TTD Panchami Theertham : పద్మావతి అమ్మవారి పంచమి తీర్థానికి ప‌టిష్ట‌ ఏర్పాట్లు-ttd panchami theertham elaborate arrangements for ammavari panchami theertham ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ttd Panchami Theertham Elaborate Arrangements For Ammavari Panchami Theertham

TTD Panchami Theertham : పద్మావతి అమ్మవారి పంచమి తీర్థానికి ప‌టిష్ట‌ ఏర్పాట్లు

HT Telugu Desk HT Telugu
Nov 27, 2022 10:04 AM IST

TTD Panchami Theertham పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు జరిగే పంచమి తీర్థానికి పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. నవంబరు 28వ తేదీ జరుగనున్న పంచమి తీర్థానికి విచ్చేసే భ‌క్తుల సౌక‌ర్యార్థం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేప‌ట్టారు. భక్తులు ప్రశాంతంగా అమ్మవారి పుష్కరిణిలో పవిత్ర స్నానం చేసేందుకు వీలుగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో తొలిసారిగా వేలాది మంది భక్తులు సేద తీరేలా ప్రత్యేకంగా తాత్కాలిక షెడ్లు నిర్మించి ఆదివారం రాత్రి నుంచే ఇక్కడ అన్నప్రసాదాలు, తాగునీరు, తేనీరు అందించేందుకు సిద్ధం చేశారు.

పంచమి తీర్థానికి సిద్ధమైన పద్మ పుష్కరిణి
పంచమి తీర్థానికి సిద్ధమైన పద్మ పుష్కరిణి

TTD Panchami Theertham పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు నిర్వహించే పంచమి తీర్థానికి విస్తృత ఏర్పాట్లు చేశారు. తొలిసారి భక్తులు సేద తీరేలా మూడు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలోనే భక్తులకు భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, తేనీరు అందించే ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక క్యూలైన్ల ద్వారా పుష్కరిణిలోకి భక్తులను పంపేలా ఏర్పాట్లు చేశారు.

ట్రెండింగ్ వార్తలు

‌టీటీడీ చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు పర్యవేక్షణలో పంచమీ తీర్థం నిర్వహణకు అవసరమైన క్యూలైన్లు, బ్యారికేడ్లు, ప‌ద్మ‌ పుష్క‌రిణిలోనికి ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను ఏర్పాటు చేయడంతో పాటు సైన్‌ బోర్డులు ఏర్పాటు చేశారు.

వేలాది మంది భక్తులు వేచి ఉండేందుకు వీలుగా నవజీవన్ కంటి ఆసుపత్రి, పూడి మార్గం, హైస్కూలు ప్రాంతాల్లో జర్మన్ షెడ్లు, రేకుల షెడ్లను టీటీడీ ఏర్పాటు చేసింది.

భ‌క్తుల సౌక‌ర్యార్థం జిల్లా పోలీసు శాఖ తో కలసి టీటీడీ నిఘా, భ‌ద్ర‌త విభాగం ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేప‌ట్టింది. టీటీడీ భ‌ద్ర‌తా సిబ్బంది, స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎన్‌.సి.సి.విద్యార్థులతో పాటు 2,500 పోలీసు సిబ్బందితో పటిష్ట మైన భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేప‌ట్టారు.

భ‌క్తుల సౌక‌ర్యార్థం 120 అన్న‌ప్ర‌సాదం కౌంట‌ర్లు ఏర్పాటు చేశారు. తోళ్ళ‌ప్ప గార్డ‌న్స్‌లో 50, హైస్కూల్ వ‌ద్ద 20, నవజీవన్ ఆసుపత్రి వ‌ద్ద 25, పూడి రోడ్డు వద్ద లో ఏర్పాటు చేసిన షెడ్ లో 25 అన్న‌ప్ర‌సాదం పంపిణీ కౌంట‌ర్లు ఏర్పాటు చేశారు. దీనికి అదనంగా పార్కింగ్ ప్రాంతాల్లో కూడా అన్నప్రసాదాలు అందించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది.

క్యూలైన్ల‌లోని భ‌క్తుల‌కు అవ‌స‌ర‌మైన తాగునీరు, పాలు, బాదంపాలు, అల్పాహారం, అన్న‌ప్ర‌సాదాలు, మ‌జ్జిగ‌ పంపిణీ చేయడానికి సిద్ధం చేశారు. ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో 1 లక్ష 75 వేల వాటర్ బాటిళ్లను భక్తులకు పంపిణీ చేయనున్నారు.

ఆదివారం రాత్రికే తమిళనాడు తో పాటు జిల్లా సరిహద్దు ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తిరుచానూరుకు చేరుకోవచ్చని అధికారులు అంచనా వేశారు. ఇందుకు తగ్గట్లుగా శాశ్వ‌త, తాత్కాలిక, మొబైల్‌ అన్నీ కలిపి సుమారు 500 మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు వీటిని శుభ్రం చేయడానికి అదనంగా 700 మంది పారిశుద్ధ్య సిబ్బందిని నియ‌మించారు. ఆదివారం ఉదయం నుంచే వీరు విధుల్లో ఉండేలా ఏర్పాట్లు చేశారు.

అమ్మ‌వారి ద‌ర్శ‌న స‌మ‌యం, అన్న‌ప్ర‌సాదాలు, మ‌రుగుదొడ్లు, పార్కింగ్ ప్రాంతాల‌ను భ‌క్తులు సుల‌భంగా గుర్తించేందుకు వీలుగా వివిధ ప్రాంతాల‌లో సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన మూడు షెడ్లల్లో మూడు ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో కేంద్రం వద్ద ఒక అంబులెన్స్ అందుబాటులో ఉంచుతున్నారు. తోళ్లప్ప గార్డెన్, ఆలయం వద్ద అదనంగా రెండు అంబులెన్స్ లు సిద్దంగా ఉంచుతారు. ఇవి కాకుండా ఒక 108 కూడా సిద్ధం చేశారు. వైద్య‌, పారా మెడిక‌ల్ సిబ్బంది, అవ‌స‌ర‌మైన మందులను అందుబాటులో ఉంచారు. స్విమ్స్‌, రుయా, టీటీడీ ఆయుర్వేద ఆసుప‌త్రుల‌కు చెందిన వైద్యులు భ‌క్తుల‌కు సేవ‌లందిస్తారు. ఫైర్‌, జాతీయ విప‌త్తు నివార‌ణ సిబ్బందిని అందుబాటులో ఉంచారు.

పంచ‌మి తీర్థానికి విచ్చేసే భ‌క్తులకు శిల్పారామం, త‌న‌ప‌ల్లి క్రాస్‌, మార్కెట్‌యార్డు, రాహుల్ కన్వెన్షన్ సెంటర్, పూడి జంక్ష‌న్‌, తిరుచానూరు శివారు వ‌ద్ద పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. భక్తులు తమ వాహనాలను ఈ ప్రాంతాల్లో పార్కింగ్ చేసి పుష్కరిణికి నడచి వచ్చేలా ఏర్పాట్లు చేశారు.

పంచ‌మి తీర్థంలో భ‌క్తుల‌కు సుమారు 1000 మంది శ్రీ‌వారి సేవ‌కులు ఆదివారం సాయంత్రం నుంచే వివిధ ప్రాంతాల్లో సేవ‌లందిస్తారు. భక్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మూడు షెడ్లల్లో నిరంతర విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒక్కో షెడ్ వద్ద ఒక భారీ సామర్థ్యం కల జనరేటర్, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. దీంతో పాటు పంచమితీర్థం కార్యక్రమం వీక్షించేందుకు వీలుగా తాత్కాలిక షెడ్లు, పుష్కరిణి నలువైపులా, మాడ వీధుల్లో ఎల్ ఈ డి స్క్రీన్లు ఏర్పాటు చేశారు.

రోజంతా పంచమి ప్రాశస్త్యం

ప‌ద్మ‌పుష్క‌రిణిలో సోమవారం ఉదయం 11.40 నుండి 11.50 గంటల మధ్య చక్రస్నానం కార్యక్రమాన్ని అర్చ‌కులు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. పంచమి తీర్థం ప్రాశస్త్యం రోజంతా ఉంటుందని, భక్తులు సంయమనంతో వ్యవహరించి పుణ్యస్నానాలు ఆచరించాలని టీటీడీ విజ్ఞ‌ప్తి చేస్తోంది.

WhatsApp channel

టాపిక్