Rajoli tragedy: కర్నూలు ఆస్పత్రిలో విషాదం, తండ్రి కన్నుమూసిన గంటకు బిడ్డకు జన్మనిచ్చిన తల్లి
Rajoli tragedy: కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో విషాద ఘటన చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ యువకుడు కన్నుమూసిన గంటల వ్యవధిలోనే అతని భార్య అదే ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. అదే ఆస్పత్రిలో భర్త విగతజీవిగా మారిన విషయాన్ని భార్యకు చెప్పలేక బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.
Rajoli tragedy: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ యువకుడు కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. అదే ఆస్పత్రిలో ప్రసవం కోసం వచ్చిన అతని భార్య అక్కడే మగబిడ్డను ప్రసవించింది.
తెలంగాణలోని జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలంలోని తుమ్మలపల్లె గ్రామానికి చెందిన శివకు ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి కర్నూలు జిల్లా బనగానపల్లి గ్రామానికి చెందిన లక్ష్మితో ఏడాది క్రితం పెళ్ళైంది. మండల కేంద్రం రాజోలిలో పెట్రోలుబంకులో పనిచేస్తున్నాడు. మంగళవారం తుమ్మలపల్లె నుంచి రాజోళికి వెళ్తున్న క్రమంలో బైక్ అదుపు తప్పిశివ కింద పడటంతో తలకు గాయాలయ్యాయి. స్థానికులు అతడిని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
కుటుంబసభ్యులు ఈ విషయాన్ని బనగానిపల్లెలో ఉన్నశివ భార్య లక్ష్మీకి తెలిపినా అతనికి ప్రాణాపాయం లేదని ధైర్యం చెప్పారు. మంగళవారం రాత్రే లక్ష్మికి పురిటినొ ప్పులు రావడంతో రాత్రి 10 గంటలకు ఆమెను కూడా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే చేర్చారు.
బుధవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో పరిస్థితి విషమించడంతో శివ మృతి చెందాడు. అప్పటికే అతని భార్య ప్రసవ నొప్పులు భరిస్తోంది. అనంతరం వైద్యులు ఆమెకు సిజేరియన్ ద్వారా ప్రసవం చేయడంతో... మగబిడ్డ జన్మించాడు. తండ్రి కన్నుమూసిన తర్వాత బిడ్డ జన్మించడంతో బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. శివపై ఆధారపడిన అతని తల్లి కన్నీరుమున్నీరుగా విలపించడం చూపరుల్ని కలిచి వేసింది.