TTD Filed Complaint : తిరుమలలో చాగంటి కోటేశ్వరరావుకు అవమానమంటూ ప్రచారం, సోషల్ మీడియా ప్రతినిధులపై టీటీడీ ఫిర్యాదు-ttd filed complaint on social media accounts spread fake news on chaganti tirumala visit ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ttd Filed Complaint : తిరుమలలో చాగంటి కోటేశ్వరరావుకు అవమానమంటూ ప్రచారం, సోషల్ మీడియా ప్రతినిధులపై టీటీడీ ఫిర్యాదు

TTD Filed Complaint : తిరుమలలో చాగంటి కోటేశ్వరరావుకు అవమానమంటూ ప్రచారం, సోషల్ మీడియా ప్రతినిధులపై టీటీడీ ఫిర్యాదు

TTD Filed Complaint : ఆథ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు తిరుమలలో అవమానం జరిగిందంటూ ఇటీవల సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ ప్రచారం అవాస్తవమని టీటీడీ క్లారిటీ ఇచ్చింది. అయినప్పటికీ సోషల్ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారం చేశారని టీటీడీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తిరుమలలో చాగంటి కోటేశ్వరరావుకు అవమానమంటూ ప్రచారం, సోషల్ మీడియా ప్రతినిధులపై టీటీడీ ఫిర్యాదు

TTD Filed Complaint : ప్రముఖ ఆథ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు తిరుమలలో అవమానం జరిగిందంటూ ప్రచారం చేసిన సోషల్ మీడియా ప్రతినిధులపై తిరుపతి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో టీటీడీ ఫిర్యాదు చేసింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న డయల్ న్యూస్, పోస్ట్ 360, జర్నలిస్ట్ వైఎన్ఆర్ సోషల్ మీడియా ఖాతాల నిర్వాహకులపై కేసు నమోదైంది.

చాగంటి తిరుమల పర్యటనపై

చాగంటి కోటేశ్వరరావు తిరుమల పర్యటనపై వాస్తవ సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా టీటీడీ వెల్లడించినా, ఈ సోషల్ మీడియా ప్రతినిధులు...డయల్ న్యూస్, పోస్ట్ 360, జర్నలిస్ట్ వైఎన్ఆర్ పదే పదే టీటీడీ ప్రతిష్టను దెబ్బతినేలా వాస్తవాలను వక్రీకరించి అవాస్తవాలను ప్రచారం చేశారని టీటీడీ ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఈ ప్రతినిధులపై తిరుపతి యూనివర్సిటీ పీఎస్ లో కేసు నమోదు చేయడంతో పాటు న్యూఢిల్లీ, విజయవాడలోని పీఐబీ (ప్రెస్ ఇస్పర్మెషన్ బ్యూరో)కు ఫిర్యాదు చేసినట్లు టీటీడీ తెలిపింది.

అదేవిధంగా భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాగంటి కోటేశ్వరరావు అభిమానుల మనోస్థైర్యాన్ని పలుచన చేసేలా తప్పుడు ప్రచారం చేసిన సోషల్ మీడియా సంస్థల లైసెన్స్ లను రద్దు చేయాలని యూట్యూబ్, మేటా మేనేజ్మెంట్ కూడా ఫిర్యాదు చేసినట్లు టీటీడీ పేర్కొంది.

వాస్తవం ఏంటంటే?

వాస్తవానికి డా.చాగంటి కోటేశ్వరరావు జనవరి 14న శ్రీవారి దర్శనం, జనవరి 16వ తేదీ సాయంత్రం టీటీడీకి చెందిన మహతి ఆడిటోరియంలో ప్రవచనాలు ఇచ్చేందుకు గతేడాది డిసెంబర్ 20న టీటీడీ ప్రొసిడింగ్స్ ఇచ్చింది. చాగంటి కేబినేట్ ర్యాంక్ ప్రోటోకాల్ ప్రివిలేజ్ ప్రకారం జనవరి 14న శ్రీవారి దర్శనం ఏర్పాట్లను చేసింది. అందులో భాగంగా, రాంబగీఛ గెస్ట్ హౌస్ నుంచి శ్రీవారి ఆలయానికి వారిని తీసుకెల్లేందుకు బ్యాటరీ వాహనాలను, శ్రీవారి ఆలయానికి బయోమెట్రిక్ ద్వారా అనుమతించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది.

తోపులాట ఘటన నేపథ్యంలో

టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లను చాగంటి కోటేశ్వరరావు తిరస్కరించారు. సామాన్య భక్తుల తరహాలోనే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకురుకుంటానని వారే స్వయంగా వెల్లడించి శ్రీవారిని దర్శించుకున్నారు. జనవరి 8వ తేదీన తిరుపతిలో జరిగిన తోపులాట ఘటన నేపథ్యంలో చాగంటి వారి ప్రవచన కార్యక్రమాన్ని వాయిదా వేస్తే బాగుంటుందని వారి దృష్టికి టీటీడీ ఉన్నతాధికారులు తీసుకెళ్లారు. ఈ విన్నపాన్ని చాగంటి వారు అంగీకరించారు.

మరోసారి వారి అనుమతితో ప్రవచనాలు నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. వాస్తవం ఇలా ఉంటే బయోమెట్రిక్ ద్వారా కాకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి శ్రీవారి ఆలయంలోకి అనుమతించారని, చివరి నిమిషంలో పరిపాలనా కారణాల రీత్యా చాగంటి వారి ప్రవచనాల కార్యక్రమాన్ని టీటీడీ రద్దు చేసినట్లు అవాస్తవాన్ని ప్రచారం చేశారని టీటీడీ ఫిర్యాదు చేసింది.

శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బ తీయడమే కాకుండా, టీటీడీ సంస్థపై ఉద్దేశ్యపూర్వకంగా అవాస్తవాలను ప్రచారం చేస్తున్న వ్యక్తులపైనా, సంస్థలపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది.