ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొమరోలు మండలం తాటిచెర్ల మోటు వద్ద జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. బాపట్ల జిల్లా స్టూవర్టు పురం గ్రామానికి చెందిన కుటుంబం విహార యాత్ర కోసం నంద్యాల జిల్లా మహానంది క్షేత్రానికి వెళ్ళి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో చిన్నారులు సహా ఆరుగురు మృతి చెందడం అందరిని కలిచి వేసింది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రకాశం జిల్లా ప్రమాదంపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంపై జిల్లా ఎస్పీ, ఇతర అధికారులతో మాట్లాడిన మంత్రి గొట్టిపాటి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందజేయాలని అధికారులకు ఆదేశించారు.