విద్యార్థుల కోసం టీటీడీ వినూత్న కార్యక్రమం - ఇవిగో వివరాలు-ttd to launch sadgamaya program to incluate human values among students ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  విద్యార్థుల కోసం టీటీడీ వినూత్న కార్యక్రమం - ఇవిగో వివరాలు

విద్యార్థుల కోసం టీటీడీ వినూత్న కార్యక్రమం - ఇవిగో వివరాలు

విద్యార్థుల కోసం టీటీడీ వినూత్న కార్యక్రమం చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. వారిలో మానవతా విలువను పెంపొందించేందుకు 'సద్గమయ' పేరుతో కొత్త కార్యక్రమం చేపట్టనుంది. ఇందుకు సంబంధించి ఓ ప్రకటన విడుదల చేసింది.

విద్యార్థుల కోసం టీటీడీ వినూత్న కార్యక్రమం

విద్యార్థుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకురానుంది. దేశ భవిష్యత్తుకు పునాదులైన వారిలో…. హిందూ సనాతన ధర్మం బోధించి నైతిక విలువలను పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఇందుకోసం త్వరలోనే ‘సద్గమయ’ అనే కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఈ మేరకు టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది.

తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం సోమవారం అధికారులతో సమీక్షా నిర్వహించారు. ఇందులో ‘సద్గమయ’ కార్యక్రమంపై చర్చించారు. విద్యార్థులలో సహనం, సానుభూతి, నిజాయితీ, కరుణ, విశ్వాసం, పట్టుదల, క్రమశిక్షణ వంటి అంశాలను పెంపొందించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించాలని సూచించారు. విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా ఉండే అంశాలను శిక్షణ షెడ్యూల్‌లో చేర్చాలని ఆయన ఆదేశించారు.

ముందుగా టీటీడీ పాఠశాలల్లో అమలు…

ముందుగా హెచ్ డి పీపీ కార్యదర్శి శ్రీరామ్ రఘునాథ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ కార్యక్రమం ప్రధాన అంశాలను వివరించారు. విద్యార్థులలో నైతికత, వ్యక్తిత్వ వికాసం, సామాజిక సేవ, నైపుణ్యాలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పట్ల ప్రేమ- ఆప్యాయత- కృతజ్ఞత, కరుణ, సమగ్రతలను పెంపొందించడం వంటి అంశాలను ప్రస్తావించారు. విద్యార్థులను దేశానికి బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం అని వివరించారు. ఈ కార్యక్రమం మొదటగా టీటీడీ పాఠశాలల విద్యార్థులతో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.