Tirumala Darshan Tickets: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి భక్తులకు అలర్ట్ ఇచ్చింది టీటీడీ. అక్టోబర్ నెలకు సంబంధించిన శ్రీవారి అంగప్రదక్షిణ టికెట్లకు జూలై 24న విడుదల చేయనుంది. ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఈ మేరకు భక్తులు టికెట్లను బుక్ చేసుకోవాలని తెలిపారు.
శ్రీవాణి ట్రస్టు దాతలకు దర్శనం, గదులకు సంబంధించి అక్టోబరు కోటాను జూలై 24న ఉదయం 11 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా అక్టోబరు నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను జూలై 24న మధ్యాహ్నం 3 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
ఆగస్టు, సెప్టెంబరు నెలలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల అదనపు కోటాను జూలై 25న ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అక్టోబరు నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జూలై 25న ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఇక గదుల కోటాలో చూస్తే,... తిరుమల, తిరుపతి, తలకోనలో అక్టోబరు నెల గదుల కోటాను జూలై 26న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. భక్తులు ఈ విషయాలను గమనించి https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ లో సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది.
మరోవైపు తిరుమలలో ఆఫ్ లైన్ విధానంలో శ్రీవారి ఆర్జితసేవలు, బ్రేక్ దర్శనం పొందిన భక్తులు టికెట్లు పొందే ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు టీటీడీ నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. "పే లింక్" ఎస్ఎంఎస్ ద్వారా భక్తులు కౌంటర్ల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్ లైన్ లో సొమ్ము చెల్లించి సేవా టికెట్లను ప్రింట్ తీసుకోవచ్చు.
సిఆర్ఓలో లక్కీడిప్ ద్వారా ఆర్జిత సేవాటికెట్లను భక్తులకు కేటాయిస్తున్న విషయం తెలిసిందే. ఈ విధానంలో టికెట్లు పొందిన భక్తులు కౌంటర్ వద్దకు వచ్చి సొమ్ము చెల్లించి టికెట్లు పొందాల్సి వచ్చేది. నూతన విధానంలో ఎస్ఎంఎస్ ద్వారా పే లింక్ ను పంపుతారు. భక్తులు ఆ లింక్ పైన క్లిక్ చేసి యుపిఐ లేదా క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా ఆన్లైన్ లో సొమ్ము చెల్లించి సేవా టికెట్లు ప్రింట్ తీసుకోవచ్చు. ఈ నూతన విధానాన్ని ప్రస్తుతం సిఆర్వోలోని లక్కీడిప్ కౌంటర్ల వద్ద ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. త్వరలో ఎంబీసీ-34 కౌంటర్ వద్ద విచక్షణ కోటాలో కేటాయించే ఆర్జిత సేవా టికెట్లు, బ్రేక్ దర్శన టికెట్లకు కూడా ఈ విధానం అమలుకానుంది.