Tirumala Hundi Income : 2024లో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.1,365 కోట్లు - టీటీడీ ప్రకటించిన లెక్కలివే
Tirumala Hundi Income 2024 : గత ఏడాదికి సంబంధించి తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం వివరాలను టీటీడీ వెల్లడించింది. 2024లో శ్రీవారికి హుండీ ద్వారా రూ.1,365 కోట్ల ఆదాయం సమకూరినట్లు ప్రకటించింది.మొత్తం 2.55 కోట్ల మంది భక్తులు శ్రీనివాసుడిని దర్శించుకున్నారని పేర్కొంది.
2024 ఏడాదిలో తిరుమల శ్రీవారికి వచ్చిన హుండీ ఆదాయం వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. శ్రీవారికి హుండీ ద్వారా రూ.1,365 కోట్ల ఆదాయం వచ్చినట్లు పేర్కొంది.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
టీటీడీ తెలిపిన వివరాలు:
- 2024లో శ్రీవారికి హుండీ ద్వారా రూ.1,365 కోట్ల ఆదాయం సమకూరింది.
- మొత్తం 2.55 కోట్ల మంది భక్తులు తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు.
- తిరమల శ్రీవారికి 2024 ఏడాదిలో మొత్తం 99 లక్షల మంది తల నీలాలు సమర్పించారు.
- 6.30 కోట్ల మంది అన్నప్రసాదం స్వీకరించారు.
- 12.14 కోట్ల మంది భక్తులు శ్రీవారి లడ్డూలు విక్రయించారు.
ఇక నూతన సంవత్సరం వేళ జనవరి 1, 2025వ తేదీన తిరుమల శ్రీవారి 69,630 భక్తులు దర్శించుకున్నారు. 18,965 మంది తలనీలాలను సమర్పించగా… రూ. 3.13 కోట్లు హుండీ కానుకులు వచ్చినట్లు టీటీడీ పేర్కొంది. శ్రీవారి సర్వ దర్శనం కోసం 8 గంటల సమయం పడుతుందని… మూడు కంపార్టమెంట్లలో భక్తులు వేచి ఉన్నారని తెలిపింది.
వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు:
తిరుమలలో వైకుంఠ ఏకాదశికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ సమయంలో అన్నిరకాల ప్రివిలేజ్డ్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది. వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులకు టైంస్లాట్ టోకెన్లు జారీ చేస్తున్నట్లు పేర్కొంది.
వైకుంఠ ద్వార దర్శనం కొరకు భక్తులు క్యూలైన్లలో ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా భక్తులకు టైంస్లాట్ టోకెన్లు జారీ చేస్తారు. ఆన్‌లైన్‌లో దర్శనం బుక్ చేసుకున్న దాతలను రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన క్యూలైన్ ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. సామాన్య భక్తుల సౌకర్యార్థం జనవరి 8 నుండి 11వ తేదీ వరకు దాతలకు గదుల కేటాయింపు ఉండదు. మిగతారోజుల్లో దాతలు యథావిధిగా గదులు బుక్ చేసుకోవచ్చు.
జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి మొదటి మూడు రోజులకు జనవరి 9వ తేదీన ఉదయం 5 గం.ల నుండి 1.20 లక్షల టోకెన్లు జారీ చేస్తారు. తదుపరి రోజులకు (13 నుండి 19వ తేదీ వరకు) ఏ రోజుకారోజు ముందు రోజు భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసంలలో టోకెన్లు జారీ చేస్తారు. దర్శన టోకెన్లు గల భక్తులను మాత్రమే తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతించడం జరుగుతుంది. చంటిపిల్లల తల్లిదండ్రులతో పాటు వృద్ధులు, దివ్యాంగులు, ఎన్‌ఆర్‌ఐ, రక్షణ సిబ్బంది తదితర ప్రత్యేక దర్శనాలను ఈ పది రోజులపాటు రద్దు చేయడమైనది.
భక్తుల అధిక రద్దీ దృష్ట్యా ఈ 10 రోజులలో వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవు, అయితే ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులు స్వయంగా వస్తే వారికి మాత్రం శ్రీవారి దర్శనం కల్పించడం జరుగుతుంది. జనవరి 7న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతుంది. జనవరి 10న వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 9 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు స్వర్ణరథంపై ఆలయ నాలుగుమాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారు. జనవరి 11న వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 5.30 నుండి 6.30 గంటల వరకు చక్రస్నానం నిర్వహిస్తారు.
సంబంధిత కథనం