Tirumala Shocking Incident : తిరుమలలో అపచారం చోటుచేసుకుంది. టీటీడీ అధికారుల నిర్లక్ష్యంతో ఇద్దరు భక్తులు పాదరక్షలతో శ్రీవారి ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. టీటీడీ విజిలెన్స్, ఉద్యోగులు పట్టించుకోక పోవడంతో చెప్పులతోనే ఆలయ మహాద్వారం వరకు భక్తులు చేరుకున్నారు. వైకుంఠంలోకి భక్తులు ప్రవేశించే సమయంలో విజిలెన్స్, టీటీడీ ఉద్యోగులు గుర్తించకపోవడం వల్లే ఇలా జరిగిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వరుడిని నిత్యం వేల మంది భక్తులు దర్శించుకుంటారు. ఎంతో భక్తి శ్రద్ధలతో కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలేశుని దర్శనం కోసం గంటల కొద్దీ క్యూలైన్లలో వేచి ఉంటారు. క్షణకాల దర్శనం కోసం గంటల సమయం సామాన్య భక్తులు వేచి ఉంటారు. తిరుమలేశుడి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి భక్తులు తిరుమలకు తరలివస్తుంటారు. తిరుమల మాడ వీధుల్లో సైతం ఎవరూ పాదరక్షలు ధరించరు. ఎంతో నిష్టగా తిరుమల కొండను భావిస్తారు. ఎవరికైనా తెలియకపోతే టీటీడీ ఉద్యోగులు వారికి చెప్పేందుకు నిత్యం విధుల్లో ఉంటారు. అయితే ఎంతో నిఘా ఉండే తిరుమలలో అపచారం చోటుచేసుకుంది.
ఇద్దరు భక్తులు పాదరక్షలతో శ్రీవారి ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. భక్తులు చెప్పులతో ఆలయ మహాద్వారం నుంచి లోపలికి వెళ్లబోయారు. ఇంతలో అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది వారిని గుర్తించి, అక్కడే అడ్డుకున్నారు. దీంతో భక్తులు పాదరక్షలను మహాద్వారం వద్ద వదిలేసి ఆలయంలోకి వెళ్లారు. అయితే భక్తుల దస్తులు, పాదరక్షణలు, ఎలా వస్తున్నారు అనే విషయాన్ని వైకుంఠంలోకి భక్తులు ప్రవేశించే సమయంలోనే విజిలెన్స్, టీటీడీ ఉద్యోగులు గుర్తిస్తుంటారు. అలాంటిది ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తు్న్నారు. తిరుమల ఇటీవల తరచూ ఏదో ఒక వివాదం తలెత్తుతుంది. భక్తుల మనోభావాలను దెబ్బతిసేలా కొందరు ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ గుండా ప్రవేశించాల్సి ఉంటుంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద టీటీడీ విజిలెన్స్, భద్రతా సిబ్బంది భక్తులను తనిఖీ చేస్తారు. వారి వద్ద సెల్ ఫోన్స్, నిషేధిత వస్తువులు, పాదరక్షలు ఉంటే అక్కడే వాటిని స్వాధీనం చేసుకుని, భక్తులను స్వామి వారి దర్శనం కోసం పంపిస్తారు. కానీ ఇవాల్టి ఘటనలో కొందరు భక్తులు పాదరక్షలతోనే మహాద్వారం వరకు రావడం కలకలం రేపింది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద భద్రాతా సిబ్బంది వీరిని ఎందుకు గుర్తించలేదని భక్తులు ప్రశ్నిస్తున్నారు. వీఐపీలు అయితే సరిగ్గా తనిఖీలు చెయ్యరా? అని ప్రశ్నిస్తు్న్నారు. నిబంధనలు సామాన్యులకేనా అని నిలదీస్తున్నారు.
టీటీడీ గోశాలలో... గత 3 నెలలుగా సరైన నిర్వహణ లేకపోవడం వల్ల దాదాపు 100 అమాయక ఆవులు ప్రాణాలు కోల్పోయాయని వైసీపీ ఆరోపిస్తుంది. చనిపోయిన ఆవుల ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తుంది. ఈ ప్రచారంపై టీటీడీ స్పందించింది. గత 3 నెలల కాలంలో 100 గోవులు మరణించాయని కొందరు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం అవాస్తవం, నిరాధారమి, ఈ ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మొద్దని టీటీడీ కోరింది.
"టీటీడీ గోశాలలలో ఆవుల మరణాల గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న నిరాధారమైన మరియు దురుద్దేశపూరిత ప్రచారాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ వాదనలలో ఎటువంటి నిజం లేదు. టీటీడీ వాస్తవాలను స్పష్టం చేసింది. వైసీపీ ప్రజలను తప్పుదారి పట్టించడానికి, రెచ్చగొట్టడానికి ముందుకు తెచ్చిన ఈ తప్పుడు కథనాన్ని భక్తులు నమ్మవద్దని కోరారు. రాజకీయ లాభం కోసం పవిత్ర సంస్థల గురించి అబద్ధాలు వ్యాప్తి చేయడం సిగ్గుచేటు, ఆమోదయోగ్యం కాదు" అని నారా లోకేశ్ ట్వీట్ పెట్టారు.
సంబంధిత కథనం