Tirumala Tickets : భక్తులకు అలర్ట్... శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల
TTD Latest News: తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల ఏప్రిల్ కోటా ఇవాళ్టి నుంచే ప్రారంభమైంది. భక్తులు టీటీడీ వెబ్ సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు షెడ్యూల్ ను విడుదల చేసింది.
Tirumala Tirupati Devasthanam Updates: శ్రీవారి దర్శన టికెట్లకు సంబంధించి అప్డేట్ ఇచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఏప్రిల్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, అంగ ప్రదక్షిణం, ప్రత్యేక దర్శన టికెట్లు, వసతి గదులు బుకింగ్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను బుధవారం ప్రకటించింది టీటీడీ. ఇందులో భాగంగా…ఏప్రిల్ నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్ లైన్ లక్కీడిప్ కోసం ఇవాళ్టి నుంచి బుకింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. జనవరి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఈ టికెట్లను నమోదు చేసుకోవచ్చు. లక్కీడిప్‌లో టికెట్లు పొందిన భక్తులు జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు రుసుము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుందని టీటీడీ స్పష్టం చేసింది.
మిగతా సేవల టికెట్లు - షెడ్యూల్ ఇదే
-కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవాటికెట్లను జనవరి 22వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.
-వర్చువల్ సేవా టికెట్లను జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.
-శ్రీవారి వార్షిక వసంతోత్సవం ఏప్రిల్ 21 నుండి 23వ తేదీ వరకు జరుగునుంది. ఇందుకు సంబంధించిన సేవా టికెట్లను జనవరి 22వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.
-ఆంగప్రదక్షిణం టోకెన్ల కోటాను జనవరి 23వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.
-శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం, గదుల కోటాను జనవరి 23వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు.
-వృద్ధులు, దివ్యాంగులకు దర్శన టోకెన్ల కోటాను జనవరి 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.
-ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్ల కోటాను జనవరి 24వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.
-తిరుమల, తిరుపతిలో వసతి గదుల బుకింగ్ జనవరి 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.
-ఏప్రిల్ నెలకు సంబంధించి జనవరి 27న ఉదయం 11 గంటలకు తిరుమల, తిరుపతికి చెందిన శ్రీవారి సేవ కోటాను, మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ కోటాను, మధ్యాహ్నం 1 గంటలకు పరకామణి సేవ కోటాను విడుదల చేస్తారు.
https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ లో పైన పేర్కొన్న అన్నిరకాల సేవా టికెట్లను బుక్ చేసుకోవచ్చని టీటీడీ వెల్లడించింది.