు. అంతేకాకుండా బస్టాండ్ వద్దనున్న శ్రీనివాసం కౌంటర్లలో గతంలో మాదిరిగానే ఎస్ ఎస్ డి టోకెన్లను తీసుకోవచ్చని టీటీడీ ప్రకటించింది.
రేపు అంగప్రదక్షిణం టోకెన్లు:
ఇటీవలనే ఏప్రిల్ నెల కోటాను టికెట్లపై టీటీడీ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రేపు (జనవరి 23) అంగప్రదక్షిణం టోకెన్లు అందుబాటులోకి రానున్నాయి. ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
- శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా : శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన ఏప్రిల్ నెల ఆన్ లైన్ కోటాను జనవరి 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.
- వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా: వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా మార్చి నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను జనవరి 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
- తిరుమల, తిరుపతిలలో గదుల కోటా : తిరుమల, తిరుపతిలలో ఏప్రిల్ నెల గదుల కోటాను జనవరి 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
పైన పేర్కొన్న టికెట్లను https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది.
కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు :
కడప జిల్లా దేవుని కడపలో గల శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జనవరి 29 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 6వ తేదీతో ముగుస్తాయి.
జనవరి 28వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల మధ్య అంకురార్పణ జరుగనుంది. జనవరి 29వ తేదీ ఉదయం 9.30 గంటలకు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
ఫిబ్రవరి 3వ తేదీ ఉదయం 10 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం జరుగనుంది. రూ.300 చెల్లించి గృహస్తులు (ఇద్దరు) కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. ఫిబ్రవరి 7వ తేదీ సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం జరుగనుంది. ఇందుకోసం భక్తులు పుష్పాలను సమర్పించవచ్చు.
సంబంధిత కథనం