East Godavari Suicide: తూర్పుగోదావరి జిల్లాలో విషాదం, భార్యపై అనుమానంతో భర్త వేధింపులు, ఆత్మహత్య చేసుకున్న భార్య..
East Godavari Suicide: తూర్పుగోదావరి జిల్లాలో విషాదం నెలకొంది. భార్యపై అనుమానంతో భర్త వేధింపులకు పాల్పడ్డాడు. భర్త అనుమానపూరిత మానసిక, శారీరక వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య చేసుకుంది. దీంతో భర్త పరారయ్యాడు. పిల్లలు దిక్కుతోచన స్థితిలో విలపిస్తున్నారు.
East Godavari Suicide: వారిద్దరూ ప్రేమించి మతంతర వివాహం చేసుకున్నారు. కుటుంబం సజావుగా సాగుతోంది. ఇద్దరు పిల్లలు పుట్టారు. భర్త మద్యానికి బానిస అయ్యాడు. భార్యపై అనుమానం పెంచుకున్నాడు. దీంతో భార్యను వేధింపులు, చిత్రహింసలకు గురి చేశాడు. వీటిని తాళలేక భార్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడైన భర్తపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
నూతన సంవత్సరం రోజున తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. గోకవరం ఎస్ఐ పవన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం జగ్గంపేట మండలం మల్లిశాలకు చెందిన గండేపల్లి అనూష (24), గోకవరం గ్రామానికి చెందిన షేక్ మీరా సాహెబ్ ఎనిమిదేళ్ల క్రితం ప్రేమించుకుని మతంతర వివాహం చేసుకున్నారు.
వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరు గోకవరం పోలీస్‌స్టేషన్ వెనక వీధిలోనే నివాసం ఉంటున్నారు. అనూష భర్త షేక్ మీరా సాహెబ్ డ్రైవర్‌గా పని చేస్తూ మద్యానికి బానిస అయ్యాడు. ఈ క్రమంలోనే భార్యపై అనుమానం పెంచుకున్నాడు.
ఇటీవలి కాలంలో ప్రతి రోజూ మద్యం ఫుల్‌గా సేవించి ఇంటికి వచ్చేవాడు. భార్యపై పెంచుకున్న అనుమానంతో ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించేవాడు. అంతేకాకుండా చిత్ర హింసలకు గురిచేసేవాడు. భర్త వేధింపులను తాళలేక అనూష తీవ్ర మనస్తాపనకు గురయింది. జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధపడింది. అందులో భాగంగానే బుధవారం ఉదయం ఇద్దరు పిల్లలను స్కూల్‌కు పంపించేసింది.
ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆత్మహత్య చేసుకోవడానికి ఇదే సమయమని భావించింది. అనూష చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు ద్వారా సమాచారం అందుకున్న అనూష కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకుని బోరున విలపించారు. భర్త వేధింపుల కారణంగా తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని పేర్కొంటున్నారు.
మరోవైపు భార్య ఆత్మహత్య సమాచారం తెలుసుకున్న భర్త షేక్ మీరా సాహెబ్ పరారీ అయ్యాడు. మహిళ ఆత్మహత్య ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ స్థానికులను వివరాలు అడిగి నమోదు చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తండ్రి వీరబాబు ఇచ్చి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్ఐ పవన్ కుమార్ తెలిపారు.
ఈ ఘటనతో గోకవరం గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. బంధువులు కన్నీరు మున్నీరు అయ్యారు. తల్లి మృతి చెందడం, తండ్రి పరారీలో ఉండటంతో చిన్నారులిద్దరూ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. చిన్నారులను చూసి స్థానికుల్లో కలచివేసింది.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)