ఏపీలో ఆగస్టు 11 వరకు 17 రైళ్లు రద్దు... ప్రయాణికుల ఒత్తిడితో జన్మభూమి, సర్కార్ రైళ్లు పునరుద్ధరణ
ఆంధ్ర ప్రదేశ్‌లో భారీగా రైళ్లు రద్దు అయ్యాయి. దాదాపు 45 రోజులు రైళ్లు రద్దు కావడంతో ప్రయాణికులకు, వర్తకులకు, ఉద్యోగులకు, విద్యార్థులకు ఇక్కట్లు తప్పటం లేదు.

ఆంధ్ర ప్రదేశ్‌లో భారీగా రైళ్లు రద్దు అయ్యాయి. అయితే ప్రయాణికుల నుంచి వచ్చిన ఒత్తిడితో జన్మభూమి, సర్కార్ రైళ్లు పునరుద్ధరించారు. కొన్ని రైళ్లు ఆగస్టు 9న తిరిగి పునఃప్రారంభం అయితే, మరికొన్ని రైళ్లు ఆగస్టు 11న పునఃప్రారంభం అవుతాయి. మరోవైపు బస్సులు ఖాళీ లేక ప్రయాణికులకు ఇక్కట్లు తప్పటం లేదు. రాజమండ్రి, తిరుపతి, ఏలూరు, తాడేపల్లి గూడెం, కాకినాడ, విజయవాడ, మచిలీపట్నం, సికింద్రబాద్ వంటి ప్రధాన నగరాలకు వెళ్లే రైళ్లు రద్దు కావడంతో ప్రయాణికులు తమ ప్రమాణాలను రద్దు చేసుకుంటున్నారు. అలాగే అత్యవసరం అయినవారు బస్సు ప్రయాణాలను ఆశ్రయిస్తున్నారు.
రైళ్ల రద్దు ఎందుకు?
విజయవాడ డివిజన్‌లో నిడదవోలు-కడియం మధ్య కొన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దీనివల్ల ఈనెల 23 నుంచి ఆగస్టు 11 వరకు దక్షిణ మధ్య రైల్వే రైళ్లను రద్దు చేసింది. ఇప్పటికే విజయవాడ-విశాఖపట్నం (12718), విశాఖపట్నం-విజయవాడ (12717) రత్నాచల్ సూపర్ ఫాస్ట్, విశాఖ-గుంటూరు (17239), గుంటూరు-విశాఖ (17240) సింహాద్రి ఎక్స్‌ప్రెస్, విశాఖ-లింగంపల్లి (12805) జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగస్టు 10 వరకు రద్దు కాగా, లింగంపల్లి-విశాఖ (12806) జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు ఆగస్టు 11 వరకు రద్దు అయింది. ఇవి మూడు రూట్లలో ఆరు రైళ్లు రద్దు అయ్యాయి.
తాజాగా మరో 17 రైళ్లను రద్దు చేశారు. ఆగస్టు 9 వరకు తిరుపతి-విశాఖపట్నం (22708) డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ రైలు రద్దు అయింది. ఆగస్టు 10 వరకు విశాఖపట్నం- తిరుపతి (22707) డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం-గుంటూరు (22701), గుంటూరు-విశాఖపట్నం (22702) ఉదయ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, విశాఖపట్నం-రాజమండ్రి (07467), రాజమండ్రి-విశాఖపట్నం (07466) పాసింజర్ రైళ్లు, గుంటూరు-రాయగడ (17243) ఎక్స్‌ప్రెస్ రైలు, విశాఖపట్నం-మచిలీపట్నం (17220), మచిలీపట్నం-విశాఖపట్నం (17219) ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేశారు. ఆగస్టు 11 వరకు రాయగడ-గుంటూరు (17244) ఎక్స్‌ప్రెస్ రైలు రద్దు అయింది.
విశాఖపట్నం-మహబూబ్‌నగర్ (12861) సూపర్ ఫాస్ట్ రైలు, కాకినాడ టౌన్-తిరుపతి (17249) సూపర్ ఫాస్ట్ రైలు, పుదుచ్చేరి-కాకినాడ పోర్టు (17643) సర్కార్ ఎక్స్‌ప్రెస్, కాకినాడ టౌన్-లింగంపల్లి (12775) కోకనాడ సూపర్ ఫాస్ట్ రైలు ఆగస్టు 10 వరకు రద్దు అయ్యాయి. కాకినాడ టౌన్-తిరుపతి (17250) తిరుపతి ఎక్స్‌ప్రెస్, మహబూబ్‌నగర్-విశాఖపట్నం (12862), కాకినాడ పోర్టు-పుదుచ్చేరి (17244) సర్కార్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగస్టు 11 వరకు రద్దు అయ్యాయి. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.
జన్మభూమి, సర్కార్ రైళ్లు పునరుద్ధరణ
అయితే ప్రయాణికుల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా జన్మభూమి, సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లను పునరుద్ధరించారు. విశాఖపట్నం-లింగంపల్లి (12805) జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు ఆగస్టు 10 వరకు రద్దు అయింది. దీన్ని మంగళవారం నుంచి పునరుద్ధరిస్తున్నారు. లింగంపల్లి-విశాఖపట్నం (12806) జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు ఆగస్టు 11 వరకు రద్దు అయింది. ఈ రైలును బుధవారం నుంచి పునరుద్ధరిస్తున్నారు. పుదుచ్చేరి (చెంగలపట్టు)-కాకినాడ పోర్టు (17643) సర్కార్ ఎక్స్‌ప్రెస్‌ను ఆగస్టు 10 వరకు రద్దు చేశారు. అయితే దీన్ని మంగళవారం నుంచే పునరుద్ధిస్తున్నారు. కాకినాడ పోర్టు-పుదుచ్చేరి (చెంగలపట్టు) (17244) సర్కార్ ఎక్స్‌ప్రెస్ ఆగస్టు 11 వరకు రద్దు అయింది. అయితే దీన్ని బుధవారం నుంచి పునరుద్ధరిస్తున్నారు.
- జగదీశ్వరరావు జరజాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు