Tatiparru Tragedy: తూర్పు గోదావరిలో విషాదం, విగ్రహావిష్కరణ ఏర్పాట్లలో విద్యుత్ షాక్‌తో నలుగురు దుర్మరణం
Tatiparru Tragedy: తూర్పు గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. విగ్రహావిష్కరణ ఏర్పాట్లు చేస్తుండగా ఫ్లెక్సీలకు విద్యుత్ తీగలు తగలడంతో నలుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలోని తాటిపర్రులో ఈ ఘటన చోటు చేసుకుంది.
Tatiparru Tragedy: తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాఝవరం మండలం తాటిపర్రు గ్రామంలో జరిగిన ఘోర ప్రమాదంలో నలుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. గ్రామంలో విగ్రహావిష్కరణ ఏర్పాట్లు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి గ్రామ కూడలిలో సర్దార్ పాపన్న విగ్రహావిష్కరణ ఏర్పాట్లు చేస్తున్న యువకులు విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ ఘటనలో నలుగురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
తాటిపర్రు గ్రామంలో సర్దార్ పాపన్న విగ్రహావిష్కరణపై కొద్ది కాలంగా వివాదం నెలకొంది. రెండు వర్గాల మధ్య వివాదాన్ని పరిష్కరించి సోమవారం విగ్రహావిష్కరణకు ఆర్డీఓ అనుమతి మంజూరు చేశారు. సోమవారం ఉదయం సినీ నటుడు సుమన్ విగ్రహావిషష్కరణ చేయాల్సి ఉంది. వివాదాలు సద్దుమణగడంతో సోమవారం విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు చేశారు. సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని అలంకరించి దాని చుట్టూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. ఫ్లెక్సీలకు ఉన్న మెటల్ ఫ్రేమ్ విద్యుత్ తీగలకు తాకడంతో అందులోకి విద్యుత్ ప్రవహించి విద్యుదాఘాతంతో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. విద్యుదాఘాతానికి గురైన వారిని వెంటనే స్థానికులు తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన మరో యువకుడిని విజయవాడకు తరలించారు.
మృతి చెందిన వారిని దేవరాజు, నాగరాజు, మణికంఠ, కృష్ణలుగా గుర్తించారు. వీరిలో ముగ్గురికి వివాహాలు జరిగినట్టు కుటుంబ సభ్యులు వివరించారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో 15అడుగుల ఎత్తు ఉన్న ఫ్లెక్సీ ఫ్రేమ్ నిలబెడుతుండగా ఈ ఘటన జరిగినట్టు స్థానికులు తెలిపారు.
ఆరుగురు యువకులు ప్రమాదం జరిగిన సమయంలో సర్దార్ పాపన్న ఫోటో ఫ్లెక్సీ కడుతున్నట్టు పోలీసులు వివరించారు. ఒకరు సురక్షితంగా బయటపడగా ఐదుగురుకు కరెంట్ షాక్‌కు గురయ్యారు. చీకట్లో విద్యుత్ తీగలను గమనించకపోవడంతో ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు.
ముఖ్యమంత్రి సంతాపం… రూ.5లక్షల పరిహారం
తూర్పుగోదావరి జిల్లాలో విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందిన ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఉండ్రాజవరం మండలం తాడిపర్రులో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ సందర్భంగా ప్లెక్సీ కడుతూ వీర్రాజు, నాగేంద్ర, మణికంఠ, కృష్ణ అనే నలుగురు మృతి చెందడంపై సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడటం బాధాకరమన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో విద్యుత్ షాక్ తో నలుగురు యువకులు మృతి చెందిన ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సామాజిక విప్లవకారుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ ఏర్పాట్లలో భాగంగా ప్రమాదం జరగడం చాలా బాధకరమన్నారు.ఫ్లెక్సీలు కడుతూ విద్యుత్ షాక్ తో మరణించిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని ఆమె స్పష్టం చేశారు.