Vizag Suicides: విశాఖ జిల్లాలో విషాదం... యువ‌కుడితో వివాహేత‌ర సంబంధం.. జంట ఆత్మహత్య-tragedy in visakhapatnam district couple commits suicide due to extramarital affair ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vizag Suicides: విశాఖ జిల్లాలో విషాదం... యువ‌కుడితో వివాహేత‌ర సంబంధం.. జంట ఆత్మహత్య

Vizag Suicides: విశాఖ జిల్లాలో విషాదం... యువ‌కుడితో వివాహేత‌ర సంబంధం.. జంట ఆత్మహత్య

HT Telugu Desk HT Telugu

Vizag Suicides: విశాఖ‌ప‌ట్నం జిల్లాలో తీవ్ర విషాదం నెల‌కొంది. యువ‌కుడితో వివాహిత మ‌హిళకు వివాహేత‌ర సంబంధం ఏర్ప‌డింది.ఇది తెలిసి ఆ యువ‌కుడిని స్థానికులు,వివాహిత మ‌హిళ కుటుంబ స‌భ్యులు ప‌లుసార్లు హెచ్చ‌రించారు. అయిన‌ప్ప‌టికీ వారి మ‌ధ్య సంబంధం అలానే కొన‌సాగించారు. కలిసి బతకలేక బలవన్మరణానికి పాల్పడ్డారు.

వివాహేతర సంబంధం నేపథ్యంలో జంట ఆత్మహత్యలు

Vizag Suicides: విశాఖలో వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ జంట విడివిడిగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. యువ‌కుడు, వివాహిత మ‌హిళ ఒకే రోజు ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం సృష్టించింది.

విశాఖ‌ప‌ట్నం జిల్లా ప‌ద్మానాభం మండ‌లం కృష్ణాపురం గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, సానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం కృష్ణాపురం గ్రామంలో క‌న‌క‌ల శంక‌ర్‌, ల‌క్ష్మి (31) దంప‌తులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్ద‌రు కుమారులు ఉన్నారు. ఒక‌రు తేజేష్ (4వ త‌ర‌గ‌తి), ధ‌ను (2వ త‌ర‌గ‌తి) చ‌దువుతున్నారు. శంక‌ర్ ఇటుక బ‌ట్టీలో వ్యాన్ డ్రైవ‌ర్‌గా ఉంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అదే గ్రామానికి మొక‌ర ర‌వి, జానకి దంప‌తుల‌కు ఒక్క‌గానిఒక్క కొడుకు ఆదిత్య‌ (21) ఉన్నారు. ఆదిత్య వైజాగ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు.

క‌న‌క‌ల ల‌క్ష్మి (31), మొక‌ర ఆదిత్య (21) మ‌ధ్య గ‌త కొంత‌కాలంగా వివాహేత‌ర సంబంధం ఏర్ప‌డింది. ఈ క్ర‌మంలో ఆదిత్య‌కు ఆమె డ‌బ్బులు కూడా ఇచ్చేది. వారిద్ద‌రి మ‌ధ్య వివాహేత‌ర సంబంధం గురించి తెలిసి ఆ యువ‌కుడిని స్థానికులు, ల‌క్ష్మి కుటుంబ స‌భ్యులు ప‌లుసార్లు హెచ్చ‌రించారు. అయిన‌ప్ప‌టికీ వారి మ‌ధ్య సంబంధం అలానే కొన‌సాగింది. ఈ నేప‌థ్యంలో సోమ‌వారం ఉద‌యం ఇద్ద‌రి మ‌ధ్య ఆర్థిక వ్యవహారాల్లో చిన్న‌పాటి గొడ‌వ జ‌రిగింది. గ్రామంలో వీరి విష‌యం తెలిసిపోవడంతో క‌లిసి జీవించ‌డం సాధ్యం కాద‌ని భావించి బలవన్మరణానికి పాల్పడ్డారు.

