TTD Board Member: టీటీడీ బోర్డు సభ్యుడి బూతు పురాణం, ఉద్యోగిపై చిందులు… వీడియో వైరల్-ttd board members misbehaviour spills on employee video goes viral ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ttd Board Member: టీటీడీ బోర్డు సభ్యుడి బూతు పురాణం, ఉద్యోగిపై చిందులు… వీడియో వైరల్

TTD Board Member: టీటీడీ బోర్డు సభ్యుడి బూతు పురాణం, ఉద్యోగిపై చిందులు… వీడియో వైరల్

Sarath Chandra.B HT Telugu
Published Feb 19, 2025 07:49 AM IST

TTD Board Member: తిరుమలలో టీటీడీ బోర్డు సభ్యుడి బూతులతో తిట్ల దండకం వైరల్‌గా మారింది. ఆలయ మహాద్వారం నుంచి బయటకు పంపేందుకు ఉద్యోగి అనుమతించక పోవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన బోర్డు సభ్యుడు బూతులతో విరుచుకు పడ్డారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

టీటీడీ ఉద్యోగి బాలాజీని దూషిస్తున్న  బోర్డు సభ్యుడు నరేశ్‌ కుమార్‌
టీటీడీ ఉద్యోగి బాలాజీని దూషిస్తున్న బోర్డు సభ్యుడు నరేశ్‌ కుమార్‌

TTD Board Member: విధుల్లో ఉన్న టీటీడీ ఉద్యోగిపై బోర్డు సభ్యుడు బూతులతో విరుచుకుపడటం కలకలం రేపింది. మహా ద్వారం తలుపులు తీయనందుకు టీటీడీ ఉద్యోగిని బోర్డు సభ్యుడు నరేష్‌ చేత్తో నెట్టేస్తూ బూతులు తిట్టడం వీడియోలలో రికార్డైంది. మంగళవారం టీటీడీ ఉద్యోగిపై ధర్మకర్త మండలి సభ్యుడు నరేష్‌ తిట్లతో విరుచుకుపడ్డారు. దర్శనం పూర్తైన తర్వాత మహాద్వారం నుంచి బయటికి పంపక పోవడంతో నరేష్‌ ఆగ్రహంతో ఊగిపోయారు. భ క్తులు చూస్తుండగానే ఉద్యోగిపై తిట్ల దండకంతో విరుచుకు పడ్డారు.

టీటీడీ సభ్యుడు నరేష్‌ కుమార్‌ విధుల్లో ఉన్న ఉద్యోగిపై బూతులతో విరుచుకుపడ్డారు. సభ్యుడు ప్రవర్తించిన తీరుతో అంతా అవాక్కయ్యారు. ఆయన వ్యవహరించిన తీరుతో అక్కడ ఉన్న భక్తులు, ఉద్యోగులు విస్తుబోయారు. టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం బంధువులతో కలిసి మహా ద్వారం వద్దకు చేరుకు న్నారు.

ఆ సమయంలో బోర్డు సభ్యుడి వెంట ఉన్న వ్యక్తి మహాద్వారం తలుపులు టీటీడీ ఉద్యోగి బాలాజీని సూచించారు. మహా ద్వారం గేటు నుంచిఎవరినీ పంపడం లేదని, ఉన్నతాధికారులు ఆదేశిస్తేనే తలుపులు తీస్తానని బదులిచ్చాడు. దీంతో ఒక్కసారిగా ఆవేశంతో ఊగిపోయిన బోర్డు సభ్యుడు నరేష్‌ కుమార్‌ ఉద్యోగిపై తిట్లు లంకించుకున్నారు. ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదా అంటూ నువ్వు బయటకు పో.. అంటూ రెచ్చిపోయారు.

గొడవ జరుగుతున్న టీటీడీ వీజీఓ సురేంద్ర, పోటు ఏఈఓ మునిరత్నం బోర్డు సభ్యుడు నరేష్‌కుమార్‌కు సర్దిచెప్పి మహద్వారం గేటు తీసి బయటకు పంపారు. కొందరు ఉద్యోగులు బోర్డు సభ్యులను కనీసం గౌరవించడం లేదని ఆరోపించారు.

తిరుమలలో వీఐపీలు ఆలయం వెలుపలకు వచ్చే సమయంలో మహాద్వారం, గొల్లమండపం మధ్య తీవ్ర రద్దీ ఏర్పడుతోంది. బయటకు వచ్చేభక్తులు బయోమెట్రిక్‌ వైపుగానే రావాలని సూచిస్తున్నారు. మంగళవారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని బయటకు వస్తున్న బెంగళూరుకు చెందిన నరేశ్‌ కుమార్‌ గేటు తీయాలని మహాద్వారం వద్ద విధుల్లో ఉన్న ఉద్యోగి బాలాజీని ఆదేశించారు.

బయోమెట్రిక్‌ మార్గంలో వెళ్లాలని బాలాజీ చెప్పడంతో నరేశ్‌ ఆగ్రహంతో ఊగిపోయారు. ‘ఎవడ్రా నువ్వు అంటూ మండిపడ్డారు.. పోరా బయటకి! థర్డ్‌క్లాస్‌ నా.. కొడకా, బయటకి పంపండి ఇతడిని, లేకుంటే ఇక్కడే కుర్చునేస్తాను’ అంటూ రెచ్చిపోయారు. టీటీడీ ఉద్యోగి బాలాజీ భుజంపై చేయి వేసి నెట్టారు. టీటీడీ విజిలెన్స్‌, అధికారులు జోక్యం చేసుకుని నరేశ్‌ కుమార్‌కు నచ్చజెప్పి ఆ ఉద్యోగిని అక్కడినుంచి పంపేశారు.

టీటీడీ బోర్డు సభ్యులను మహాద్వారం గుండా అనుమతించాలనే నిబంధన లేదు. మహాద్వారం నుంచి బంధుమిత్ర సపరిపారంగా రాకపోకలు సాగించడం రివాజుగా మారింది. ఉద్యోగి తన విధులు నిర్వర్తించినందుకు బూతులు తిట్టడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వ్యవహారంలో ఆలయ ఉద్యోగిపై బోర్డు సభ్యుడు నరేశ్‌ దూషించిన వీడియోలు వైరల్‌ అయ్యాయి.

Sarath Chandra.B

TwittereMail
శరత్‌ చంద్ర హిందుస్థాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. ఈనాడు, ఎన్టీవి, టీవీ9, హెచ్‌ఎంటీవి, ఎక్స్‌ప్రెస్‌ టీవీ, టీవీ5లలో పని చేశారు. 2010-14 మధ్యకాలంలో హెచ్‌ఎంటీవీ, మహా టీవీలో ఢిల్లీ బ్యూరో చీఫ్‌/అసిస్టెంట్‌ ఎడిటర్‌గా పనిచేశారు. నాగార్జున వర్శిటీ క్యాంపస్ కాలేజీలో జర్నలిజంలో పట్టభద్రులయ్యారు. 2022లో హెచ్‌టీలో చేరారు.
Whats_app_banner