Konaseema blast: కోనసీమ జిల్లాలో విషాదం... బాణసంచా తయారీ ఇంట్లో భారీ పేలుడు... ఏడుగురికి తీవ్ర గాయాలు
Konaseema blast: కోనసీమ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బాణసంచా తయారీ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. దీంతో ఆ ఇల్లు నేటమట్టం కాగా, ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ చెల్లా చెదురుగా ఎగిరిపడ్డాయి.
Konaseema blast: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని రావుల చెరువు సమీపంలో సోమవారం బాణసంచా తయారు చేస్తున్న ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు ధాటికి భవనం పూర్తిగా నేలమట్టమైంది. త్వరలో దీపావళి రాబోతున్న నేపథ్యంలో రావుల చెరువు సమీపంలో కొవ్వాల నాగేశ్వరరావు కుటుంబం రహస్యంగా బాణసంచాను తయారు చేస్తోంది.
ఎప్పటిలాగే సోమవారం కూడా బాణసంచా పనిలో నిమగమయ్యారు. ఆ సమయంలో ఇంట్లో కొవ్వాల నాగేశ్వరరావుతో పాటు ఆయన భార్య కొవ్వాల నాగలక్ష్మి, కుమారుడు కొవ్వాల రాజు, కుమార్తె కట్టా వేణు, మనువడు కట్టా వెంకట్, మనువరాలు మోహన్ ప్రియ, స్థానికుడు చొల్లంగి సుబ్రహ్మణ్యం ఉన్నారు. ప్రమాదవశాత్తు నిప్పురవ్వలు పటాస్ పౌడర్‌లో పడటంతో నిప్పు అంటుకుంది. ఇది గమనించిన వెంటనే ఇంట్లో ఉన్న వారంతా బయటకు పరుగులు తీశారు. ఈ నేపథ్యంలో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది.
ఇంట్లో ఉన్న రెండు గ్యాస్ సిలిండర్లు సైతం పేలడంతో భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు తీవ్రతకు ఇంట్లో ఉన్న బైకులు పది మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయి. ఆ భవనానికి పక్కనే ఉన్న రెండు భవనాలు కూడా దెబ్బతిన్నాయి. గాయపడిన వారిని అమలాపురం ప్రాంతీయ ఆసుపత్రికి, కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
సమాచారం తెలుసుకున్న అమలాపురం పట్టణ సీఐ వీరబాబు పోలీసు బృందంతో కలిసి ఘటనా స్థలానికి హుటాహుటినా చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. నాగేశ్వరరావుకు చుట్టకాల్చే అలవాటు ఉందని, ఆ నిప్పురవ్వలు పడి ప్రమాదం సంభవించి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కూడా కారణమై ఉండొచ్చిని, మెగ్నీషియం, పొటాష్ రాపిడి వల్ల కూడా మంటలు వ్యాపించే అవకాశం ఉందని అగ్నిమాపక శాఖ అధికారులు తెలుపుతున్నారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, సీపీఎం జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరావు పరామర్శించారు. ఎమ్మెల్యే ఆనందరావు జిల్లా కలెక్టర్, ఆర్డీవోతో మాట్లాడి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చూడాలని కోరారు. బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని, పూర్తిగా శిథిలమైన ఇంటిని పునర్నిర్మించాలని రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్‌ను అండ్ర మాల్యాద్రి, కారెం వెంకటేశ్వరరావు, జీ.దర్గాప్రసాద్, మోహన్‌రావులతో కూడిన సీపీఎం బృందం కోరింది. పాక్షికంగా నష్టపోయిన ఇళ్లకూ పరిహారం ఇవ్వాలని కోరింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని, బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానని మంత్రి తెలిపారు.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)