Rains in Tirumala : భక్తులకు TTD అలర్ట్... శ్రీవారి మెట్టు నడక మార్గం మూసివేత, ఎప్పటివరకంటే..!-ttd closes srivari mettu footpath route on october 17 due to heavy rain alert ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Rains In Tirumala : భక్తులకు Ttd అలర్ట్... శ్రీవారి మెట్టు నడక మార్గం మూసివేత, ఎప్పటివరకంటే..!

Rains in Tirumala : భక్తులకు TTD అలర్ట్... శ్రీవారి మెట్టు నడక మార్గం మూసివేత, ఎప్పటివరకంటే..!

Maheshwaram Mahendra Chary HT Telugu
Oct 16, 2024 05:50 PM IST

భారీ వర్షాల కారణంగా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలకు వెళ్లే శ్రీవారి మెట్టు నడక మార్గాన్ని అక్టోబర్ 17 వరకు మూసివేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈవో శ్యామలరావు ప్రకటన విడుదల చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు ప్రకటించారు.

రేపు తిరుమలలో మెట్లు మార్గం మూసివేత
రేపు తిరుమలలో మెట్లు మార్గం మూసివేత

భారీ వర్షాల కారణంగా వాతావరణ పరిస్థితులు దృష్ట్యా తిరుమలకు వెళ్లే శ్రీవారి మెట్టు నడక మార్గాన్ని రేపటి వరకు మూసివేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. భారీ నుండి అతి భారీ వర్షాలు పడతాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో టీటీడీ ఈఓ శ్యామలరావు బుధవారం టీటీడీ ఉన్నతాధికారులతో వర్చువల్ గా సమావేశమయ్యారు.

అప్రమత్తంగా ఉండాలి - టీటీడీ ఈవో

ఈ సందర్భంగా విపత్తుల నిర్వహణ ప్రణాళికపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ… భారీ వర్షాల సమయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. అన్ని విభాగాలు సమన్వయంతో పని చేసి ఎలాంటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు.

కొండ చరియలపై ప్రత్యేక నిఘా ఉంచి ఘాట్ రోడ్లలో ట్రాఫిక్ జామ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ కు అంతరాయం కలకగకుండా చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్ శాఖ ముందస్తు జాగ్రత్తగా జనరేటర్ల కొరకు డీజిల్ ను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఐటీ వింగ్ భక్తుల దర్శనాలు, వసతి, ప్రసాదం వంటి కార్యాకలాపాలకు ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయం చూసుకోవాలన్నారు.

వైద్య శాఖ అంబులెన్సు లను అందుబాటులో పెట్టుకుని సిబ్బందితో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంజనీరింగ్ విభాగం డ్యామ్ గేట్లను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఘాట్ రోడ్లలో జేసీబీలను సిద్ధంగా ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ట్రాఫిక్ పోలీసులు ఇంజినీరింగ్ సిబ్బందితో సమన్వయం చేసుకుని పని చేయాలన్నారు. ఏదైనా విపత్కర పరిస్థితి ఎదురైతే అగ్ని మాపక సిబ్బంది వేగంగా స్పందించేందుకు అన్నీ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

ప్రజా సంబంధాల విభాగం వాతావరణ సమాచారాన్ని తెలుసుకుంటూ ఎస్వీబీసీ, సోషియల్ మీడియా ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తూ భక్తులను అప్రమత్తం చేయాలని సూచించారు. ఇప్పటికే పాపవినాశనం, శిలా తోరణం మార్గాలను టీటీడీ మూసివేసింది. వాతావరణ పరిస్థితులను బట్టి ఈ మార్గాల్లో రాకపోకలను టీటీడీ పునరుద్ధరించనుంది.

Whats_app_banner

సంబంధిత కథనం