Nellore Tragedy: నెల్లూరు జిల్లాలో విషాదం… సహాయం చేయడానికి వెళ్లిన ఇద్దరు గిరిజనుల మృత్యువాత
Nellore Tragedy: నెల్లూరు జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. బోల్తా పడిన ఆటోని లేపేందుకు ఇద్దరు గిరిజనులు సహాయం చేసేందుకు వెళ్లారు. అయితే ఆటో లేపే క్రమంలో విద్యుత్ షాక్ గురై అక్కడికక్కడే ఇద్దరు గిరిజనులు మృతి చెందారు. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి.
Nellore Tragedy: నెల్లూరు జిల్లా దగదర్తి మండలం తడకలూరు గ్రామంలో విషాద ఘటన బుధవారం చోటు చేసుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తడకలూరు గ్రామంలోని గిరిజన కాలనీకి చెందిన మనోహర్, మహాలక్ష్మమ్మ గేదెలకు మేత పచ్చగడ్డి తెచ్చేందుకు ఆటోలో తలమంచి మేజర్ కాలువపై వెళ్తున్నారు. ఈ సమయంలో ఆటో ప్రమాదానికి గురై బోల్తా పడుతున్న సమయంలో మనోహర్, మహాలక్ష్మమ్మ ఇద్దరూ ఆటో నుంచి బయటకు దూకేశారు. దీంతో ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.
ఆ తర్వాత పొలాల్లో బోల్తా పడిన ఆటోను పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కాని వారిద్దరు వల్ల కావటం లేదు. దీంతో వారు స్థానిక గిరిజనుల సాయాన్ని వారు కోరారు. మానవత్వంతో వారికి సహాయం చేసేందుకు ఇద్దరు గిరిజనులు మనికలా నరసయ్యయ (24), పొట్లూరి పోలయ్య (45) వెళ్లారు. ఆటోను పైకి లేపుతున్న సమయంలో పొలాల్లో సాగునీటి మోటర్లకు వినియోగించే విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఆ విద్యుత్ తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురై ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.
విషయం తెలుసుకున్న మృతుల కుటుంబాలు సంఘటనా స్థలానికి చేరుకుని గుండెలవిసేలా రోదించాయి. పోలయ్యకు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. నలుగురు పిల్లలు ఉన్నారు. నరసయ్యకు ఇంకా వివాహం కాలేదు. దగదర్తి ఎస్ఐ జంపాని కుమార్, ట్రాన్స్‌కో ఏఈ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాలను ఆసుప్రతికి తరలించారు.
ఈ ఘటన తడకలూరు గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరు అయ్యారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహాలను తీసుకొచ్చి గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన పట్ల కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను పరామర్శించి, రెండు కుటుంబాలకు రూ.50 వేల చొప్పున సహయం అందజేశారు.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)