ఆ ప్రచారం పూర్తిగా అవాస్తవం - శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్లపై టీటీడీ ప్రకటన-ttd releases statement on srivani darshan tickets ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ఆ ప్రచారం పూర్తిగా అవాస్తవం - శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్లపై టీటీడీ ప్రకటన

ఆ ప్రచారం పూర్తిగా అవాస్తవం - శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్లపై టీటీడీ ప్రకటన

శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్లపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్ర‌చారాన్ని టీటీడీ ఖండించింది. ఎప్ప‌టిక‌ప్పుడు భ‌క్తులు బుక్ చేసేసుకుంటున్నారని పేర్కొంది. భ‌క్తుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీయ‌డం త‌గ‌ద‌ని విజ్ఞప్తి చేసింది.

తిరుమల శ్రీవారి ఆలయం

తిరుమ‌ల‌లో ఆఫ్‌లైన్ లో ఇస్తున్న శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్ల మిగిలిపోయాయంటూ జరుగుతున్న ప్రచారంపై టీటీడీ స్పందించింది. సోషల్ మీడియాలో కొంద‌రు చేస్తున్న ప్ర‌చారం పూర్తిగా అవాస్త‌వ‌మ‌ని స్పష్టం చేసింది.

ఆ వార్తలన్నీ అవాస్తవం - టీటీడీ

వాస్త‌వానికి ఆన్ లైన్‌లో 500 టికెట్లు, తిరుప‌తి ఎయిర్ పోర్ట్ లో 200 టికెట్లను అందుబాటులో ఉంచుతున్నామని వెల్లడించింది. ఈ టికెట్లను ఎప్ప‌టిక‌ప్పుడు భ‌క్తులు బుకింగ్ చేసేసుకుంటున్నారని వివరించింది. ఏరోజు కూడా ఆన్ లైన్ లో శ్రీవాణి దర్శన టికెట్లు మిగిలిన సంద‌ర్భం లేదని టీటీడీ పేర్కొంది.

తిరుమలలో భక్తుల సౌకర్యార్థం ప్రతిరోజు 800 టికెట్లను భక్తులకు ఆఫ్ లైన్ లో జారీ చేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. గత కొన్ని రోజుల్లో ఆఫ్ లైన్ లో పదుల సంఖ్యలో మాత్రమే తగ్గాయని వివరించింది. కానీ కొంద‌రు వ్య‌క్తులు సోషల్ మీడియాలో గ‌త‌వారం రోజుల్లో వందల సంఖ్యలో టికెట్లు మిగిలిపోయిన‌ట్లు ప్ర‌చారం చేయడం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది. అవాస్త‌వ సమాచారాన్ని ప్ర‌చారం చేసి భ‌క్తుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీయ‌డం త‌గ‌ద‌ని విజ్ఞ‌ప్తి చేసింది.

స్వర్ణరథంపై శ్రీ పద్మావతి అమ్మవారు:

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా ఇవాళ స్వర్ణరథంపై అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. స్వర్ణరథంపై అమ్మవారిని దర్శిస్తే తలచిన పనులు నెరవేరడంతో పాటు, మరో జన్మ ఉండదని అర్చ‌కులు తెలిపారు.

ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉత్సవర్లను ఊరేగింపుగా స్వర్ణరథం మంటపానికి తీసుకొచ్చారు. ఉదయం 9.45 గంటల నుండి స్వర్ణరథోత్సవం వేడుకగా జరిగింది. బంగారు రథాన్ని అధిరోహించిన అమ్మవారు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.

మధ్యాహ్నం 2.30 నుండి 4.30 గంటల వ‌ర‌కు అమ్మవారి ఉత్సవర్లకు శుక్రవారపు తోటలో స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. రాత్రి ఆలయ నాలుగు మాడ వీధుల్లో అమ్మవారు ఊరేగి భ‌క్తుల‌ను క‌టాక్షించారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం