అక్టోబరు 20న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం.. ఆ రోజున ఈ సేవ‌లు ర‌ద్దు!-ttd to conduct deepavali asthanam on october 20 check more details isndie ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  అక్టోబరు 20న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం.. ఆ రోజున ఈ సేవ‌లు ర‌ద్దు!

అక్టోబరు 20న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం.. ఆ రోజున ఈ సేవ‌లు ర‌ద్దు!

Anand Sai HT Telugu

తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా అక్టోబరు 20 తేదీన‌ దీపావళి ఆస్థానాన్ని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించనుంది. ఈ మేరకు టీటీడీ ప్రకటన విడుదల చేసింది.

తిరుమల

అక్టోబరు 20న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం నిర్వహించనుంది తిరుమల తిరుపతి దేవస్థానం. దీపావళి నాడు ఉదయం 7 నుండి ఉదయం 9 గంటల వరకు బంగారు వాకిలి ముందు గల ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం జరుగుతుంది. ఆస్థానంలో భాగంగా శ్రీమలయప్పస్వామి దేవేరులతో కలిసి ఘంటా మండపంలో ఏర్పాటుచేసిన సర్వభూపాల వాహనంలో గరుడాళ్వార్‌కు అభిముఖంగా వేంచేపు చేస్తారు.

సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనుడిని కూడా స్వామివారి ఎడమ పక్కన మరొక పీఠంపై దక్షిణ ఆభిముఖంగా వేంచేపు చేస్తారు. ఆ తరువాత స్వామివారికి ప్రత్యేక పూజ, హారతి, ప్రసాద నివేదనలను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. దీంతో దీపావళి ఆస్థానం పూర్తవుతుంది.

సాయంత్రం 5 గంట‌లకు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్పస్వామివారు సహస్ర దీపాలంకరణ ‌సేవ‌లో పాల్గొని, ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో విహరించి భ‌క్తుల‌ను క‌టాక్షించ‌నున్నారు.

ఆర్జిత సేవ‌లు ర‌ద్దు

దీపావ‌ళి ఆస్థానం కార‌ణంగా అక్టోబరు 20న క‌ల్యాణోత్సవం, ఊంజ‌ల్ సేవ‌, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ‌ల‌ను టీటీడీ ర‌ద్దు చేసింది. తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండి , శిలా తోరణం వరకు క్యూలో వేచి ఉన్నారు భక్తులు. సర్వదర్శనం భక్తులకు 24 గంటల సమయం పడుతుంది. 300 రూ..శీఘ్రదర్శనంకు 4 గంటల సమయం పట్టే అవకాశం. సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 6 గంటల సమయం పడుతుంది.

నిన్న స్వామివారిని 71,634 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 24,980గా ఉంది. నిన్న స్వామి వారి హుండీ ఆదాయం: రూ.4.74 కోట్లు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.