TTD EO Dharma Reddy : నాపై వ్యక్తిగత ఆరోపణలు సమంజసం కాదు - టీటీడీ ఈవో ధర్మారెడ్డి
TTD Latest News:టీటీడీలో పూర్తి పారదర్శక పాలన సాగుతుందన్నారు ఈవో ధర్మారెడ్డి. తనపై వ్యక్తిగత ఆరోపణలు సమంజసం కాదని… టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి వాస్తవాలు తెలుసుకుని ఉంటే బాగుండేదని హితవు పలికారు.
TTD EO Dharma Reddy : తిరుమల తిరుపతి దేవస్థానంలో పూర్తి పారదర్శకంగా పాలన జరుగుతోందని, విస్తృతంగా ధర్మప్రచారంతోపాటు భక్తుల సౌకర్యాలకు పెద్దపీట వేస్తున్నామని, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి చేసిన ఆరోపణలపై ఈవో స్పందించారు. తనపై అవాస్తవాలతో కూడిన వ్యక్తిగత ఆరోపణలు చేయడం బాధాకరమని, వాస్తవాలు తెలుసుకుని ఉంటే బాగుండేదని అన్నారు. ఆయన ఆరోపణలను ఈవో ఖండించారు.
తిరుమల అన్నమయ్య భవనంలో గురువారం సాయంత్రం ఈవో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ…. ఈవోగా పనిచేయడానికి తనకు అర్హత లేదని ఆరోపించారని ఇది వాస్తవం కాదన్నారు. దేవాదాయ చట్టం 107వ సెక్షన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా కలెక్టర్ లేదా ఆ పోస్టుకు సమానమైన హోదా ఉన్నవారు ఈవోగా పనిచేయడానికి అర్హులని తెలిపారు. తాను 1991 బ్యాచ్ సివిల్ సర్వీసెస్ ఐడిఇఎస్ అధికారినని, 33 సంవత్సరాల అనుభవం ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ హోంశాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేశానని, ఇది ఎపిలో ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాతో సమానమని, కావున ఇది కలెక్టర్ కంటే ఎక్కువ హోదా అని వివరించారు. తిరుపతికి చెందిన శ్రీ నవీన్‌కుమార్‌రెడ్డి తన అర్హతపై హైకోర్టులో పిటిషన్ వేశారని, అయితే, ధర్మాసనం తన అర్హతను పరిశీలించి అర్హుడిగా నిర్ణయిస్తూ పిటిషన్‌ను కొట్టివేసిందని తెలియజేశారు.
ఢిల్లీలో తనపై క్రిమినల్ కేసు ఉందని సదరు నేత ఆరోపించారని, దీనికి సంబంధించిన వాస్తవ వివరాలు ఇలా ఉన్నాయని చెప్పారు. 2014లో ఢిల్లీ కంటోన్మెంట్ డిఫెన్స్ సిఈవోగా ఉన్నప్పుడు అక్రమ కట్టడాలపై చట్టపరంగా చర్యలు తీసుకున్నామన్నారు. 2020లో వారు కోర్టులో ప్రయివేటు కేసు వేస్తే దానికి సంబంధించిన సమన్లు గత ఏడాది జారీ చేశారని చెప్పారు. సమన్లు స్వ్కాష్ చెయ్యాలని కోర్టులో కేసు వేస్తే దానిపై స్టే విధించారని తెలిపారు. ఇందులో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేదని, అప్పుడు నిబంధనలు పాటించనివారిపై మాత్రమే చర్యలు తీసుకున్నామని చెప్పారు.
అదేవిధంగా, గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో టీటీడీలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామన్నారు. తిరుమలలో దర్శన దళారులను అరికట్టామని, శ్రీవాణి ట్రస్టుకు ఇప్పటివరకు రూ.1,021 కోట్ల విరాళాలు అందాయని తెలిపారు. ఇప్పటివరకు 550 ఆలయాలు నిర్మించడం జరిగింది. 3 వేలకు పైగా ఆలయాలు వివిధ దశల్లో ఉన్నాయి. 176 పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ చేపట్టామని వివరించారు. వైజాగ్, భువనేశ్వర్, జమ్మూ తదితర ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించామని చెప్పారు. అదేవిధంగా దాతల సహకారంతో రూ.140 కోట్లతో తిరుమలలో మ్యూజియంను ఆధునీకరిస్తున్నామని, రూ.25 కోట్లతో అలిపిరి నడకమార్గంలో పైకప్పు, రూ.25 కోట్లతో నూతన పరకామణి భవనం, రూ.15 కోట్లతో బర్డ్ ఆసుపత్రిలో నూతన వైద్యపరికరాలు ఏర్పాటు చేశామని తెలియజేశారు. వీటితోపాటు శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయలో 2 వేలకు పైగా గుండె ఆపరేషన్లు నిర్వహించామని, 8 గుండె మార్పిడి ఆపరేషన్లు చేశామని, చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి రూ.175 కోట్ల విరాళాలు అందాయని తెలిపారు.
2019 జూన్ నుండి 2023 అక్టోబరు వరకు దాదాపు రూ.4800 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు, దాదాపు 3885 కిలోల బంగారం డిపాజిట్లు పెరిగాయని ఈవో వెల్లడించారు. ఎస్వీబీసీని విస్తృతంగా భక్తుల్లోకి తీసుకెళ్లామని, భక్తులు స్వచ్ఛందంగా రూ.50 కోట్లకు పైగా విరాళాలు అందిచారని చెప్పారు. స్విమ్స్‌లో రూ.77 కోట్లతో నూతనంగా కార్డియో, న్యూరో బ్లాక్ నిర్మిస్తున్నామని, అదేవిధంగా, రూ.197 కోట్లతో నాలుగేళ్లలో దశలవారీగా మొత్తం భవనాలను ఆధునీకరిస్తామని తెలియజేశారు.