తిరుమల శ్రీవారి దర్శనానికి వాహనాల్లో వచ్చే భక్తులకు టీటీడీ కీలక అప్డేట్ ఇచ్చింది. తిరుమలకు రాకపోకలు సాగించే ఘాట్ రోడ్డులో బీ.టీ రోడ్డు పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాహనదారులు మరింత అప్రమత్తంగా వాహనాలను నడపాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
శ్రీవారి భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఘాట్ రోడ్డును మూసివేయలేదని టీటీడీ తెలిపింది. అయితే నిర్దేశించిన సమయంలో మరమ్మత్తు పనులను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టిందని వెల్లడించింది. భక్తులు తమ తిరుమల ప్రయాణాన్ని ప్రణాళికబద్ధంగా మార్చుకుని కనీసం గంట సమయం ముందుగా ప్రారంభించాలని కోరింది.
మరమ్మతుల కారణంగా వాహనదారులు నెమ్మదిగా అక్కడక్కడా కొద్ది సేపు ఆగుతూ ప్రయాణించాల్సి ఉంటుందనే విషయాన్ని భక్తులు గమనించాలని టీటీడీ సూచించింది. భక్తులు మరింత సులభంగా, సౌకర్యంగా ప్రయాణించేేందుకు ఈ మరమ్మతు పనులను చేపట్టినట్లు వెల్లడించింది.
భక్తులు రేణిగుంట విమానాశ్రయం, తిరుపతి రైల్వేస్టేషన్, ఆర్డీసీ బస్ స్టాండ్ ప్రాంతాల నుంచి తిరుమల విచ్చేసే వాహనదారులు ముందస్తుగా ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలి. మరమ్మతు పనులను పూర్తి చేయడానికి టీటీడీలోని ప్రతి విభాగం అప్రమత్తంగా ఏర్పాట్లు చేపట్టింది.
ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని వాహనదారులు తిరుమల చేరుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. నిర్దేశించిన సమయంలో పనులు పూర్తి కావడానికి భక్తులు, వాహదారులు సహకరించాలని కోరింది. అత్యవసర సేవలకు టోల్ ఫ్రీ నెంబర్ 155257 ను సంప్రదించవచ్చని సూచించింది.
సంబంధిత కథనం