తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ మంచి వార్త చెప్పింది. చాలా మంది టీటీడీ క్యాలెండర్లు, డైరీలను కావాలనుకుంటారు. కానీ ఎక్కడ తీసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. అలాంటివారు నేరుగా మీ ఇంటికే క్యాలండర్, డేరీలను తెప్పించుకోవచ్చు. ఇందుకోసం టీటీడీ సేవలను అందుబాటులోకి తెచ్చింది.
శ్రీవారి భక్తుల సౌకర్యార్థం టీటీడీ 2026 సంవత్సర క్యాలెండర్లు, డైరీలను ఆఫ్‌లైన్‌లో ఎంపిక చేసిన ప్రాంతాలలోనూ, టీటీడీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ భక్తులకు విక్రయిస్తోంది. 2026 సంవత్సరానికి సంబంధించి 12- పేజీలు, 6- పేజీలు, టేబుల్-టాప్-క్యాలెండర్‌లు, డీలెక్స్ డైరీలు, చిన్న డైరీలను, శ్రీవేంకటేశ్వర స్వామి, శ్రీపద్మావతి అమ్మవారి పెద్దసైజు, శ్రీవారి, శ్రీపద్మావతి అమ్మవారు ఇరువురు ఉన్న కేలండర్లను టీటీడీ అందుబాటులో ఉంచింది.
ముఖ్యంగా తిరుమల, తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ఎదురుగా సేల్స్ సెంటర్, శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయం సమీపంలోని ధ్యానమందిరం, శ్రీనివాసం, విష్ణునివాసం ప్రాంతాల్లోనూ, తిరుచానూరులో ఉన్న టీటీడీ పబ్లికేషన్ స్టాల్స్‌లలో అందుబాటులో ఉన్నాయి.
అంతేకాక విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, హైదరాబాద్‌లోని హిమయత్ నగర్‌లోని ఎస్వీ ఆలయం, జూబ్లీహిల్స్‌లోని ఎస్వీ ఆలయం, బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబై, వేలూరులతో పాటు రాజమండ్రి, కర్నూలు, కాకినాడ, నెల్లూరులోని కళ్యాణమండపాల్లో 2026 సంవత్సరం క్యాలెండర్లు, డైరీలను భక్తులకు అందుబాటులో ఉంచింది టీటీడీ.
టీటీడీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకున్న వారికి పోస్టల్ డిపార్ట్‌మెంట్ ద్వారా ఇంటి వద్దే టీటీడీ డైరీలు, క్యాలండర్స్‌ను పొందే సౌలభ్యం గతంలో లాగానే ఉంది. టీటీడీ క్యాలెండర్లు, డైరీలను టీటీడీ వెబ్‌సైట్ ద్వారా (www.tirumala.org, ttdevasthanams.ap.gov.in) ఆన్‌లైన్‌లో పొందవచ్చు.
టాపిక్