Nellore Suicide: నెల్లూరులో విషాదం.. అత్తింట్లో కుమార్తెకు వేధింపులు, తల్లడిల్లిన తండ్రి సొంతూళ్లో ఆత్మహత్య…
Nellore Suicide: ముప్పై ఏళ్ల క్రితం ఉపాధి కోసం ఊరొదిలి వెళ్లిన వ్యక్తి కుమార్తె కాపురంలో గొడవలు రావడంతో కలత చెంది, సొంత ఊరు వెళ్లి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. విశాఖలో స్థిరపడిన వ్యక్తి నెల్లూరులో సొంతూళ్లో ఆత్మహత్య చేసుకోవడంతో బంధువులు విశాఖ తరలి వచ్చి ఆందోళనకు దిగారు.
Nellore Suicide: విశాఖపట్నంలో స్థిరపడిన ఇటుక బట్టీల నిర్వాహకుడు నెల్లూరు జిల్లాకు వెళ్లిఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒక్కగానొక్క కుమార్తెకు ఉన్నంతలో ఘనంగా వివాహం చేసుకున్నా అత్తింట్లో వేధింపులు తప్పలేదు. బంధువులే అయినా రాబందుల్లా పీక్కు తిన్నారు. అత్తింటి ఆరళ్లకు కూతురు బలవుతుందని పుట్టింటికి తీసుకొచ్చేసిన వారి వేధింపులు ఆగకపోవడంతో సీఎం, డిప్యూటీ సీఎంల పేరిట సూసైడ్ నోట్‌రాసి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ టన నెల్లూరు జిల్లా కలిగిరిలో గురువారం చోటుచేసుకుంది. దీంతో రగిలిపోయిన బంధువులు విశాఖపట్నంలో అతని అల్లుడు ఇంట ఆందోళనకు దిగారు.
నెల్లూరు కలిగిరి మండలం తూర్పు దూబగుంటకు చెందిన బొట్టా శ్రీనివాసులు (52) 30 ఏళ్ల క్రితం సొంతూరు వదిలి ఉపాధి కోసం విశాఖ జిల్లా భీమిలికి వెళ్లాడు. అక్కడే నివాసం ఉంటేూ ఇటుక బట్టీల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నాడు. భార్య, కుమారుడు, కుమార్తెతో సంతోషంగా గడిచేది. పిల్లల్ని ఉన్నత విద్యావంతుల్ని చేశాడు.
ఈ క్రమంలో భార్య బంధువైన సూర్యకుమారి రెండో కుమారుడు చంద్రశేఖర్‌కు తన కూతురు యమున (24)ను ఇచ్చి ఐదేళ్ల క్రితం ఘనంగా వివాహం చేశాడు. వీరికిఓ కుమారుడు(3) ఉన్నాడు. ఈ క్రమంలో అప్పటివరకు బీడుగా ఉన్న భూముల పక్కన హైవే రావడంతో యమున అత్తింటివారి భూములకు రూ.కోట్లలో ధర పలికాయి.
ఒక్కసారిగా కోట్లలో డబ్బు రావడం, చంద్రశేఖర్ కంటే యమున ఉన్నత చదువులు చదువుకోవడం వంటి కారణాలతో కొంత కాలంగా యమునను వదిలించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో శ్రీనివాసులు తన కుమార్తెను ఇంటికి తెచ్చుకున్నాడు. ఆ తర్వాత రాజకీయ అండదండలతో యమున అత్తింటివారు.. ఆమెపై దాడి చేసి, మూడేళ్ల కుమారుడిని బలవంతంగా తీసుకెళ్లిపోయారు.
ఈ విషయంలో యమున తండ్రి స్థానిక మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు కాలేదు. కొడుకు కోసం కూతురు పడుతున్న బాధను చూడలేక విశాఖపట్నం నెల్లూరులోని కలిగిరి వచ్చిన శ్రీనివాసులు నాలుగు రోజులుగా తమ్ముడి వద్ద ఉంటున్నాడు.
కూతురి విషయంలో జరుగుతున్న పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురై ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పేరుతో సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భీమిలి నుంచి వచ్చిన మృతుడి భార్య కుమారుడు, కుమార్తె, బంధువులు గురువారం కలిగిరి పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. ఆత్మహత్యకు కారకులైనవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
తాను కూడా టీడీపీ సభ్యుడినేనని, తన కుమార్తెను కాపాడాలంటూ ఐడీ కార్డుతో సహా రాసిన సూసైడ్ నోట్ స్థానికంగా సంచలనం రేపింది. ఉపాధి కోసం దూరప్రాంతానికి వెళ్లిన శ్రీనివాసులు 30ఏళ్ల తర్వాత సొంతూరు వచ్చి ఆత్మహత్య చేసుకోవడం గ్రామస్తుల్ని కలిచివేసింది.