Tirumala Darshan Tickets: శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక నడిచొచ్చేవారికి కూడా దివ్యదర్శనం టోకెన్లు
Tirumala Latest News: శ్రీవారి దర్శనం కోసం నడిచి వచ్చే భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది టీటీడీ. త్వరలోనే వారికి దివ్యదర్శనం టోకెన్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
Tirumala Tirupati Devasthanam Updates: శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది టీటీడీ. అతి త్వరలోనే నడకదారిలో వచ్చే భక్తులకు కూడా దివ్య దర్శనం టోకెట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఫలితంగా అలిపిరి, శ్రీవారిమెట్టు నడకమార్గాల్లో వచ్చే భక్తులకు దివ్యదర్శనం టోకెన్లు అందనున్నాయి. నడక మార్గాల్లో వచ్చే భక్తుల్లో 60 శాతం మంది వద్ద దర్శన టికెట్లు ఉండడం లేదని గుర్తించినట్లు టీటీడీ పేర్కొంది. కాబట్టి వారికి దివ్యదర్శనం టోకెన్లు జారీ చేయాలని నిర్ణయించినట్టు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి ప్రకటించారు.ఇందుకోసం ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.
శుక్రవారం స్థానిక అన్నమయ్య భవనంలో టీటీడీ డయల్ యువర్ ఈవో కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా మీడియాతో మాట్లాడిన ఈవో ధర్మారెడ్డి… ఏప్రిల్ మొదటి వారానికి తిరుమలకు 10 ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. వీటిని ధర్మరథం బస్సుల స్థానంలో ఉపయోగిస్తామన్నారు, తిరుమలలో గదుల కేటాయింపు విచారణ కేంద్రాల్లో రాగి బాటిళ్ల విక్రయానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు.
Tirumala facial recognition: ఇక తిరుమలలో మార్చి 1వ తేదీ నుంచి ముఖ గుర్తింపు విధానంతో శ్రీవారి సేవలు మొదలయ్యాయి. శ్రీవారి దర్శనం, గదుల కేటాయింపు, లడ్డూ ప్రసాదం తదితర అంశాల్లో మరింత పారదర్శకత తెచ్చేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది . తిరుమలకు వచ్చే భక్తులకు గదుల కేటాయింపు.. కాషన్ డిపాజిట్ తిరిగి చెల్లించే కౌంటర్లలో ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ అమలు చేసింది.
మార్చి 1 నుంచి టీటీడీ ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించింది టీటీడీ. తిరుమలలోని గదుల కేటాయింపు కేంద్రాల వద్ద ప్రయోగాత్మకంగా కెమెరాలతో ఈ సాంకేతికతను పరిశీలించింది. ఖాళీ చేసే సమయంలోనూ గదులు పొందినవారే వచ్చి మరోమారు ఫేస్ రికగ్నేషన్ చేస్తే కాషన్ డిపాజిట్ తిరిగి చెల్లిస్తారు. తిరుమలలో ఉన్న గదుల కేటాయింపు కౌంటర్లు, కాషన్ డిపాజిట్ తిరిగి చెల్లించే కౌంటర్ల వద్ద, వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లో టోకెన్లు లేకుండా సర్వదర్శనానికి వచ్చే భక్తులకు ఈ సాంకేతికత సాయంతో లడ్డూలు ఇస్తారు.
ప్రస్తుతం గదుల కేటాయింపు కేంద్రాలు వద్ద, కాషన్ డిపాజిట్ కౌంటర్ల వద్ద ప్రస్తుతం ఈ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఇందు కోసం ఆధునికి టెక్నాలజీ కలిగిన కెమెరాలను ఏర్పాటు చేశారు. దీని వల్ల ఒకే వ్యక్తి ఎక్కువ గదులు తీసుకోవడానికి వీలుండదు. ఈ విధానం వల్ల పారదర్శకంగా భక్తలకు సేవలు అందించవచ్చని టీటీడీ భావిస్తోంది. ప్రయోగాత్మకంగా పరిశీలించిన అనంతరం లోటు పాట్లను పరిగణలోకి తీసుకుని, పూర్తి స్థాయిలో అమలు చేస్తామని టీటీడీ అధికారులు చెబుతున్నారు. ఫేషియల్ రికగ్నిషన్ విధానంలో ఓ భక్తుడు నెలలో ఒక్కసారి మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. తిరుమలలో భక్తుల రద్దీని నియంత్రించే పేరుతో భక్తుల రాకను నియంత్రిస్తున్నారనే విమర‌్శలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం తిరుమలలో భక్తులు పొందే ప్రతి సేవకు ఆధార్ తప్పనిసరి చేశారు. తిరుమలలో లభించే ప్రతి సేవకు, శ్రీవారి దర్శనానికి లడ్డూ ప్రసాదాల విక్రయాలకు, గదులను అద్దెకు తీసుకోడానికి ఆధార్ తప్పనిసరి చేశారు.
సంబంధిత కథనం