YS Viveka Murder Case : అవినాశ్ రెడ్డి పిటిషన్‌పై టీఎస్ హైకోర్టు తీర్పు రిజర్వు
YS Viveka Murder Case : వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ తీవ్రచర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కోరుతూ అవినాశ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది. తదుపరి విచారణపైనా స్టే ఇవ్వాలన్న పిటిషన్‌పైనా తీర్పు రిజర్వు చేస్తూ నిర్ణయం వెలువరించింది.
YS Viveka Murder Case : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి... సీబీఐ అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించగా.. సోమవారం (మార్చి 13) వరకు అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు... తీర్పు రిజర్వు చేసింది. తదుపరి విచారణపైనా స్టే ఇవ్వాలన్న పిటిషన్‌పైనా తీర్పు రిజర్వు చేస్తూ నిర్ణయం వెలువరించింది. తీర్పు వెల్లడించే వరకు అవినాశ్ ని అరెస్టు చేయవద్దని తెలంగాణ హైకోర్టు సీబీఐని ఆదేశించింది.
సీబీఐ విచారణ ఏకపక్షంగా సాగుతోందని.. విచారణ సందర్భంగా వీడియో రికార్డింగ్ చేస్తున్నారో లేదో తెలియడం లేదని అవినాశ్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆయన తరపు న్యాయవాది సైతం కోర్టులో ఇవే వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగిన విచారణలో ఈ అంశంపై సీబీఐ తరపు న్యాయవాదులు స్పష్టత ఇచ్చారు. అవినాశ్ విచారణను ఆడియో, వీడియో రికార్డు చేస్తున్నామని కోర్టుకి తెలిపారు. అలాగే... కేసులో అవినాశ్ రెడ్డికి పాత్రకు సంబంధించిన వివరాలను హైకోర్టుకి సీల్డ్ కవర్ లో అందించింది సీబీఐ. 10 డాక్యుమెంట్లు, 35 వాంగ్మూలాలు, కొన్ని ఫోటోలు సమర్పించింది. సాక్ష్యాల ధ్వంసంలో అవినాశ్ పాత్ర ఉందన్న సీబీఐ... తీవ్ర చర్యలు తీసుకోవద్దంటూ ఆదేశాలు ఇవ్వొద్దని కోరింది. దీనిపై స్పందించిన న్యాయస్థానం... విచారణ సందర్భంగా అవినాశ్ రెడ్డి అతడి లాయర్ కు కనిపించేలా అనుమతి ఇవ్వగలరా అని సీబీఐని ప్రశ్నించగా.. అనుమతిపై ప్రయత్నిస్తామని దర్యాపు సంస్థ బదులిచ్చింది.
గత శుక్రవారం విచారణ తర్వాత సీబీఐ కార్యాలయం ముందు అవినాశ్ రెడ్డి మీడియాతో మాట్లాడటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మార్చి 10న సీబీఐ అధికారులు మూడోసారి అవినాశ్ రెడ్డిని విచారించిన సంగతి తెలిసిందే. ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత బయటకు వచ్చిన ఆయన... సీబీఐ ఆఫీసు వద్ద మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వివేకా హత్య కేసులో రెండో పెళ్లి అనేది కూడా కీలకమైన అంశమని... ఆ దిశగా కూడా సీబీఐ విచారణ జరిపించాలని అవినాశ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఓ ముస్లిం మహిళను వైఎస్ వివేకా 2010లో రెండో పెళ్లి చేసుకున్నారని.. వారికి ఓ కుమారుడు జన్మించాడని పేర్కొన్నారు. ఈ రెండో పెళ్లి కారణంగానే... వివేకానంద రెడ్డి కుటుంబంలో విభేదాలు వచ్చాయని చెప్పారు. ఆర్థిక లావాదేవీల విషయంలోను మనస్ఫర్ధలు తలెత్తాయని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే తనపేరుమీద ఉన్న ఆస్తులను రెండో భార్య పేరు మీద రాయాలని వివేకా భావించారని తెలిపారు. ఈ ఆస్తులపై జరిగిన గొడవల వల్లే వివేకానంద రెడ్డి హత్య జరిగిందని అవినాశ్ రెడ్డి ఆరోపించారు. అందుకే... ఈ కేసులో రెండో పెళ్లి కూడా కీలక అంశమని, సీబీఐ ఆ దిశగా విచారణ చేయాలని కోరారు.
సీబీఐ ఆఫీసు వద్దే ప్రెస్ మీట్ లో కేసు గురించి మాట్లాడటంపై సీరియస్ అయిన హైకోర్టు.... దర్యాప్తు జరుగుతుండగా సీబీఐ ఆఫీస్ వద్దే ప్రెస్‌మీట్ ఏంటని అవినాశ్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.