Tirumala News : ఎన్ఆర్ఐలకు టీటీడీ శుభవార్త - వీఐపీ బ్రేక్ దర్శనం కోటా పెంపు..!
ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRTS) సభ్యులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం రోజువారీగా అందిస్తున్న వీఐపీ బ్రేక్ దర్శన కోటాను 50 నుంచి 100కు పెంచింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ సభ్యులకు ఉండే వీఐపీ బ్రేక్ దర్శన కోటాపై తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కోటాను రెట్టింపు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్‌ఆర్‌టీఎస్) సభ్యులకు ప్రస్తుతం రోజువారీగా వీఐపీ బ్రేక్ దర్శన కోటా కింద 50 టికెట్లను ఇస్తున్నారు. అయితే ఈ కోటాను 100 పెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.
టీటీడీ నిర్ణయం ఫలితంగా శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే పలువురు ప్రవాస భారతీయులకు దర్శనం విషయంలో మరికొంత వెసులుబాటు కలగనుంది. ఎన్నారై భక్తుల డిమాండ్ దృష్ట్యా ఈ కోటాను టీటీడీ పెంచింది. ఈ కోటా కింద ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యుల్లోనూ వృద్ధులకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
తిరుమలలో శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి :
తిరుమల దివ్య క్షేత్రంలో ఫిబ్రవరి 12వ తేదీ బుధవారం శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి అత్యంత వైభవంగా జరుగనుంది. ఈ ఏర్పాట్లపై టిటిడి అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు మాట్లాడుతూ…. తిరుమలలో జరిగే అతి ముఖ్యమైన తీర్థ ఉత్సవాలలో ఒకటైన రామకృష్ణతీర్థ ముక్కోటికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తుల కోసం షామియానా, రేడియో బ్రాడ్‌కాస్టింగ్ ద్వారా ప్రకటనలు, డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. టీటీడీ భద్రతాసిబ్బంది, పోలీసులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
భక్తుల సౌకర్యార్థం భద్రత, అన్నప్రసాదం, తాగునీరు, వైద్యం, ఆరోగ్యం, అటవీ విభాగాల ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. పాపవినాశనం వద్ద భక్తులకు అన్నప్రసాదం పంపిణీకి అవసరమైన శ్రీవారి సేవకులను నియమించాలని కోరారు.
అధిక బరువు, ఆస్తమా, గుండె సంబంధిత సమస్యలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న యాత్రికులను, వృద్ధులను అనుమతించబోమని తెలియజేశారు. తీర్థం వద్ద పూజలు సకాలంలో పూర్తి చేయాలని ఆలయ సిబ్బందిని ఆదేశించారు.
గోగర్భం డ్యామ్ పాయింట్ నుంచి పాపవినాశనం వరకు యాత్రికులను తరలించేందుకు ఎపిఎస్ఆర్టీసీ నుండి బస్సులను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిబ్రవరి 12వ తేదీ ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే యాత్రికులను ఈ తీర్థానికి అనుమతించనున్నట్లు తెలిపారు.
సంబంధిత కథనం