TTD Brahmotsavam : రెండేళ్ల తర్వాత మాడ వీధుల్లో బ్రహ్మోత్సవ వాహనసేవలు-ttd ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

TTD Brahmotsavam : రెండేళ్ల తర్వాత మాడ వీధుల్లో బ్రహ్మోత్సవ వాహనసేవలు

HT Telugu Desk HT Telugu
Jul 09, 2022 02:06 PM IST

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 27 నుండి అక్టోబరు 5వ తేదీ వరకు జరుగనున్నాయని, కరోనా కారణంగా రెండేళ్ల తరువాత మాడ వీధుల్లో వాహనసేవలు నిర్వహించి భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తున్నట్లు టిటిడి ఈఓ ఎవి.ధర్మారెడ్డి ప్రకటించారు. ఆగస్టు 1 నుండి అఖండ హరినామ సంకీర్తన పునఃప్రారంభిస్తున్నట్లు ధర్మారెడ్డి తెలిపారు.

జూన్‌లో తిరుమలకు పోటెత్తిన భక్తులలు
జూన్‌లో తిరుమలకు పోటెత్తిన భక్తులలు

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సెప్టెంబరు 27న సాయంత్రం 5.45 నుండి 6.15 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం జరుగనుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబరు 1న గరుడ వాహనం, 2న స్వర్ణరథం, 4న రథోత్సవం, 5న చక్రస్నానం జరుగనున్నాయి. కరోనా కారణంగా తిరుమలలో కొంత కాలం పాటు నిలిచిపోయిన అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమం ఆగస్టు 1వ తేదీ నుండి తిరిగి ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రాంతాల నుండి జానపద కళాకారులు విచ్చేసి అన్నమయ్య, త్యాగయ్య తదితర వాగ్గేయకారుల భజనలు, కీర్తనలు ఆలపిస్తారు.

ట్రెండింగ్ వార్తలు

చిన్నపిల్లల హృదయాలయ…

గతేడాది అక్టోబర్ 11న ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా తిరుపతిలో ప్రారంభించిన శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయలో ఇప్పటివరకు 490 ఓపెన్ హార్ట్ సర్జరీలు జరిగాయని ఇక్కడి డాక్టర్లు అంకిత భావంతో విధులు నిర్వహిస్తున్నారని ఈవో తెలిపారు. ఇటీవల 7 రోజుల పసికందుకు విజయవంతంగా గుండె శస్త్రచికిత్స చేశారు. హృదయాలయలో ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. చిన్నపిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు ఉత్తమ వైద్యం అందించేందుకు రెండు సంవత్సరాల్లో శ్రీ పద్మావతి పీడియాట్రిక్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటించారు.

అమెరికాలో శ్రీనివాస కల్యాణాలు

అమెరికాలో స్థిరపడిన తెలుగువారి కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఆదేశాలతో జూన్‌ 18 నుంచి జూలై 9వ వరకు ఎనిమిది నగరాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ రెసిడెంట్‌ తెలుగు సొసైటి సహకారంతో ఈ కల్యాణాలు నిర్వహించారు. జూన్‌ 18న శాన్‌ఫ్రాన్సిస్కో, 19న సియాటెల్‌, 25న డల్లాస్‌, 26న సెయింట్‌ లూయిస్‌, 30న చికాగో, జులై 2న న్యూ ఆర్లిన్‌, 3న వాషింగ్టన్‌ డిసి, 9న అట్లాంటా నగరాల్లో శ్రీవారి కల్యాణాలు జరిగాయి.

పోటెత్తిన భక్తులు..

జూన్‌ నెలలో 23.23 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. హుండీ కానుకల ద్వారా రూ.123.74 కోట్ల రుపాయలు లభించాయి. 95.34 లక్షల లడ్డూలను భక్తులకు విక్రయించారు. దాదాపు 50.61లక్షల మంది భక్తులు అన్నప్రసాదాలను స్వీకరించారు. 11.61లక్షల మంది తలనీలాలు సమర్పించారు.

IPL_Entry_Point

టాపిక్