గ్రామానికి దూరంగా ఉన్న ప‌ద్మనాభం జంక్ష‌న్ నుంచి త‌గ‌ర‌పువ‌ల‌స వెళ్లే మార్గంలో ఉన్న ఒక ప్రైవేట్ పాఠ‌శాల వెన‌కు ఉన్న‌ ఒక పాత బిల్డింగ్ లో ఆదిత్య చీర‌తో ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఆత్మ‌హ‌త్య చేసుకున్న స‌మ‌యంలో ఆదిత్య, ల‌క్ష్మి వీడియో కాల్ చేశాడు. ఆమె కూడా ఇంట్లో ఫ్యాన్‌కి ఉరి వేసుకుని ఆత్మహ‌త్య చేసుకుంది. ఆ స‌మ‌యంలో పిల్ల‌లు స్కూల్‌కు వెళ్లిపోయారు. భ‌ర్త ప‌నికి వెళ్లిపోయాడు. అయితే ల‌క్ష్మి ఇంటికి రుణం గురించి అడ‌గ‌టానికి ప‌క్క ఊరుకు చెందిన వ్య‌క్తి వ‌చ్చాడు. అప్పుడు త‌లుపు గ‌డియ‌పెట్టి ఉండటం ఇంట్లో టీవీ మాత్రం ఆన్ చేసి ఉంది.

అత‌ను త‌లుపు కొట్టినా తీయ‌కపోవడంతో ఆయ‌న స్థానిక మ‌హిళ‌ను పిలిచి తలుపు తెర‌వటం లేదు కాస్తా చూడు అన్నాడు. దీంతో ఆ మ‌హిళ త‌లుపుకొట్టి, ముందుకు నెట్టింది. లోపల లక్ష్మీ ఉరికి వేలాడుతుండటంతో ఆమె బ‌య‌ట‌కు ప‌రిగెత్తి ఈ విష‌యం అక్క‌డున్న‌వారికి చెప్పింది.

అదే సమయంలో ఆదిత్య ఆత్మ‌హ‌త్య చేసుకున్న భ‌వ‌నం ద‌గ్గ‌ర‌కు మ‌ద్యం సేవించేందుకు వెళ్లిన మృతదేహాన్ని కొందరు యువ‌కులు చూశారు. వెంట‌నే అక్క‌డే ఉన్న మేక‌ల కాప‌రికి చెప్పారు.

యువ‌కుల్లో ఒకరు ఆదిత్య పోల్చి, మృతుడి గ్రామానికి చెందిన వారికి ఫోన్ చేశాడు. దీంతో ఉపాధి ప‌నుల‌కు వెళ్లిన ఆ గ్రామానికి చెందిన‌ వారు వెంట‌నే హుటాహుటిన అక్క‌డికి వెళ్లారు. మ‌ద్యాహ్నం 1 గంట స‌మ‌యంలో ఆదిత్య ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. మృతదేహాన్ని గ్రామ‌స్తులే గ్రామానికి త‌ర‌లించారు. ఒకేరోజు ఇద్ద‌రు ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డంతో గ్రామంలో క‌ల‌క‌లం సృష్టించింది. దీంతో గ్రామంలో ఉద్రిక్త ప‌రిస్థితి నెల‌కొంది. రెండు మృత దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం భీమునిప‌ట్నం ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

ఇద్ద‌రూ ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెల‌కొంది. ల‌క్ష్మి ఆత్మ‌హ‌త్య వ‌ల్ల‌ అభం శుభం తెలియ‌ని ఇద్ద‌రు చిన్నారులు త‌ల్లి ప్రేమ‌కు దూర‌మ‌య్యారు. ఆదిత్య ఆత్మ‌హ‌త్య వ‌ల్ల వృద్ధాప్యంలో ఆస‌రా అవుతాడ‌నుకున్న ఒక్క‌గానొక్క కొడుకు అర్థాంత‌రంగా త‌నువు చాలించ‌డంతో ఆ త‌ల్లిదండ్రులు గుండెల‌విసేలా రోదిస్తున్నారు.

మృతురాలి ల‌క్ష్మి భ‌ర్త శంక‌ర్‌, మృతుడు ఆదిత్య తండ్రి ర‌వి ఇచ్చిన ఫిర్యాదుల మేర‌కు కేసు న‌మోదు చేశామ‌ని సీఐ సీహెచ్ శ్రీ‌ధ‌ర్ తెలిపారు. కేసు ద‌ర్యాప్తు జ‌రుగుతోంద‌ని అన్నారు. ఇద్ద‌రి సెల్‌ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఛాటింగ్‌, ఫోన్ రికార్డింగ్‌లు ప‌రిశీలిస్తున్నారు.

(జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)