Tirumala : శ్రీవారి భక్తులకు అలర్ట్... ఈనెల 19న ఆర్జిత సేవా టికెట్లు విడుదల, పూర్తి వివరాలివే-ttd is all set to release the online quota of darshan tickets for november month 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala : శ్రీవారి భక్తులకు అలర్ట్... ఈనెల 19న ఆర్జిత సేవా టికెట్లు విడుదల, పూర్తి వివరాలివే

Tirumala : శ్రీవారి భక్తులకు అలర్ట్... ఈనెల 19న ఆర్జిత సేవా టికెట్లు విడుదల, పూర్తి వివరాలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Aug 15, 2024 10:14 PM IST

తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక అప్డేట్ ఇచ్చింది. ఆగస్టు 19వ తేదీన శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్లు విడుదలవుతాయని పేర్కొంది. వర్చువల్ సేవలు, అంగప్రదక్షిణ, వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా టికెట్ల విడుదల తేదీలను కూడా టీటీడీ ప్రకటించింది.

తిరుమల శ్రీవారి టికెట్లు
తిరుమల శ్రీవారి టికెట్లు

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి టీటీడీ కీలక అప్డేట్ ఇచ్చింది. నవంబరు నెల కోటాను ఆగష్టు 19న ఉదయం 10 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నున్నట్లు ప్రకటించింది. ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఆగష్టు 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని తెలిపింది. ఈ టికెట్లు పొందిన వారు ఆగష్టు 21 నుండి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయని ప్రకటించింది.

కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లతో పాటు నవంబరు 9న శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న పుష్పయాగం సేవ టికెట్లను ఆగష్టు 22వ తేదీన విడుదల చేస్తామని వివరించింది. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన నవంబరు నెల కోటాను ఆగష్టు 22న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది.

ఆగష్టు 23న‌ అంగప్రదక్షిణం టోకెన్లు….

నవంబరు నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఆగష్టు 23న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా….

శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన నవంబరు నెల ఆన్ లైన్ కోటాను ఆగష్టు 23వ తేదీ ఉదయం 11 గంటలకు అందుబాటులోకి వస్తాయి.

వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా…

వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా నవంబరు నెల ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను ఆగష్టు 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు విడుదల చేస్తారు.

ఆగష్టు 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

నవంబరు నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఆగష్టు 24న ఉదయం 10 గంటలకు  టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో గదుల కోటా విడుద‌ల‌…

తిరుమల, తిరుపతిల‌లో నవంబరు నెల గదుల కోటాను ఆగష్టు 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

ఆగష్టు 27న శ్రీవారి సేవ కోటా విడుదల

ఆగష్టు 27న తిరుమ‌ల – తిరుప‌తి శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు, న‌వ‌నీత సేవ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు, ప‌ర‌కామ‌ణి సేవ మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. https://ttdevasthanams.ap.gov.in  వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని తిరుమల తిరుపతి దేవస్థానం కోరింది.