TTD Virtual Seva Tickets : జనవరి 10న శ్రీవారి వర్చువల్ సేవా టికెట్ల విడుదల-ttd to release virtual seva darshan tickets on january 10 know details here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ttd To Release Virtual Seva Darshan Tickets On January 10 Know Details Here

TTD Virtual Seva Tickets : జనవరి 10న శ్రీవారి వర్చువల్ సేవా టికెట్ల విడుదల

HT Telugu Desk HT Telugu
Jan 09, 2023 05:59 PM IST

TTD Virtual Seva Tickets : జనవరి 10న శ్రీవారి వర్చువల్ సేవా టికెట్ల ద‌ర్శ‌న కోటా విడుద‌ల‌ చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. టీటీడీ స్థానికాలయాలు, అనుబంధ ఆలయాల్లో జనవరి 28న రథసప్తమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది.

శ్రీవారి వర్చువల్ సేవా టికెట్ల విడుదల
శ్రీవారి వర్చువల్ సేవా టికెట్ల విడుదల (HT_PRINT)

TTD Virtual Seva Tickets : తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ప్రతి భక్తుడు కోరుకుంటాడు. శ్రీవారి ఆలయంలో ప్రత్యేక సేవలను ప్రత్యక్షంగా తిలకించి.. ఏడుకొండల వాడి ఆశీస్సులు పొందాలని భక్తులు ఆకాంక్షిస్తారు. ఈ మేరకు లక్షలాది మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు. అయితే.. ఆలయానికి రాలేని వారు కూడా స్వామి వారిని దర్శించుకొని, సేవలను ప్రత్యక్షంగా తిలకించే అవకాశం టీటీడీ కల్పిస్తోన్న సంగతి తెలిసిందే. వర్చువల్ సేవా పేరుతో ఈ విధానాన్ని టీటీడీ అమలు చేస్తోంది. కళ్యాణోత్సవం, ఊంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవలకు టికెట్లు బుక్ చేసుకుని ఆయా సేవలను భక్తులు ఆన్ లైన్ లో తిలకించవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

వర్చువల్ సేవ టికెట్ల దర్శన కోటాను టీటీడీ ప్రతి నెలా విడుదల చేస్తుంటుంది. ఈ మేరకు జనవరి 12 నుంచి తిరుమలలో కళ్యాణోత్సవం, ఊంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవలకు సంబంధించిన ఆన్ లైన్ వ‌ర్చువ‌ల్ సేవా టికెట్లు మరియు సంబంధిత ద‌ర్శ‌న కోటాను జనవరి 10వ తేదీన ఉదయం 9 గంట‌ల‌కు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఆయా తేదీల్లో స్వామి వారి దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులు ఈ విషయాన్ని గుర్తించి.. టికెట్లు బుక్ చేసుకోవాలని కోరింది. శ్రీవారి ఆలయంలో బాలాలయం ఏర్పాటు దృష్ట్యా ఫిబ్రవరి 22 నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఆన్ లైన్ వర్చువల్ సేవ మరియు అనుబంధ దర్శన టికెట్ల కోట అందుబాటులో ఉండవని పేర్కొంది.

రథ సప్తమికి విస్తృత ఏర్పాట్లు

టీటీడీ స్థానికాలయాలు, అనుబంధ ఆలయాల్లో జనవరి 28న రథసప్తమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలని జెఈవో శ్రీ వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. ఆలయాల అధికారులు, ఇతర విభాగాల అధికారులతో సోమవారం ఉదయం జెఈవో వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతి శ్రీ కోదండరామాలయం, శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరాలయం, నారాయణవనం, నాగలాపురం, దేవుని కడప తదితర అలయాల్లో రథసప్తమి సందర్భంగా వాహనసేవలతో పాటు చక్కగా మూలమూర్తి దర్శనం కల్పించాలని ఆదేశించారు. అన్ని ఆలయాల్లో వాహనాల పటిష్టతను ముందస్తుగా పరీక్షించాలని డిఎఫ్‌వోకు సూచించారు. దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో రథోత్సవానికి గాను రథం పటిష్టతను పరిశీలించాలన్నారు. ఆయా ఆలయాల్లో వివిధ విభాగాల అధికారులతో సమన్వయ సమావేశాలు ఏర్పాటుచేసి పెండింగ్‌ పనులు వేగవంతం చేయాలన్నారు.

అదేవిధంగా, జమ్మూ, చెన్నై, రంపచోడవరం, సీతంపేట ప్రాంతాల్లో నిర్మాణం పూర్తయిన ఆలయాల్లో మహాసంప్రోక్షణకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షించారు. ఆయా ఆలయాలకు అవసరమైన ఆభరణాలు, శిలా విగ్రహాలు, పంచలోహ విగ్రహాలు, అర్చక సిబ్బంది, ఇతర డెప్యుటేషన్‌ సిబ్బంది, పారిశుద్ధ్య ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించారు. ఈ ఆలయాలకు సంబంధించి పనుల పురోగతిపై ఇంజినీరింగ్‌ అధికారులు నివేదిక సమర్పించాలన్నారు. మహాసంప్రోక్షణ కార్యక్రమాలకు విచ్చేసే భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు అందించాలని, ఆకట్టుకునేలా విద్యుద్దీపాలంకరణలు, పుష్పాలంకరణలు చేపట్టాలని ఆదేశించారు. అంతకుముందు వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయాల వారీగా చేపట్టిన ఏర్పాట్లు, భవిష్యత్తులో చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారుల నుండి సూచనలు, సలహాలు స్వీకరించారు.

WhatsApp channel