ఎన్టీఆర్ జిల్లాలో విషాదం, బియ్యం డబ్బాలో ఇరుక్కొని బాలుడు మృతి-tragedy in ntr district seven years boy dies trapped in rice container ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ఎన్టీఆర్ జిల్లాలో విషాదం, బియ్యం డబ్బాలో ఇరుక్కొని బాలుడు మృతి

ఎన్టీఆర్ జిల్లాలో విషాదం, బియ్యం డబ్బాలో ఇరుక్కొని బాలుడు మృతి

ఎన్టీఆర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఏడేళ్ల బాలుడు బియ్యం డబ్బాలో ఇరుక్కొని మృతి చెందాడు. ఆడుకొంటూ బియ్యం డబ్బాలో దాక్కొన్న బాలుడు...గొళ్లెం పడిపోవడంతో అందులో ఇరుక్కుపోయాడు. బాలుడు ఊపిరాడక మృతి చెందారు.

ఎన్టీఆర్ జిల్లాలో విషాదం, బియ్యం డబ్బాలో ఇరుక్కొని బాలుడు మృతి

ఎన్టీఆర్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. ఉలవపూడి పవన్, సరస్వతి దంపతులు కంచికచర్లలోని అరుంధతీ నగర్‍లో నివాసం ఉంటున్నారు. వీరికి వికాస్, వినయ్ అనే కవల పిల్లలు ఉన్నారు. వేసవి సెలవులు కావడంతో సరస్వతి తన ఇద్దరు పిల్లలను ఖమ్మం జిల్లా మడుపల్లిలో ఉంటున్న తన అక్క వద్దకు పంపింది.

ఆధార్ కార్డులో మార్పులు చేయాల్సి ఉందని, చిన్నారులను తిరిగి కంచికచర్ల తీసుకొచ్చారు. శనివారం స్థానికంగా ఉండే పిల్లలతో వినయ్ ఆడుకుంటున్నాడు. దొంగ, పోలీస్ ఆట ఆడుతూ దాక్కునేందుకు ఇంటిపైకి వెళ్లాడు వినయ్. అక్కడున్న బియ్యం డబ్బాలోకి దూరి మూత వేసుకున్నాడు.

బియ్యం డబ్బా గొళ్లెం పడిపోయి

మూత బలంగా వేసుకోవడంతో బియ్యం డబ్బా గొళ్లెం పడింది. దీంతో బాలుడు ఎంత ప్రయత్నించినా మూత తెరుచుకోలేదు. ఎంత సేపటికీ బాలుడు కనిపించకపోవడంతో వినయ్ తల్లిదండ్రులు చిన్నారి వెతకడం మెుదలుపెట్టారు. ఇంటి చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో, స్థానికంగా గాలించారు.

అయినా బాలుడి ఆచూకీ లభ్యం కాలేదు. పొద్దుపోయినా బాలుడి జాడ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బియ్యం డబ్బాలో ఇరుక్కొని

బాలుడి కోసం గాలిస్తూ అర్ధరాత్రి వేళ ఇంటిపైకి వెళ్లిన సర్వసతికి బియ్యం డబ్బా కనిపించింది. అనుమానంతో బియ్యం డబ్బా ఓపెన్ చేయగా బాలుడు అందులో విగతజీవిగా కనిపించాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోధించారు. వారిని చూసి స్థానికులు సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు.

బియ్యం డబ్బా మూతపడిపోయి ఊపిరాడక బాలుడు మృతిచెందినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

నిర్మల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

నిర్మల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున నీలాయిపేట దగ్గర కారు డీసీఎంను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు నుజ్జు నుజ్జు అయ్యింది. వెనక టైర్ ఊడిపోయింది. కారులో ప్రయాణిస్తున్న తండ్రి అశోక్ (45), కూతురు కృతిక (20) అక్కడికక్కడే మృతిచెందారు. కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

అతి వేగమే కారణమా?

ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులు ఆదిలాబాద్‌లోని రవీంద్ర నగర్‌కు చెందిన వారిగా గుర్తించారు.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం