Tirupati Accident: వినోదంలో విషాదం.. క్రాస్ వీల్ ఊడి.. 20 అడుగుల ఎత్తు నుంచి పడటంతో యువతి దుర్మరణం
Tirupati Accident: ఆటవిడుపు కోసం అర్థాంతరంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన తిరుపతి శిల్పారామంలో జరిగింది. ప్లే జోన్‌లో ఉన్న శిల్పారామంలో క్రాస్ వీల్ బకెట్ ఊడిపడటంతో అందులో కూర్చున్న యువతులు కిందపడిపోయారు. ఈ ఘటనలో ఓ యువతి ప్రాణాలు కోల్పోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
Tirupati Accident: ఆదివారం సరదాగా గడిపేందుకు వెళ్లిన ఇద్దరు యువతులు అనూహ్యంగా ప్రమాదానికి గురయ్యారు. తిరుపతి మండలం తిరుచానూరు శిల్పారామంలో జరిగిన ప్రమాదంలో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. క్రాస్ వీల్‌లో కూర్చున్న ఇద్దరు యువతులు 20 అడుగుల ఎత్తు నుంచి కింద పడిపోవడంతో తీవ్రగాయాలతో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
గాయపడిన యువతిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతురాలిని తిరుపతిలోని సుబ్బారెడ్డి నగర్‌కు చెందిన లోకేశ్వరిగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తిరుపతి జిల్లా, తిరుచానూరు రోడ్డు లోని శిల్పారామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. సరదాగా ఎక్కిన క్రాస్ వీల్ తుప్పు పట్టి ఊడి కిందపడటంతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. తిరుపతికి చెందిన లోకేశ్వరి(25), గౌతమి లు ఆదివారం సెలవు కావడంతో సరదాగా గడిపేందుకు శిల్పారామం వచ్చారు.
ఇద్దరు కలిసి అక్కడ ఉన్న క్రాస్ వీల్ ఎక్కారు. అది వేగంగా తిరుగుతుండగా యువతులు కూర్చొన్న సీటు దాదాపు 20 అడుగుల ఎత్తు నుంచి ఊడి కింద పడింది. దీంతో లోకేశ్వరి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందింది. గౌతమికి తీవ్రంగా గాయపడటంతో నగరంలోని ప్రైవేటు ఆసు పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
క్రాస్ వీల్‌కు ఉన్న కుర్చీలో ఒకరే కూర్చోవాల్సి ఉండగా ఇద్దరిని కూర్చోబెట్టారు. అప్పటికే అది తుప్పుపట్టి బలహీనంగా ఉండటంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అందులో ఉన్న కుర్చీలన్ని విరిగిపోడానికి సిద్ధంగా ఉన్నాయని గుర్తించారు. ఎమ్యూజ్‌మెంట్ పార్క్ నిర్వాహకుడు ప్రభాకర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.