AP Secretariat Assn: వెంకట్రామిరెడ్డిపై బిగుస్తున్న ఉచ్చు,అభియోగాల నమోదు.. చర్యలకు సిద్ధమవుతున్న ప్రభుత్వం
AP Secretariat Assn: ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఉచ్చు బిగుస్తోంది. ఎన్నికల కోడ్ వెలువడిన తర్వాత వైసీపీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించడంతో సస్పెన్షన్‌కు గురైన వెంకట్రామిరెడ్డిపై అభియోగాలను నమోదు చేశారు. కఠిన చర్యలు తీసుకునేందుకు ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధమవుతోంది.
AP Secretariat Assn: ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డిపై ఉచ్చు బిగుస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగ సంఘాల్లో అన్నీ తానై వ్యవహరించిన వెంకట్రామిరెడ్డి ఎన్నికల కోడ్ వెలువడిన తర్వాత కూడా తీరు మార్చుకోలేదు. పలు జిల్లాల్లో సమావేశాలు ఏర్పాటు చేసిన వైసీపీ తరపున ప్రచారం నిర్వహించాడు. దీంతో టీడీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో ఈసీ అతడిని సస్పెండ్ చేసింది.
ఈ వ్యవహారంలో తాజాగా బుధవారం ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కె. వెంకట్రామిరెడ్డిపై రాష్ట్ర ప్రభుత్వం అభియోగాలను నమోదు చేసింది. వెంకట్రామిరెడ్డిపై నమోదైన అభియోగాలకు 15 రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.
ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనా నియమావళి నిబంధనల ప్రకారం ఈ అభియోగాలు నమోదు చేసింది. అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తి నుంచి సంజాయిషీ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణా చర్యలు తీసుకుంటుంది.
2024 మార్చి 31వ తేదీన కడప, బద్వేలు, ప్రొద్దుటూరు, మైదుకూరులో ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నాయకుడు చంద్రయ్యతో కలిసి వెంకట్రామిరెడ్డి వైసీపీకి అనుకూలంగా ప్రచారం నిర్వహించారు. అప్పటికే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది.
ఎన్నికల నిబంధనల ఉల్లంఘనపై టీడీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై మొదట ఆర్టీసీ ఉద్యోగులను మాత్రమే సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారం దుమారం రేపడంతో ఈసీకి పలుమార్లు ఫిర్యాదులు అందాయి. చివరకు ఈసీ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం 2024 ఏప్రిల్ 18వ తేదీన జీవో జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ సచివాలయ ఉద్యోగ సంఘానికి అధ్యక్షుడిగా ఉంటూ ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా మాట్లాడినందుకు ఏపీ కాండక్ట్ రూల్స్ - 1964 ప్రకారం సస్పెన్షన్ వేటు తప్పదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
వెంకట్రామిరెడ్డి పంచాయతీరాజ్ శాఖలో సెక్షన్ అధికారి, సస్పెండ్ అయ్యే సమయానికి ఇన్‌ఛార్జి అసిస్టెంట్ సెక్రటరీ పోస్టులో ఉన్నాడు. మార్చి 31న ఆర్టీసీ సంఘాల నాయకులతో కలిసి ప్రచారం చేయడంపై టీడీపీ నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో ఆర్టీసీ ఉద్యోగ సంఘం నాయకుడు చంద్రయ్యతో పాటు మరో 11 మందిని 2024 ఏప్రిల్ 4వ తేదీనే నస్సెండ్ చేశారు.
ఈ సమావేశానికి నేతృత్వం వహించిన వెంకట్రామిరెడ్డిని మాత్రం విడిచిపెట్టారు. వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేయాలని ఎన్నికల సంఘం ఏప్రిల్ 8వ తేదీన ఆదేశించినా తాత్సారం చేశారు. దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగడంతో ఎన్నికల సంఘం నేరుగా జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని గుర్తు చేయడంతో విధిలేని పరిస్థితుల్లో సీఎస్ జవహర్ రెడ్డి సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.
వెంకట్రామిరెడ్డిని కాపాడటానికి ప్రభుత్వ సలహాదారుడు సజ్జలతో పాటు మాజీ సీఎంఓ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేసినా ఈసీ ఒత్తిడితో చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. రాజకీయ పార్టీలకు అనుకూలంగా మాట్లాడినందుకు రోసా నిబంధనల ప్రకారం అసోసియేషన్లో వెంకట్రామిరెడ్డి సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాల్సి ఉంటుందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. వెంకట్రామిరెడ్డిని సస్పెన్షన్‌తో సరిపెడతారా అంతకు మించి చర్యలు ఉంటాయా అనేది ఆసక్తికరంగా మారింది.