Telangana Police : పవన్‌కళ్యాణ్‌పై రెక్కీకి ఆధారాల్లేవన్న తెలంగాణ పోలీసులు….
Telangana Police పవన్ కళ్యాణ్‌పై దాడికి యత్నించారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని తెలంగాణ పోలీసులు స్పష్టం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను హతమార్చడానికి కుట్ర జరుగుతోందని, ఈ క్రమంలోనే ఆయన ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహించారనే ఆరోపణల్ని పోలీసులు ఖండించారు. మద్యం మత్తులోనే యువకులు భద్రతా సిబ్బందిపై దాడికి పాల్పడ్డారని స్పష్టం చేశారు.
Telangana Police జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై దాడికి కుట్ర జరుగుతోందని, ఈ క్రమంలొోనే హైదరాబాద్ లోని ఆయన ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహించారంటూ జరుగుతున్న ప్రచారంపై తెలంగాణ పోలీసు శాఖ వివరణ ఇచ్చింది. పవన్ కల్యాణ్ ఇంటి వద్ద ఎలాంటి రెక్కీ జరగలేదని, పవన్ పై దాడికి కూడా కుట్ర కూడా జరగలేదని ఆ శాఖ వెల్లడించింది. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు ఇచ్చిన నివేదికను తెలంగాణ పోలీసు శాఖ విడుదల చేసింది.
ట్రెండింగ్ వార్తలు
అక్టోబర్ 31న రాత్రి సమయంలో ఆదిత్య, సాయికృష్ణ, వినోద్ అనే ముగ్గురు యువకులు హైదరాబాద్ లోని పవన్ ఇంటి వద్ద పవన్ బౌన్సర్లతో గొడవకు దిగారు. పవన్ ఇంటి ముందు వాహనం నిలపడంతో దానిని అక్కడి నుంచి తీయాలని భద్రతా సిబ్బంది చెప్పడంతో మద్యం మత్తులో ఉన్న యువకులు వారితో ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో పవన్ ఇంటిపై రెక్కీ నిర్వహించేందుకే ఆ యువకులు అక్కడికి వచ్చారని, అంతేకాకుండా పవన్ ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వెంబడిస్తున్నారని జనసేన ఆందోళన వ్యక్తం చేసింది.
అక్టోబర్ 31 రాత్రి జరిగిన ఘటనపై పవన్ సెక్యూరిటీ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు, గొడవకు కారణమైన యువకులను అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో భాగంగా మద్యం మత్తులోనే తాము పవన్ కల్యాణ్ ఇంటి వద్ద కారు ఆపామని, ఆ సమయంలో తమ కారును అక్కడి నుంచి తీయమన్న పవన్ సెక్యూరిటీ సిబ్బందితో గొడవకు దిగామని ఆ యువకులు చెప్పినట్లు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో సదరు యువకులకు నోటీసులు జారీ చేసిన పంపించివేసినట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో రెక్కీ గానీ, పవన్ పై దాడికి కుట్ర గానీ జరగలేదని వారు తేల్చేశారు. మరోవైపు పవన్ కళ్యాణ్‌కు హానీ తలపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని జనసేన నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగానే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొందరు వ్యక్తులు పవన్ నివాసం వద్ద రెక్కీ నిర్వహించారని ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎంపీ రఘు రామకృష్ణం రాజు వంటి వారు కూడా కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు లేఖ రాశారు. పవన్ కళ్యాణ్‌కు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అటు వైసీపీ మాత్రం పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద జరిగిన ఘటనను రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది.