RJY Bus Accident: రాజమండ్రిలో ట్రావెల్స్ బస్సు బోల్తా, యువతి మృతి…మరో 5గురికి తీవ్ర గాయాలు
RJY Bus Accident: రాజమండ్రి శివార్లలో ట్రావెల్స్ బస్సు బోల్తా పడిన ఘటనలో ఓ యువతి మృతి చెందింది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళుతున్న కావేరి ట్రావెల్స్ బస్సు తెల్లవారుజామున రాజమండ్రి శివార్లలోని కాతేరు సమీపంలో బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
RJY Bus Accident: తూర్పు గోదావరిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 40మంది ప్రయాణికులతో విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళుతున్న కావేరి ట్రావెల్స్ బస్సు రాజమండ్రి శివార్లలోని కాతేరు వద్ద బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత ప్రమాదానికి గురైంది.
రాజమండ్రి శివార్లలో ఉన్న కాతేరు వద్ద కావేరి ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. బ్రాహ్మణ అగ్రహారం సమీపంలో రోడ్ డైవర్షన్ నేపథ్యంలో జాతీయ రహదారిపై మలుపు తీసుకుంటున్న సమయంలో వేగంగా ప్రయాణిస్తున్న బస్సును అదుపు చేయలేక పల్టీలు కొట్టింది. ఈ ఘటన జరిగిన వెంటనే ట్రావెల్స్ బస్సు డ్రైవర్, క్లీనర్ పరారయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో 40మంది ప్రయాణికులు ఉన్నారు
బస్సు బోల్తా పడటంతో ఐదుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. విశాఖపట్నంకు చెందిన కోనా మోహన కళ్యాణి అనే యువతి ప్రాణాలు కోల్పోయింది. హైదరాబాద్‌లో జరిగే ఓపరీక్షకు హాజరయ్యేందుకు కావేరి ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
ఈ ప్రమాదంలో గాయపడిన వారిని పోలీసులు కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మొత్తం 18మందికి గాయాలయ్యాయి. వారిలో 13మందికి స్వల్ప గాయాలు కావడంతో ప్రథమ చికిత్స తర్వాత తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. కాకినాడకు చెందిన సీహెచ్ కోటేశ్వరరావు, ధనలక్ష్మీ, రేణుకలను కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తేజస్విని, దీక్షితలను కిమ్స్ ఆస్పత్రిలో చేర్చారు.గాయపడిన వారిలో మెరుగైన వైద్యం కోసం ముగ్గురిని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి, ఇద్దరిని కిమ్స్‌కు తరలించారు.