TTD Chairman : తిరుపతి తొక్కిసలాట ఘటనలో భూమన హస్తం ఉండొచ్చు- బీఆర్ నాయుడు సంచలన వ్యాఖ్యలు
TTD Chairman : టీటీడీ ఛైర్మన్ గా పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డి అతిపెద్ద అవినీతిపరుడని, టీటీడీ కమీషన్ల ఛైర్మన్ గా వ్యవహరించారని...టీటీడీ ప్రస్తుత ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆరోపిచారు. తిరుపతి తొక్కిసలాట ఘటనలో భూమన హస్తం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
TTD Chairman : 'టీటీడీని రాజకీయాల్లోకి లాగొద్దని, కలియుగ దైవం వేంకటేశ్వరుడితో పెట్టుకుంటే ఆయన చూస్తూ ఊరుకోడని' టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. టీటీడీ ఛైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డి ఉన్న సమయంలో అనేక అక్రమాలకు జరిగాయని బీఆర్‌నాయుడు ఆరోపించారు. ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్‌లో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయన్నారు. ఆదివారం తిరుపతిలోని ఎస్వీ గోశాలను పరిశీలించిన అనంతరం బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. భూమన అతిపెద్ద అవినీతిపరుడని, టీటీడీలో కమీషన్ల ఛైర్మన్‌గా వ్యవహరించారని ధ్వజమెత్తారు.
తొక్కిసలాటలో భూమన హస్తం
గత మూడు నెలల్లో 100కి పైగా గోవులు మరణించాయని వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. అనారోగ్యం, వృద్ధాప్యం కారణాలతో గోవులు మరణించాయే తప్ప, టీటీడీ సిబ్బంది నిర్లక్ష్యం లేదన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి సోషల్ మీడియాలో విడుదల చేసినవన్నీ మార్ఫింగ్ ఫొటోలే అన్నారు. గోశాల మాజీ డైరెక్టర్ హరినాథరెడ్డి ఈ ఫొటోలు భూమనకు ఇచ్చారన్నారు. భూమనపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు.
"వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ సమయంలో తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో భూమన కరుణాకర్ రెడ్డి హస్తం ఉండొచ్చు. తొక్కిసలాట సమయంలో గోశాల మాజీ డైరెక్టర్ హరినాథరెడ్డి అక్కడే ఉన్నారు. ఆయన కూడా ఆ ఘటనకు కారణం కావొచ్చు" -బీఆర్ నాయుడు
పాద రక్షల ఘటనపై టీటీడీ చర్యలు
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఇద్దరు వ్యక్తులు తెల్లరంగు మెత్తటి గుడ్డతో తయారు చేసిన డిస్‌పోజబుల్ చెప్పులు ధరించి దర్శనానికి ప్రవేశించిన ఘటనపై టీటీడీ చర్యలు చేపట్టింది. తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించడంలో విఫలమైన సిబ్బందిని సస్పెండ్ చేసింది. టీటీడీ ఈవో జె.శ్యామల రావు ఆదేశాల మేరకు ఫుట్‌పాత్ హాల్, డౌన్ స్కానింగ్ పాయింట్ వద్ద విధులు నిర్వహిస్తున్న టీటీడీ సిబ్బంది, సెక్యూరిటీ గార్డులను సస్పెండ్ చేశారు. అలాగే తమ విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ఎస్పీఎఫ్ సిబ్బందిని సస్పెండ్ చేయాలని ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్‌కు ప్రతిపాదన పంపారు.
- సస్పెండ్ అయిన టీటీడీ సిబ్బంది: ఇద్దరు- చక్రపాణి (సీనియర్ అసిస్టెంట్), వాసు (జూనియర్ అసిస్టెంట్)
- సస్పెండ్ అయిన టీటీడీ భద్రతా సిబ్బంది – 5 మంది: డి. బాలకృష్ణ, వసుమతి, టి. రాజేష్ కుమార్, కె. వెంకటేష్, ఎం. బాబు,
- సస్పెన్షన్‌కు ప్రతిపాదించిన ఎస్పీఎఫ్ సిబ్బంది – 6 మంది: సి. రమణయ్య, బి. నీలబాబు, డి.ఎస్.కె. ప్రసన్న, సత్యనారాయణ, పోలి నాయుడు, ఎస్. శ్రీకాంత్.
సంబంధిత కథనం