Nandhyala Suicides: నంధ్యాలలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇంజనీరింగ్ కోర్సును మధ్యలో ఆపేసిన సునీల్ అనే యువకుడు స్థానికంగా ఉన్న హిజ్రాలతో కలిసి తిరుగుతూ వారిలో ఒకరిపై మనసు పడ్డాడు. హిజ్రాను పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులకు చెప్పాడు.
కుమారుడి నిర్వాకంతో మనస్తాపం చెందిన తల్లిదండ్రులు అతనికి నచ్చ చెప్పేందుకు ప్రయత్నించారు. బంధువులతో చెప్పించారు. హిజ్రాల వద్దకు వెళ్లకుండా కట్టడి చేశారు. అయినా అతను దారికి రాలేదు.
నంధ్యాల పట్టణంలో ఆలయం వద్ద చిరు దుకాణం నడుపుకునే సుబ్బారాయుడు, సరస్వతి దంపతులకు సునీల్ అనే కుమారుడు ఉన్నాడు. తాము పడిన కష్టాలు కుమారుడికి రాకూడదని ఉన్నత విద్యను నేర్పించాలని చూశారు. స్తోమతకు మించి ఇంజనీరింగ్‌లో జాయిన్ చేశారు. మొదటి సంవత్సరం చదువుతూ మధ్యలోనే చదువు ఆపేసిన మధు హిజ్రాలతో స్నేహం చేశాడు. డబ్బు సంపాదన కోసం ఆటో నడపడం మొదలు పెట్టాడు.
ఈ క్రమంలో సునీల్ తాను ఓ హిజ్రాను ఇష్ట పడినట్టు ఇంట్లో వారికి చెప్పాడు. హతాశులైన హిజ్రాతో పెళ్ళికి అంగీకరించలేదు. అతడిని ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా కట్టడి చేశారు. విషయం తెలిసిన హిజ్రాలు వారి దుకాణం వద్దకు వచ్చి గొడవ చేయడం ప్రారంభించారు.
సునీల్ గతంలో హిజ్రా నుంచి ఖర్చుల కోసం రూ.30వేలు తీసుకున్నాడని వడ్డీతో కలిపి వాటిని చెల్లించాలని అల్లరి చేశారు. అప్పులు తీర్చేందుకు గడువు కోరినా వినకుండా అతడిని తమకు అప్పగించాలని ఒత్తిడి చేశారు. మరోవైపు సునీల్ కూడా వారితో వెళ్లడానికే నిర్ణయించుకోవడంతో తల్లిదండ్రులు తల్లడిల్లి పోయారు.
సోమవారం మధ్యాహ్నం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. వారిని గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున సుబ్బారాయుడు, సరస్వతీ దంపతులు కన్నుమూశారు. తల్లిదండ్రులు చనిపోవడానికి తానే కారణమంటూ సునీల్ ఆస్పత్రి వద్ద విలపించాడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సుబ్బారాయుడు దుకాణం వద్ద హంగామా చేసిన వారి కోసం గాలిస్తున్నారు.