Tirumala : తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు - SSD టోకెన్లపై టీటీడీ కీలక ప్రకటన
Tirumala Vaikunta Dwara Darshan Updates :తిరుమల ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం చివరి రోజు SSD టోకెన్ల జారీ జనవరి 17తో ముగిసే అవకాశం ఉందని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. జనవరి 19న ఆఫ్‌లైన్‌లో శ్రీవాణి టిక్కెట్లు జారీ చేయబడవని స్పష్టం చేశారు.
వైకుంఠ ద్వార దర్శనం ఎస్‌ఎస్‌డి టోకెన్లపై ఉన్నతాధికారులతో టీటీడీ ఈవో జె.శ్యామలరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక సూచనలు చేశారు.
తిరుమల ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం చివరి రోజు SSD టోకెన్ల జారీ శుక్రవారం (జనవరి 17)తో ముగిసే అవకాశం ఉందని ఈవో శ్యామలరావు తెలిపారు. జనవరి 20న దర్శనం కోరే భక్తులకు జనవరి 19న SSD టోకెన్లు జారీ చేయబడవని స్పష్టం చేశారు. వారు క్యూ లైన్‌లో మాత్రమే శ్రీవారి దర్శనం చేసుకోవాల్సి ఉంటుందన్నారు.
జనవరి 19న ఆఫ్‌లైన్‌లో శ్రీవాణి టిక్కెట్లు జారీ చేయబడవని ఈవో పేర్కొన్నారు. అదేవిధంగా జనవరి 20న టీటీడీ ప్రోటోకాల్ భక్తులను మినహాయించి వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేసినట్లు ప్రకటించారు. ఈ కారణంగా జనవరి 19న వీఐపీ బ్రేక్ దర్శనం కోసం ఎటువంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని స్పష్టం చేశారు. ఈ సూచనలను దృష్టిలో ఉంచుకుని భక్తులు తమ తిరుమల యాత్ర ప్రణాళికను రూపొందించుకుని టీటీడీకి సహకరించాలని ఈవో శ్యామలరావు కోరారు.
శ్రీవారి కల్యాణాలు వైభవంగా నిర్వహించాలి - ఈవో
ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళలో టిటిడి నిర్వహించనున్న శ్రీవారి కల్యాణోత్సవాలను వైభవంగా నిర్వహించాలని ఈవో శ్యామల రావు అధికారులను ఆదేశించారు. ప్రయాగ్ రాజ్ సెక్టార్ – 6లో చేపడుతున్న రోజువారీ కార్యక్రమాలపై గురువారం సమీక్షించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ… జనవరి 18, 26, ఫిబ్రవరి 3, 12 తేదీలలో జరుగనున్న శ్రీవారి కల్యాణోత్సవాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఉత్తరాది భక్తులు విరివిగా వచ్చే అవకాశం ఉంటుందని, భక్తుల రద్దీకి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
జనవరి 29న మౌణి అమావాస్య, ఫిబ్రవరి 3న వసంత పంచమి, ఫిబ్రవరి 12న మాగ పౌర్ణమి, ఫిబ్రవరి 26న శివరాత్రి లాంటి ప్రధాన రోజులలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని ఈవో చెప్పారు. ఈ నేపథ్యంలో టిటిడి విజిలెన్స్ అధికారులు… ప్రయాగ్ రాజ్ పోలీసులు సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూలైన్లు ఏర్పాటు చేయాలన్నారు. శ్రీవారి నమూనా ఆలయానికి వచ్చే భక్తులకు అవసరమైన సౌకర్యాలు చేయాలని సూచించారు. శ్రీవారి భక్తులకు ఉచితంగా ఇచ్చే చిన్న లడ్డూలను సమకూర్చుకోవాలన్నారు.
ప్రయాగ్ రాజ్ లో టిటిడి చేపడుతున్న రోజువారి శ్రీవారి కైంకర్యాలు, సౌకర్యాలను వర్చువల్ ద్వారా టిటిడి ఈవోకు టిటిడి అధికారులు నివేదించారు. శ్రీవారికి రోజువారి సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు జరుగుతున్న సేవలను వివరించారు. శ్రీవారి నమూనా ఆలయానికి రోజువారి భక్తులు ఎంత మంది వస్తున్నారు, వారికి ఎలాంటి సౌకర్యాలు చేపడుతున్నారు, టిటిడి సిబ్బందికి ఏర్పాటు చేసిన సౌకర్యాలపై అధికారులను ఈవో అడిగి తెలుసుకున్నారు.
సంబంధిత కథనం